కొచ్చి విమానాశ్రయంలో కూలిన హెలికాప్టర్‌

భారత తీర రక్షణ దళా (కోస్ట్‌గార్డ్‌)నికి చెందిన ఒక హెలికాప్టర్‌.. కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలింది.

Published : 27 Mar 2023 04:58 IST

పైలట్‌ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం

కొచ్చి: భారత తీర రక్షణ దళా (కోస్ట్‌గార్డ్‌)నికి చెందిన ఒక హెలికాప్టర్‌.. కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలింది. ఆదివారం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు వ్యక్తులున్నారు. పైలట్‌ అప్రమత్తత కారణంగా ప్రాణనష్టం తప్పింది.  ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ మార్క్‌-3 తరగతికి చెందిన ఈ హెలికాప్టర్‌ మధ్యాహ్నం 12.25 గంటలకు గాల్లోకి లేచింది. 30-40 అడుగుల ఎత్తులోకి చేరుకోగానే అది నియంత్రణ కోల్పోయింది. అయితే పైలట్‌ అద్భుత నైపుణ్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించారని కోస్ట్‌గార్డ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. హెలికాప్టర్‌ నియంత్రణ వ్యవస్థలు పెద్దగా పనిచేయనప్పటికీ దాన్ని జాగ్రత్తగా అదుపు చేశారని తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన రన్‌వేను అది అడ్డుకోకుండా పక్కకు తీసుకెళ్లారని వివరించింది. సాధ్యమైనంత సాఫీగా ల్యాండ్‌ అయ్యేలా చూశారని పేర్కొంది. ఈ క్రమంలో హెలికాప్టర్‌లోని ఒక వ్యక్తి చేతికి స్వల్ప గాయాలయ్యాయని వివరించింది. ఈ లోహ విహంగ రెక్కలు, ఎయిర్‌ఫ్రేమ్‌ దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ప్రమాదం కారణంగా కొచ్చి విమానాశ్రయంలో కార్యకలాపాలను రెండు గంటల పాటు నిలిపివేశారు. ఇక్కడికి వచ్చే విమానాలను తిరువనంతపురం, కోయంబత్తూర్‌ విమానాశ్రయాలకు మళ్లించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాకపోకలను పునరుద్ధరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు