సంక్షిప్త వార్తలు(6)
రామసేతు వారధిని జాతీయ స్మృతి చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.
రామసేతును జాతీయ స్మృతి చిహ్నంగా ప్రకటించాలి
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
దిల్లీ: రామసేతు వారధిని జాతీయ స్మృతి చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. భక్తుల సౌకర్యార్థం అక్కడ ఒక గోడను కూడా నిర్మించాలని న్యాయవాది అశోక్ పాండే తన పిటిషన్‌లో అభ్యర్థించారు. రామసేతు వారధిని జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ భాజపా నేత సుబ్రమణ్యస్వామి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను త్వరలోనే వింటామని ఈ నెల 20న సుప్రీంకోర్టు వెల్లడించింది. రామసేతు ఉన్న ప్రాంతంలో యూపీఏ-1 ప్రభుత్వం ప్రారంభించిన సేతుసముద్రం షిప్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుబ్రమణ్యస్వామి కోర్టుకు వెళ్లడంతో 2007లో న్యాయస్థానం స్టే విధించింది.
అప్పుడు గర్భవతినని తెలియదు: స్మృతి ఇరానీ
దిల్లీ: రాజకీయాల్లోకి రాకముందు తాను టీవీ సీరియళ్ల నటిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నానని భాజపా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఆ సీరియల్స్‌లో నటిస్తోన్న రోజుల్లోనే తనకు గర్భస్రావమైందని ఆమె తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ’.. నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ సీరియల్ సమయంలో గర్భవతినయ్యాను. అయితే ఆ విషయం నాకు తెలియలేదు. ఓ రోజు షూటింగు చేస్తున్నప్పుడు నీరసంగా అనిపించింది. ఓపిక లేదని, ఇంటికి వెళ్లిపోతానని అడిగాను. కానీ, పని ఎక్కువగా ఉండటం వల్ల చేసేది లేక సాయంత్రం వరకూ సెట్‌లోనే ఉన్నాను. ఆ రోజు సాయంత్రం ఆస్పత్రికి వెళ్లగా అబార్షన్ అయినట్లు తెలిసింది. ఎంతో కుంగుబాటుకు గురయ్యాను. షూటింగు నుంచి కాస్త విరామం తీసుకుందామనుకున్నప్పటికీ ఇంటి ఈఎంఐలు, ఇతర ఖర్చులు గుర్తుకు వచ్చి తిరిగి సెట్స్‌కు వెళ్లాను. నాకసలు గర్భస్రావం కాలేదని, అబద్ధం చెబుతున్నానంటూ ఓ వ్యక్తి వదంతులు పుట్టించాడు. అలాంటి సమయంలో నేను చెప్పింది నిజమని నమ్మించడం కోసం రిపోర్టులు తీసుకువెళ్లి.. ఆ ప్రోగ్రామ్ క్రియేటర్ ఏక్తాకపూర్‌కు చూపించాను’’ అని పేర్కొన్నారు.
స్వార్థంతో ఆ వ్యాఖ్యలు చేశా: పవన్ ఖేడా
దిల్లీ: గత ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనై ‘తపస్య’ పేరుతో చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా క్షమాపణలు చెప్పారు. స్వార్థంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానని, ఇప్పుడు తమ నేత రాహుల్ గాంధీని చూశాక పదవులు ముఖ్యం కాదని అర్థమైందని పేర్కొన్నారు. సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు.
సూరత్ కోర్టులో రాహుల్ లాయర్ ఎవరు?
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘మోదీ అనే ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కారణంగా దాఖలైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసును నాలుగేళ్లుగా రాహుల్ తరఫున వాదించిన లాయర్ ఎవరు? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూరత్ కోర్టులో రాహుల్ తరపున వాదించిన లాయర్ పేరు కిరీట్ పాన్‌వాలా. నగరంలో పేరుమోసిన క్రిమినల్ లాయర్లలో ఆయన ఒకరు. ఆయన వాదించిన కేసుల్లో విజయం సాధించినవే ఎక్కువ. 1953లో జన్మించిన పాన్‌వాలా 1976లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి.. 1978 నాటికి న్యాయ విద్యలో మాస్టర్స్ చేశారు. దాదాపు 45 సంవత్సరాలకుపైగా ఆయన న్యాయవాద వృత్తిలో ఉండి 1600 కేసులను వాదించారు. పాన్‌వాలా సూరత్‌లోని నవయుగ్ కామర్స్ కళాశాల, నవయుగ్ న్యాయ కళాశాల, వి.టి.ఛోక్సీ లా కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఆయన సత్యమహితి అనే పుస్తకం రాశారు. అంతేకాదు ‘నర్మదా తారా వాహీ జాతా పానీ’ చిత్రాన్ని నిర్మించారు. దీనికి చాలా అవార్డులు వచ్చాయి.
ప్రయాగ్‌రాజ్‌కు మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ తరలింపు
అహ్మదాబాద్: వందకు పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్‌ను ఆదివారం అహ్మదాబాద్‌లోని సబర్మతి కేంద్ర కారాగారం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు యూపీ పోలీసులు తరలించారు. ఓ కిడ్నాప్ కేసులో తీర్పు వెలువడనున్న సందర్భంగా ఈ నెల 28న అక్కడి న్యాయస్థానంలో నిందితుడిగా అహ్మద్‌ను హాజరుపరచాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 2019 జూన్‌లో అహ్మద్‌ను సబర్మతి కారాగారానికి తీసుకువచ్చారు. కోర్టులో హాజరుపరిచే నెపంతో తనను పోలీసులు తీసుకువెళ్తున్నారని, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే దారిలోనే తనను హతమార్చే అవకాశం ఉందని అహ్మద్ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
అవన్నీ అదానీని రక్షించే ప్రయత్నాలు కావా?
తమ సర్కారేమీ అదానీని రక్షించడం లేదని రవిశంకర్ ప్రసాద్ అంటున్నారు. మరి అదానీ గ్రూప్ వ్యవహారంలో సెబీతో ఎందుకు దర్యాప్తు జరిపించట్లేదు? జేపీసీ ఎందుకు వేయట్లేదు? సీబీఐ, ఈడీలు ఎందుకు దాని జోలికి వెళ్లట్లేదు? అదానీ రాజకీయ స్నేహితులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అదానీని రక్షించేందుకు ప్రయత్నిస్తుండటం వల్ల కాదా పార్లమెంటు సమావేశాలు స్తంభించింది?
కపిల్ సిబల్
ప్రియాంక అబద్ధాలాడుతున్నారు
రాహుల్‌గాంధీ విద్యార్హతల గురించి ప్రియాంకాగాంధీ వాద్రా అబద్ధాలాడుతున్నారు. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివినట్లు ఎన్నికల ప్రమాణపత్రాల్లో లేనే లేదు. వారి కుటుంబం విషయంలో.. బూటకం కానిది ఏ ఒక్కటైనా ఉందా అసలు?
అమిత్ మాలవీయ
రాహుల్‌కు స్వాగతం.. ఇక పోరాటమే
పార్లమెంటు చాలా గొప్పది. కానీ- పోరాట మార్గం దానికంటే ఉన్నతమైనది. అనర్హత వేటుతో పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీని ఈ మార్గంలోకి ఆహ్వానిస్తున్నా. ఇక వేడుకోవడమేమీ ఉండదు. జరగబోయేది పోరాటమే.
యోగేంద్ర యాదవ్
సత్వర చర్యలు అవసరం
నగరీకరణ వేగంగా జరుగుతుండటంతో పాటు పర్యావరణ సంక్షోభం కారణంగా మన నగరాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. భూ గ్రహాన్ని పరిరక్షించుకోవాలన్నా.. పట్టణాల్లో జీవన నాణ్యతను మెరుగుపర్చుకోవాలన్నా మనం వెంటనే తగిన చర్యలు చేపట్టాలి.
ఆహార, వ్యవసాయ సంస్థ
కత్తిలాంటి కూడలి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌లో ‘చాకూ చౌక్’ పేరుతో నిర్మించిన కూడలిలో ఏర్పాటుచేసిన 20 అడుగుల రాంపురీ కత్తి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం