నిషిద్ధ క్రిమిసంహారకాలు మూడేనా?

దేశంలో హానికర రసాయనాలు, క్రిమిసంహారక మందుల వినియోగంపై వెలువడిన రెండు నివేదికలను తన ముందుంచాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది.

Published : 28 Mar 2023 05:10 IST

కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీ: దేశంలో హానికర రసాయనాలు, క్రిమిసంహారక మందుల వినియోగంపై వెలువడిన రెండు నివేదికలను తన ముందుంచాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటివరకూ మూడు క్రిమిసంహారాలను మాత్రమే ఎందుకు నిషేధించారని ప్రశ్నించింది. ‘వనశక్తి’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజానికి తోడు మరో రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఎస్‌.కె.ఖురానా ఉప సంఘం, టి.పి.రాజేంద్రన్‌ కమిటీల నివేదికలను నాలుగు వారాల్లోగా సమర్పించాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది. హానికర క్రిమిసంహారాల వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, పొలాలకు సమీపంలో నివసించే ఇతరుల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతోందని పిటిషనర్లు ఆరోపించారు. 2018 జనవరి నాటికే కనీసం 27 క్రిమిసంహారక మందులను నిషేధించాల్సిందని ఓ పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన ప్రశాంత్‌ భూషణ్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ విక్రమ్‌జిత్‌ బెనర్జీ.. దురుద్దేశాలతోనే ఈ పిటిషన్లు వేశారని ఆరోపించారు. అ మందులను అనేక కంపెనీలు తయారుచేస్తున్నాయని, వాటిని నిషేధించడానికి కోర్టులను ఉపయోగించుకోవడాన్ని అనుమతించకూడదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘‘ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేసే పిటిషనర్లకు ఏదో ఒక అజెండా ఉంటే ఉండొచ్చు. కానీ మూడు క్రిమిసంహారక మందులను మాత్రమే నిషేధించడానికి కారణాలపై మాకు సంతృప్తికర వివరణ ఇవ్వాలి. కేంద్రం తన పని సక్రమంగా చేస్తే ఈ పిటిషన్లను విచారించాల్సిన అవసరం మాకు వచ్చేది కాదు. 18 రకాల క్రిమిసంహార మందుల వల్ల చిన్నారుల్లో క్యాన్సర్‌ తలెత్తే ప్రమాదం ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. అయినా మూడింటినే ప్రభుత్వం నిషేధించింది’’  అని వ్యాఖ్యానించింది.


రాజ్యసభ ఎన్నికల్లో రహస్య బ్యాలెట్‌ కోసం పిటిషన్‌..

కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం

రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండలికి జరిగే ఎన్నికల్లో రహస్య బ్యాలెట్‌ను అనుమతించాలంటూ దాఖలైన ఒక పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. క్రాస్‌ ఓటింగ్‌ను అడ్డుకోవడానికి, పార్టీ క్రమశిక్షణను కాపాడటానికి ఓపెన్‌ బ్యాలెట్‌ అవసరమని పేర్కొంది. ‘లోక్‌ప్రహారి’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు స్పష్టంచేసింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల-1961, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఒక భాగాన్ని ఈ సంస్థ సవాల్‌ చేసింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని 39ఏఏ రూల్‌ ప్రకారం.. రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సంబంధిత రాజకీయ పార్టీ నియమించిన పోలింగ్‌ ఏజెంటుకు తన ఓటును చూపాల్సి ఉంటుంది. రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఒక రాజకీయ పార్టీ ప్రతిపాదించకుంటే... ఆయన/ ఆమెను 10 మంది ప్రజాప్రతినిధులు ప్రతిపాదించాలని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 33లో ఉన్న సబ్‌సెక్షన్‌ 1 స్పష్టంచేస్తోంది. దాన్ని కూడా పిటిషనర్‌ సవాల్‌ చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇది పూర్తిగా శాసన విధాన పరిధిలోని అంశమని పేర్కొంది. ఆ నిబంధనలో ఎలాంటి వివక్ష లేదని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని