అమృత్‌పాల్‌ సింగ్‌ దోబూచులాట

ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేత అమృత్‌పాల్‌ సింగ్‌ రోజుకో వేషంతో పంజాబ్‌ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు.

Updated : 29 Mar 2023 09:54 IST

రోజుకో వేషంతో ప్రత్యక్షం
త్వరలోనే పట్టుకుంటామన్న పంజాబ్‌ సర్కారు

చండీగఢ్‌: ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేత అమృత్‌పాల్‌ సింగ్‌ రోజుకో వేషంతో పంజాబ్‌ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా లభించిన సీసీ టీవీ దృశ్యాల్లో సహచరుడు పాపల్‌ప్రీత్‌ సింగ్‌తో కలిసి తలపాగా లేకుండా మాస్కుతో నల్లని కళ్లద్దాలతో కనిపించాడు. తేదీ వెల్లడి కాని ఈ దృశ్యాలు దిల్లీలోని ఓ మార్కెట్‌లోనివి. పాపల్‌ప్రీత్‌ సింగ్‌ చేతిలో సంచీ ఉంది. దీనిపై పంజాబ్‌ పోలీసులు స్పందించలేదు. కానీ అతడు అమృత్‌పాలేనా.. కాదా.. అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని దిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు అమృత్‌పాల్‌ను త్వరలోనే పట్టుకుంటామని పంజాబ్‌, హరియాణా హైకోర్టుకు పంజాబ్‌ సర్కారు మంగళవారం వెల్లడించింది. పోలీసుల అనధికార కస్టడీలో అమృత్‌పాల్‌ ఉన్నాడని, ఆచూకీ చెప్పాలంటూ ఇమాన్‌ సింగ్‌ ఖారా అనే న్యాయవాది హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. అయితే ఆయనను ఇంకా అరెస్టు చేయలేదని, దర్యాప్తు సంస్థలన్నీ కలిసి సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని, త్వరలోనే అరెస్టు చేస్తామని కోర్టుకు పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ వినోద్‌ ఘాయ్‌ తెలిపారు. అమృత్‌పాల్‌ పోలీసు కస్టడీలో ఉన్నారనేందుకు ఆధారాలను చూపాలని న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.ఎస్‌.షెకావత్‌ పిటిషనరును ప్రశ్నించారు. ఆధారాలను సమర్పిస్తే వారెంట్‌ అధికారిని నియమిస్తామని పేర్కొన్నారు.

అకల్‌తఖ్త్‌ ప్రజలను రెచ్చగొడుతోంది: సీఎం

ఇటీవల జరిగిన ఘర్షణల్లో అరెస్టయిన యువకులను విడుదల చేయాలని డిమాండు చేస్తూ ప్రజలను అకల్‌తఖ్త్‌ జతేదార్‌ జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌ రెచ్చగొడుతున్నారని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ విమర్శించారు. అమృత్‌పాల్‌, అతడి అనుచరుల కోసం పోలీసులు వెతుకుతున్న సమయంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అప్పట్లో 353 మందిని అరెస్టు చేశామని, వారిలో 197 మందిని ఇప్పటికే విడుదల చేశామని వెల్లడించారు. బాదల్‌లకు జతేదార్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, చాలామంది జతేదార్లను బాదల్‌లు స్వప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు