వేషం మార్చి పరారీ!

ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేత అమృత్‌పాల్‌ సింగ్‌ పరారీకి సంబంధించి శనివారం మరో సీసీ టీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది.

Published : 26 Mar 2023 04:52 IST

ప్యాంటు, కోటు ధరించిన అమృత్‌పాల్‌
పటియాలాలో చక్కర్లు
ఫుటేజీ వెలుగులోకి

చండీగఢ్‌: ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేత అమృత్‌పాల్‌ సింగ్‌ పరారీకి సంబంధించి శనివారం మరో సీసీ టీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ప్యాంటు, కోటు ధరించి ఫోన్లో మాట్లాడుతూ పటియాలా ప్రాంతంలో వెళ్తున్నట్లుగా ఆయన చిత్రాలు కెమెరాలో రికార్డయ్యాయి. అయితే తేదీ తెలియడంలేదు. పోలీసులూ దీనిపై ఇప్పటివరకూ స్పందించలేదు. ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత అయిన అమృత్‌పాల్‌ తెల్లని వస్త్రాన్ని ముఖానికి అడ్డుపెట్టుకుని బ్యాగుతో వెళ్తున్నట్లుగా ఉంది. ఆయనతోపాటు సహచరుడు పాపల్‌ప్రీత్‌ సింగ్‌ ఉన్నారు. మరో ఫుటేజీలో కళ్లజోడు ధరించి రోడ్డుపై నడుచుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్నట్లు ఉంది. అమృత్‌పాల్‌ సహాయకుడి నుంచి శుక్రవారం స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో పలు చిత్రాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఖలిస్థానీ జెండా, ముద్ర, కరెన్సీ, ఆయుధ శిక్షణ పొందుతున్న వీడియోలు అందులో ఉన్నాయని తెలిపారు.

జమ్ములో ఇద్దరి అరెస్టు

జమ్ములోని ఆర్‌.ఎస్‌.పుర శివార్లలో పాపల్‌ప్రీత్‌ సింగ్‌కు సహాయం చేసిన జంటను జమ్ము పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అమ్రిక్‌సింగ్‌, సరబ్జీత్‌ కౌర్‌లను అరెస్టు చేసి పంజాబ్‌ పోలీసులకు అప్పగించినట్లు వారు తెలిపారు.

బ్రిటన్‌, అమెరికా, కెనడాల్లో  ఖలిస్థాన్‌ అనుకూల ప్రదర్శనలు

ఖలిస్థాన్‌కు అనుకూలంగా శనివారం బ్రిటన్‌, అమెరికా, కెనడాల్లో ప్రదర్శనలు జరిగాయి. లండన్‌లోని పార్లమెంటు వీధిలో కొద్ది మంది ప్రదర్శన నిర్వహించారు. ఖలిస్థాన్‌ జెండాలు, బ్యానర్లు పట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. కెనడాలోకి వాంకూవర్‌, టొరంటో, అమెరికాలోని ఇండియానా పొలీస్‌లనూ ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు లండన్‌లోని భారత హైకమిషనరు కార్యాలయానికి మరింత భద్రత కల్పిస్తామని కామన్స్‌ పెన్నీ మోర్డాంట్‌ తెలిపారు.


భారత్‌కు మద్దతుగా ర్యాలీ

వాషింగ్టన్‌: భారత్‌కు మద్దతుగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారతీయ అమెరికన్లు శాంతి ర్యాలీ నిర్వహించారు. గతంలో ఖలిస్థాన్‌ అనుకూల ఆందోళనకారులు దాడి చేసిన భారత్‌ కాన్సులేట్‌ ఎదుట వారు ఈ ర్యాలీ చేశారు. జాతీయ జెండాలతో భారీ సంఖ్యలో భారతీయ అమెరికన్లు ర్యాలీలో పాల్గొన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని