అవయవ దానానికి ప్రజలు ముందుకు రావాలి

ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారని, అవయవ దాన ప్రక్రియను సులభతరం చేయడానికి తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Published : 27 Mar 2023 05:07 IST

ఈ ప్రక్రియను సులభతరం చేసేలా ఏకీకృత విధానం తెస్తాం
‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ

దిల్లీ: ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారని, అవయవ దాన ప్రక్రియను సులభతరం చేయడానికి తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారం నిర్వహించిన ‘మన్‌ కీ బాత్‌’ రేడియో కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. అవయవాలు అవసరమైనవారు దేశంలో ఎక్కడి నుంచైనా స్వయంగా నమోదు చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర నివాసానికి సంబంధించిన నిబంధనను తొలగించినట్లు మోదీ గుర్తు చేశారు. అవయవ దానం చేసేవారి వయసు 65 ఏళ్ల లోపే ఉండాలన్న నిబంధననూ తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2013లో అవయవ దానం చేసిన వారు 5 వేల లోపే ఉండగా, 2022లో వారి సంఖ్య 15 వేలకు పైనే ఉందని తెలిపారు. మరణించిన వ్యక్తి అవయవ దానం చేస్తే 8 నుంచి 9 మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు. మరణించిన తమ పిల్లల అవయవాలను దానం చేసిన తల్లిదండ్రులతో ప్రధాని ఈ కార్యక్రమంలో సంభాషించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు వహించాలని ఆయన సూచించారు. శుద్ధ ఇంధనం దిశగా దేశం సాధిస్తున్న ప్రగతినీ ప్రధాని ప్రస్తావించారు. దేశంలో పగటి అవసరాలకు వంద శాతం సౌర విద్యుత్తును వినియోగిస్తున్న తొలి జిల్లాగా దీవ్‌ నిలిచినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.52 కోట్లు ఆదా అవడంతోపాటు, పర్యావరణహితంగానూ మారిందని చెప్పారు.

మహిళా శక్తిపై ప్రశంసలు

దేశంలో వివిధ రంగాల్లో మహిళల ప్రాబల్యం పెరుగుతోందని ప్రధాని చెప్పారు. ఆసియాలో తొలి మహిళా లోకో పైలట్‌గా నిలిచిన సురేఖా యాదవ్‌ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ డాక్యుమెంటరీతో ఆస్కార్‌ పురస్కారాన్ని గెలుచుకున్న దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోంగాలను ఆయన ప్రశంసించారు. తుర్కియే భూకంపం సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన మహిళా సిబ్బంది చేపట్టిన సహాయక కార్యక్రమాలను కొనియాడారు. ఐరాస శాంతి పరిరక్షణ దళంలో భారత్‌ నుంచి మహిళల బృందాన్ని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే నెలలో నిర్వహించనున్న ‘మన్‌ కీ బాత్‌’ 100వ ఎపిసోడ్‌ కోసం ఆలోచనలు పంచుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని