నేరగాళ్లపై మితిమీరిన సౌమ్యతతో.. న్యాయవ్యవస్థపై అపనమ్మకం: సుప్రీంకోర్టు

అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులపై సంస్కరణల కోణంలో మితిమీరిన సౌమ్యత చూపితే.. అది న్యాయవ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది.

Updated : 29 Mar 2023 06:06 IST

దిల్లీ: అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులపై సంస్కరణల కోణంలో మితిమీరిన సౌమ్యత చూపితే.. అది న్యాయవ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. బాధితుల హక్కులను కోర్టులు కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. 2005లో బెంగళూరుకు చెందిన బీపీవో ఉద్యోగిని (28)పై అత్యాచారం జరిపి, హత్య చేసిన కేసులో దోషిగా తేలిన క్యాబ్‌ డ్రైవర్‌ శివకుమార్‌ దాఖలు చేసిన అప్పీలుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులోని వాస్తవాలు న్యాయస్థానం మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉన్నట్లు తెలిపింది. కిడ్నాప్‌, అత్యాచారం, హత్య నేరాల కింద అభియోగాలు నమోదైన శివకుమార్‌కు కఠినమైన జీవితకాల శిక్షకు ట్రయల్‌ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీన్ని హైకోర్టు సమర్థించింది. ఈ తీర్పు మేరకు 14 ఏళ్లు జైలుశిక్ష పూర్తి చేసుకుంటే విడుదలకు అవకాశం ఉండటంతో శివకుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం కింది కోర్టు తీర్పును సవరిస్తూ.. ఎటువంటి మినహాయింపు లేకుండా 30 ఏళ్ల తర్వాతే దరఖాస్తుదారు విడుదల కావాలని తీర్పు చెప్పింది.

జైళ్ల ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని ఆదేశం

కిక్కిరిసిపోతున్న కారాగారాల ప్రక్షాళనకు సమర్థంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ‘జైళ్లలో గందరగోళ పరిస్థితులు, సామాజికంగా బలహీనవర్గాలు అక్కడ మగ్గిపోతుండడం గురించి అందరూ మాట్లాడతారు. దీనిపై ప్రభుత్వ ఆలోచనను మేం కోరుకుంటున్నాం. ఈ అంశంపై చర్యలు చేపట్టడం ద్వారా జైళ్లలో సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా నేర న్యాయవ్యవస్థ ప్రక్షాళనకు కూడా మీరు దోహదపడినట్లు అవుతుంది’ అని జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అహ్‌సానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ల ధర్మాసనం మంగళవారం పేర్కొంది. బెయిల్‌ మంజూరు విధానంపై 2021లో సుమోటోగా చేపట్టిన కేసు విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

విద్వేష ప్రసంగాలపై చర్యలూ తీసుకోవాలి

దేశంలో మత సామరస్యం నెలకొనటానికి తొలుత కావాల్సింది విద్వేష ప్రసంగాలు చేయకుండా సంయమనం వహించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధ్యులపై కేవలం ఫిర్యాదులు స్వీకరిస్తే సమస్యకు పరిష్కారం లభించదని, ఎఫ్‌ఐఆర్‌ నమోదుతో పాటు గట్టి చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం తెలిపింది. ఇప్పటి వరకు 18 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వివరించగా ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. విద్వేష ప్రసంగాలపై ఫిర్యాదు అందే వరకు నిరీక్షించకుండా సుమోటోగా వెంటనే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని గత ఏడాది అక్టోబరు 21న యూపీ, దిల్లీ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలను ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసింది. మహారాష్ట్రలో గత నాలుగు నెలల్లో 50 ర్యాలీలు నిర్వహించారని, వాటన్నిటిలో విద్వేష ప్రసంగాలు చేశారని న్యాయవాది నిజాం పాషా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వార్తా పత్రికల కథనాలను అందజేశారు. దీనికి సొలిసిటర్‌ జనరల్‌ తీవ్ర అభ్యంతరం చెబుతూ పత్రికల కథనాలను ఆధారంగా ఎలా చూపుతారని ప్రశ్నించారు. కేరళకు చెందిన వ్యక్తికి మహారాష్ట్ర విషయాలు పూర్తిగా ఎలా తెలుస్తాయని నిలదీశారు. దేశమంతా ప్రశాంతంగా ఉందని, ఎలాంటి విద్వేష ప్రసంగాలు లేవని పేర్కొన్నారు. సొలిసిటర్‌ జనరల్‌ అభ్యంతరాలను పట్టించుకోని ధర్మాసనం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు