డెప్యుటేషన్‌ ముగిస్తే మాతృశాఖకు రావాల్సిందే: కేంద్రం

డెప్యుటేషన్‌ ప్రాతిపదికన విదేశాలకు, దేశంలోని ఇతర చోట్లకు వెళ్లినవారు నిర్దిష్ట గడువు తీరిన తర్వాత కూడా మాతృశాఖకు రాకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది.

Published : 27 Mar 2023 03:42 IST

దిల్లీ: డెప్యుటేషన్‌ ప్రాతిపదికన విదేశాలకు, దేశంలోని ఇతర చోట్లకు వెళ్లినవారు నిర్దిష్ట గడువు తీరిన తర్వాత కూడా మాతృశాఖకు రాకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. వీరిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ‘సిబ్బంది, శిక్షణ విభాగం’ (డీవోపీటీ) తాజా ఉత్తర్వులో పేర్కొంది. అనుమతి పొందిన గడువు కంటే ఎక్కువకాలం డెప్యుటేషన్‌పై ఉంటూ తర్వాత ఆ వ్యవధి క్రమబద్ధీకరణకు అధికారుల నుంచి తరచూ ప్రతిపాదనలు వస్తుండడంతో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ పరిధిలోని డెప్యుటేషన్‌ కేసులన్నింటినీ సమీక్షించాలని సూచించింది. గడువు ముగిసేలోగా దానిని పొడిగిస్తున్నట్లు సంబంధిత అధికారుల నుంచి రాతపూర్వక అనుమతి పొందకపోతే వారి గడువు ముగిసిన రోజే విధుల నుంచి రిలీవ్‌ అయినట్లు పరిగణిస్తామని తెలిపింది. వీరు అదనంగా కొనసాగిన రోజులను పింఛన్‌కు అర్హత ఉండే సర్వీసులో కలపబోమనీ, అనధికారికంగా కొనసాగిన కాలంలో రావాల్సిన ఇంక్రిమెంట్లను వాయిదా వేస్తామనీ హెచ్చరించింది. గడువుకు మించి వీరు కొనసాగకుండా చూడాల్సిన బాధ్యత.. వారి పర్యవేక్షక అధికారులదేనని పేర్కొంది. ఇదివరకు విడుదల చేసిన ఆదేశాలను గుర్తుచేస్తూ ఈ నెల 22న మరోసారి ఉత్తర్వులు పంపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని