ChatGPT: నిందితుడికి బెయిల్‌ ఇవ్వాలా.. వద్దా? చాట్‌జీపీటీ సాయం కోరిన హైకోర్టు జడ్జి

కృత్రిమ మేధ(ఏఐ) సంచలనం.. చాట్‌జీపీటీ సేవల విస్తృతి రోజురోజుకి మరింత పెరుగుతోంది. తాజాగా పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు సైతం న్యాయ సలహా అందించింది.

Updated : 29 Mar 2023 09:44 IST

చండీగఢ్‌: కృత్రిమ మేధ(ఏఐ) సంచలనం.. చాట్‌జీపీటీ సేవల విస్తృతి రోజురోజుకి మరింత పెరుగుతోంది. తాజాగా పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు సైతం న్యాయ సలహా అందించింది. ఓ క్రిమినల్‌ కేసుకు సంబంధించి నిందితుడికి బెయిల్‌ మంజూరు విషయంలో చాట్‌జీపీటీ సూచనలను అడిగి తెలుసుకున్నారు జడ్జీలు. భారతీయ న్యాయ వ్యవస్థలోనే ఈ సంఘటన మొట్టమొదటిదిగా భావిస్తున్నారు.దుండగులు క్రూరత్వంతో ఇతరులపై దాడి చేసినప్పుడు.. అతడి బెయిల్‌ అభ్యర్థనపై న్యాయపరంగా మీరిచ్చే సలహా ఏమిటి? అని జడ్జీలు అడిగారు. దీనికి చాట్‌జీపీటీ స్పందిస్తూ.. క్రూరత్వం ద్వారానే మనిషి చంపుతున్నారు కాబట్టి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తాను అని బదులిచ్చింది. దాడి క్రూరత్వ తీవ్రతను బట్టి బెయిల్‌ మంజూరు చేసే విధివిధానాలు కూడా మారుతాయని చాట్‌జీపీటీ వివరించింది. నేర తీవ్రతను బట్టి బెయిల్‌ మంజూరు చేయాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుందని చెప్పింది. నిర్దోషినని నిరూపించుకోవడానికి బలమైన సాక్ష్యాలుంటే తప్ప బెయిల్‌కు అర్హుడు కాడని వెల్లడించింది. అయితే, నిందితుడి నేర ప్రవృత్తి, సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని న్యాయమూర్తులు బెయిల్‌ మంజూరు చేయవచ్చని చాట్‌జీపీటీ సూచించింది.

అవగాహనను పరీక్షించేందుకే..

న్యాయశాస్త్రంపై చాట్‌జీపీటీకి ఏ మేరకు అవగాహన ఉందో తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రయోగం చేశామని న్యాయమూర్తులు వెల్లడించారు. కాగా, చాట్‌జీపీటీ ఇచ్చే సమాచారం, సూచనలు లేదా వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని తీర్పులను వెలువరించరాదని జస్టిస్‌ అనూప్‌ చిట్కారా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.కేసు విషయానికి వస్తే... పంజాబ్‌కు చెందిన నిందితుడిపై 2020 జూన్‌లో హత్య, ఇతర నేరాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో నిందితుడు బెయిల్‌కు అర్హుడని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితుడి గతాన్ని బట్టి అతడు బెయిల్‌పై విడుదలైతే మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందంటూ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని