సంక్షిప్త వార్తలు(7)

వ్యర్థ జలాలను శుద్ధి చేసి, వ్యవసాయంలో వాడటం వల్ల హానికర గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలకు కళ్లెం వేయవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది.

Updated : 29 Mar 2023 05:48 IST

వ్యర్థ జలాలను శుద్ధి చేసి సేద్యానికి వాడాలి

అప్పుడు ఉద్గారాలకు కళ్లెం

దిల్లీ: వ్యర్థ జలాలను శుద్ధి చేసి, వ్యవసాయంలో వాడటం వల్ల హానికర గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలకు కళ్లెం వేయవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరానిమెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యూ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ అధ్యయనం చేసింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా ప్రకారం.. భారత్‌లో 2025 నాటికి 15 ప్రధాన నదీపరివాహక ప్రాంతాల్లో 11 చోట్ల నీటి లభ్యత తగ్గొచ్చు. డిమాండ్‌-సరఫరాలో అంతరాన్ని పూడ్చడానికి ప్రత్యామ్నాయ జలవనరులను శోధించాల్సి ఉంది. వ్యర్థజలాలను శుద్ధి చేసి, వ్యవసాయానికి వినియోగిస్తే 2021లో భారత్‌లో 1.38 మిలియన్‌ హెక్టార్లలో పొలాలు సాగులోకి వచ్చేవి. దీనివల్ల రూ.96 వేల కోట్ల ఆదాయం సమకూరి ఉండేదని, 10 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గి ఉండేవని శాస్త్రవేత్తలు తెలిపారు.


అలాంటి పిండాలతో గర్భస్రావం!

దిల్లీ: ఆలస్యంగా వృద్ధి చెందే పిండాలతో గర్భస్రావానికి ఎక్కువ ఆస్కారం ఉందని నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 611 మంది గర్భిణులను ఇమేజింగ్‌ పరిజ్ఞానంతో పరిశీలించి, ఈ మేరకు తేల్చారు. వీరిలో 33 మందికి గర్భస్రావమైంది. పిండాలకు సంబంధించిన త్రీడీ హోలోగ్రామ్‌లను సృష్టించడానికి వర్చువల్‌ రియాల్టీ విధానాలనూ ఉపయోగించారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు.. పిండం ఎదుగుదలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. మెదడు ఆకృతి, శరీర పొడవు వంటివి లెక్కించారు. గర్భం ధరించాక మొదటి పదివారాల్లో గర్భస్రావమైన పిండాలు.. ఎదుగుదల కోసం సాధారణం కన్నా నాలుగు రోజులు ఎక్కువ సమయం తీసుకున్నట్లు గుర్తించారు. వృద్ధి సమయం పెరిగే కొద్దీ గర్భస్రావానికి ఆస్కారం పెరుగుతుందని వారు వెల్లడించారు.


కేంద్ర మంత్రిపై దాడి ఘటన.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశం

కోల్‌కతా: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, పశ్చిమబెంగాల్‌ ఎంపీ నిశిత్‌ ప్రామాణిక్‌పై దాడి జరిగిందనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రామాణిక్‌పై కూచ్‌ బిహార్‌ ప్రాంతంలో దాడి జరిగిందని, కాన్వాయ్‌పై రాళ్ల వర్షం కురిపించారని హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌లో బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. మంత్రికి భద్రత కల్పిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ ఇచ్చిన ఫిర్యాదునూ రాష్ట్ర పోలీసులు స్వీకరించలేదని, ఈ దాడిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేయగా ఆ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.


తొలి బ్యాచ్‌ అగ్నివీరుల శిక్షణ పూర్తి

చిల్కా: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఒడిశాలోని చిల్కాలో అగ్నివీర్‌ మొదటి బ్యాచ్‌ శిక్షణ విజయవంతంగా పూర్తయింది. 272 మంది మహిళా సైనికులతో పాటు మొత్తం 2,585 మంది నాలుగు నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం తొలి బ్యాచ్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ మాట్లాడుతూ.. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ.. దేశ సేవలో పాలు పంచుకోవాలని అగ్నివీరులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


అమృత్‌ ఉద్యాన్‌లో నేడు దివ్యాంగులకు ప్రవేశం

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యాన్‌ సందర్శనకు బుధవారం దివ్యాంగులు తరలిరావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది. దాదాపు 13 వేలమంది దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా ఉన్నట్లు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దివ్యాంగులతో ముచ్చటిస్తారని భావిస్తున్నట్లు పేర్కొంది. మొగల్‌ గార్డెన్స్‌ను అమృత్‌ ఉద్యాన్‌గా పేరు మార్చిన కేంద్రం జనవరి 31 నుంచి ప్రజా సందర్శనకు అనుమతిస్తోంది.


జామియానగర్‌ హింస కేసులో.. షర్జీల్‌ సహా 11 మందిపై నేరారోపణలు

వారి విడుదలపై దిగువ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి షర్జీల్‌ ఇమామ్‌, కార్యకర్తలు ఆసిఫ్‌ ఇక్బాల్‌ తన్హా, సఫూరా జర్గర్‌ సహా మొత్తం 11 మందిని 2019 నాటి జామియానగర్‌ హింస కేసులో విడుదల చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దిల్లీ హైకోర్టు పాక్షికంగా పక్కన పెట్టింది. వారిపై తాజాగా ఆరోపణలు మోపాలని ఆదేశించింది. మొత్తం 11 మంది నిందితుల్లో తొమ్మిది మందిపై ప్రాథమికంగా అల్లర్లకు పాల్పడటం, చట్టవిరుద్ధంగా గుమిగూడటం లాంటి ఆరోపణలున్నాయని హైకోర్టు చెప్పింది. ‘భావప్రకటనా స్వేచ్ఛ హక్కును నిరాకరించకపోయినా, ఈ అంశాన్ని సరిగా విచారించే విషయంలో మా విధులేంటో మాకు తెలుసు. శాంతియుతంగా గుమిగూడటంపై కొన్ని నియంత్రణలు ఉంటాయి. అక్కడ ఆస్తుల ధ్వంసం జరిగింది, శాంతిని పరిరక్షించలేదు’ అని తీర్పు వెల్లడిస్తూ జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ చెప్పారు. దిల్లీ పోలీసులకు, పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఆందోళనకారులకు మధ్య 2019 డిసెంబరులో జరిగిన ఘర్షణల కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో 11 మందిని పోలీసులు బలిపశువులుగా చేశారంటూ దిగువకోర్టు వారిని విడుదల చేసింది. దీనిపై పోలీసులు హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.


ఇండో-పాక్‌ సరిహద్దులో 3 డ్రోన్ల కూల్చివేత

చండీగఢ్‌: పంజాబ్‌లోని ఇండియా - పాకిస్థాన్‌ సరిహద్దులో హెరాయిన్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్న మూడు డ్రోన్లను బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూల్చివేసినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. 10 కేజీల హెరాయిన్‌, చైనాలో తయారైన ఓ పిస్తోలు స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని