అచ్చం అలాంటి పేరే ఎంచుకున్న అమృత్‌పాల్‌

ఖలిస్థాన్‌ ఉద్యమం కోసం వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్‌ నెలకొల్పిన సంస్థ పేరు, పంజాబ్‌ నటుడు దీప్‌ సిద్ధూ సోదరుడు మన్‌దీప్‌కు చెందిన సంస్థ పేరు దాదాపు ఒకేలా ఉన్నాయి.

Updated : 27 Mar 2023 05:31 IST

దీప్‌ సిద్ధూ సంస్థను పోలినట్లు నామకరణం

చండీగఢ్‌: ఖలిస్థాన్‌ ఉద్యమం కోసం వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్‌ నెలకొల్పిన సంస్థ పేరు, పంజాబ్‌ నటుడు దీప్‌ సిద్ధూ సోదరుడు మన్‌దీప్‌కు చెందిన సంస్థ పేరు దాదాపు ఒకేలా ఉన్నాయి. అమృత్‌పాల్‌ ‘వారిస్‌ పంజ్‌-ఆబ్‌ దే’ను ఏర్పాటు చేస్తే, సిద్ధూ సోదరుడు అప్పటికే ‘వారిస్‌ పంజాబ్‌ దే’ను నిర్వహిస్తున్నారు. సిద్ధూ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయనకు ఉన్న ప్రజాదరణను సొమ్ము చేసుకునేందుకే పూర్తిగా ఒకేరకంగా ఉండే పేరును అమృత్‌పాల్‌ ఎంచుకున్నట్లు దర్యాప్తు అధికారులకు లభ్యమైన పత్రాలు చెబుతున్నాయి. కాలుష్య సంబంధిత అంశాలు, మాదకద్రవ్య వ్యసనం బారినపడిన యువతను క్రీడలవైపు రప్పించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల్ని ఆదుకోవడం వంటి లక్ష్యాలతో 2022 జులై 4న మన్‌దీప్‌ ఒక సంస్థను నెలకొల్పారు. అదే ఏడాది ఆగస్టులో విదేశాల నుంచి అమృత్‌పాల్‌ పంజాబ్‌కు తిరిగివచ్చి, ఆ సంస్థను తనకు అప్పగించాల్సిందిగా చేసిన డిమాండును మన్‌దీప్‌ తిరస్కరించారు. వారసుడిగా అమృత్‌పాల్‌ను అంగీకరించేందుకు దీప్‌సిద్ధూ కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు. దాంతో కొత్త సంస్థ ఏర్పాటైంది. 

అమృత్‌పాల్‌.. పోలీసులకు లొంగిపో: అకల్‌తఖ్త్‌

‘వారిస్‌ పంజ్‌-ఆబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ తక్షణమే పోలీసులకు లొంగిపోవాలని ‘అకల్‌తఖ్త్‌’ జతేదార్‌ జ్ఞానీ హర్‌ప్రీత్‌ సింగ్‌ కోరారు.  పోలీసులు ఇప్పటివరకు అమృత్‌పాల్‌ను అరెస్టు చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అమృత్‌పాల్‌కు ఆశ్రయం కల్పించినందుకు పటియాలాకు చెందిన ఒక బల్బీర్‌కౌర్‌ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని