సంక్షిప్త వార్తలు(5)

మాతృ విద్యకు శిశు మరణాల సంఖ్యకు సంబంధముందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ రెండు అంశాల మధ్యా ఉన్న సంక్లిష్టమైన బంధాన్ని హెల్త్‌ అండ్‌ ప్లేస్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన పత్రం తొలిసారి వెలుగులోకి తీసుకొచ్చింది.

Updated : 28 Mar 2023 05:56 IST

అమ్మ చదివితే శిశువు బతుకుతుంది
వెల్లడించిన తాజా అధ్యయనం

దిల్లీ: మాతృ విద్యకు శిశు మరణాల సంఖ్యకు సంబంధముందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ రెండు అంశాల మధ్యా ఉన్న సంక్లిష్టమైన బంధాన్ని హెల్త్‌ అండ్‌ ప్లేస్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన పత్రం తొలిసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పరిశోధకులు 1992-93, 2019-21ల మధ్య నిర్వహించిన అయిదు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల సమాచారాన్ని సేకరించారు. ఈ వివరాలను కంప్యూటర్‌ ద్వారా విశ్లేషించి శిశు మరణాల క్రమాన్ని పరిశీలించారు. వాటి ఫలితాలను విశ్లేషించినపుడు దుర్భర సామాజిక ఆర్థిక పరిస్థితులు, బలహీన వైద్యరంగం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. దాంతో ఈ రెండు పరామితులను తొలగించి చూడగా శిశు మరణాల సంఖ్యలో ఈ రెండు ప్రాంతాల మధ్యా పెద్దగా తేడా కనపడలేదని పరిశోధకులు గుర్తించారు. హైస్కూల్‌ విద్య వరకు చదువుకున్న మహిళల సంఖ్య పెరగడమే దీనికి కారణమని వారు పేర్కొన్నారు. హైస్కూలు స్థాయి వరకు మహిళలు చదువుకోవడమన్నది శిశు మరణాల మరణాల సంఖ్య తగ్గడంలో ఒక పాత్రను పోషిస్తోందని పరిశోధనా పత్రాన్ని రూపొందించిన ఆస్ట్రియాలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అప్లైడ్‌ సిస్టమ్స్‌ అనాలసిస్‌ (ఐఐఏఎస్‌ఏ) ప్రొఫెసర్‌ సమీర్‌ కేసీ అభిప్రాయపడ్డారు.


రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసే బ్యాగ్‌లు

దిల్లీ: దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడంలో సాయపడే వినూత్న బ్లడ్‌ బ్యాగ్‌లను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం ప్రత్యేక పాలిమర్లను ఉపయోగించారు. అవి.. రక్తానికి నష్టం కలిగించే పరమాణు స్థాయి పోకడల (డీఏఎంపీ)ను కట్టడి చేస్తాయి. అందువల్ల రక్తం 51 రోజుల పాటు భద్రంగా ఉంటుంది. బెంగళూరులో బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్టెమ్‌ సెల్‌ బయాలజీ అండ్‌ రీజెనరేటివ్‌ మెడిసిన్‌’ (ఇన్‌ స్టెమ్‌) సంస్థ ఈ బ్యాగ్‌లను అభివృద్ధి చేసింది. ఈ పరిశోధన బృందానికి ప్రవీణ్‌ కుమార్‌ వేముల నేతృత్వం వహించారు.

సాధారణంగా దాతల నుంచి సేకరించిన రక్తం 42 రోజులు భద్రంగా ఉంటుంది. అయినా దాన్ని 21 రోజుల లోపే గ్రహీతల్లోకి ఎక్కించాల్సి ఉంటుంది. నాణ్యత తక్కువగా ఉన్న రక్తాన్ని ఎక్కిస్తే రోగుల అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుతం బ్లడ్‌లో పీహెచ్‌ స్థాయిని నియంత్రించడానికి కొన్ని రకాల పదార్థాలను ఉపయోగిస్తున్నారు. అయితే అవి డీఏఎంపీలను తొలగించలేవు. భారత శాస్త్రవేత్తలు రూపొందించిన పాలిమర్లు.. జిగురులా వీటికి అంటుకుంటాయి. రక్త కణాల జోలికి పోకుండా కట్టడి చేస్తాయి.


లాలూ బెయిల్‌పై నోటీసులిచ్చేందుకు నిరాకరణ

దిల్లీ: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ చేసిన విజ్ఞప్తిపై నోటీసులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయిదేళ్ల జైలుశిక్ష పడిన డోరండా ట్రెజరీ కేసుతో సీబీఐ విజ్ఞప్తిని జతచేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అంతకుముందు లాలూకు నోటీసులు జారీచేయాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు, న్యాయవాది రజత్‌ నాయర్‌ కోరారు. దానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దాణా కుంభకోణానికి సంబంధించి డోరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్లను స్వాహా చేశారని లాలూపై అభియోగం ఉంది. ఈ కేసులో అయిదేళ్ల జైలుశిక్ష, రూ.60 లక్షల జరిమానా విధిస్తూ 2022 ఫిబ్రవరి 21న రాంచీలోని సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వగా.. అనారోగ్య కారణాలపై ఆయనకు ఝార్ఖండ్‌ హైకోర్టు 2022 ఏప్రిల్‌ 22న బెయిల్‌ మంజూరు చేసింది.


ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటుపై ఏప్రిల్‌ 5న విచారణ

ప్రార్థనా స్థలాల చట్టం-1991లోని పలు నిబంధనల చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 5న విచారణ చేపట్టనుంది. పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్‌ 5నాటి విచారణ జాబితా నుంచి ఈ కేసును తొలగించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రార్థనా స్థలాల చట్టం-1991పై దాఖలైన పిటిషన్లకు సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని జనవరి 9న సుప్రీంకోర్టు ఆదేశించింది. సమాధానమివ్వడానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువిచ్చింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన మొత్తం ఆరు పిటిషన్లలో మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి పిటిషన్‌ కూడా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నాటికి ఆరాధనా స్థలాలున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని ఆ చట్టం చెబుతోంది. వాటి స్వభావాల్లో మార్పు కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించడాన్ని ఆ చట్టం నిషేధిస్తోంది.


అవి రాజ్యాంగ విరుద్ధం కాదా?

కపిల్‌ సిబల్‌

త ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని అమిత్‌ షా అంటున్నారు. మరి మతం ఆధారంగా రాజకీయాలు చేయడం, ప్రచార కార్యకలాపాలు నిర్వహించడం, ప్రసంగాలు చేయడం, ఎజెండాలు రూపొందించుకోవడం, కార్యక్రమాలు ఏర్పాటుచేయడం.. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడం కాదా? 


గతంలో ఏ ప్రధానీ ఇంతలా అబద్ధాలాడలేదు

ప్రశాంత్‌ భూషణ్‌

యూనిట్‌ విద్యుత్‌ సరఫరా ధరను రూ.11 నుంచి రూ.1కి తాను తగ్గించినట్లు ప్రధాని మోదీ చెప్పుకొన్నారు. కానీ వాస్తవమేంటంటే- కేవలం ఒకే ఒక్క ఏడాదిలో (2021 నుంచి 2022 వరకు) అదానీ నుంచి యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు ధరను రూ.2.83 నుంచి రూ.8.83కి గుజరాత్‌ పెంచింది. ఇంత దారుణంగా అబద్ధాలాడే ప్రధాని భారత్‌కు మునుపెన్నడూ లేరు.  


భావోద్వేగ పరిశుభ్రత అవసరం

దలైలామా

మానవులు సంఘ జంతువులు. ప్రేమ, ఆప్యాయతలు మనల్ని కలిపి ఉంచుతాయి. కోపం వేరు చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శారీరక పరిశుభ్రత పాటిస్తున్నట్లే.. విధ్వంసక భావోద్వేగాలను అదుపు చేసుకునేందుకు, మానసిక ప్రశాంతత పొందేందుకు మనం భావోద్వేగ పరిశుభ్రతనూ పాటించాలి.


కాంగ్రెస్‌ ఏం చేస్తుందో!

వివేక్‌ అగ్నిహోత్రి

ఇందిరాగాంధీ అనర్హత వేటుకు గురైనప్పుడు కూడా కాంగ్రెస్‌ ఆందోళనలకు దిగింది. కానీ ఆమె సిసలైన నేత. కాబట్టి మళ్లీ పుంజుకున్నారు. ప్రస్తుతం జన బలమున్న నేతలెవరూ కాంగ్రెస్‌కు లేరు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ ఏం చేస్తుందో చూడాలి మరి..!    


చిత్ర వార్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు