సంక్షిప్త వార్తలు(9)
శరీరంలోని తెల్ల రక్త కణాల్లో దాగి ఉండే హెచ్‌ఐవీ జన్యువుల ఆచూకీని పట్టుకోవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు.
కణాల్లో దాగిన హెచ్‌ఐవీ జన్యువులను పసిగట్టొచ్చు
దిల్లీ: శరీరంలోని తెల్ల రక్త కణాల్లో దాగి ఉండే హెచ్‌ఐవీ జన్యువుల ఆచూకీని పట్టుకోవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ పరిశోధన ఆధారంగా ఈ వ్యాధికి కొత్త చికిత్సలను రూపొందించొచ్చని వారు పేర్కొన్నారు. ఈ తెల్లరక్త కణాలను మోనోసైట్లుగా పేర్కొంటారు. ఇవి స్వల్పకాల రోగ నిరోధక కణాలు. అవి వైరస్‌లు, బ్యాక్టీరియాలను చుట్టుముట్టి, నాశనం చేయగలవు. హెచ్‌ఐవీ వ్యాధిలో వీటి పాత్రపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ వ్యాధి బాధితులకు ప్రస్తుతం యాంటీరిట్రోవైరల్ ఔషధాలతో చికిత్స చేస్తున్నారు. అవి దాదాపు గుర్తించలేని స్థాయికి హెచ్‌ఐవీని అణచివేయగలవు. అయితే ఆ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కావడంలేదు. హెచ్‌ఐవీ తన జన్యువులను సీడీ4+ అనే ఒక రకం రోగనిరోధక టి కణాల్లో దాచుకోవడమే ఇందుకు కారణం. శరీరంలో ఈ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే ఆ జన్యువులను కలిగి ఉన్న కణాలకు సంబంధించిన బయోమార్కర్లను గుర్తించే విధానాన్ని కనుగొనాలి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు హెచ్‌ఐవీ బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించి పరిశీలించారు. వీటి నుంచి మోనోసైట్లను సేకరించి, ల్యాబ్‌లో వృద్ధి చేశారు. వాటిలో హెచ్‌ఐవీ జన్యువులను కలిగిన కణాలను గుర్తించగలిగారు.
క్రైస్తవులపై దాడుల మీద నివేదిక సమర్పించండి
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
దిల్లీ క్రైస్తవ సంస్థలు, ఆ మతాచార్యులపై జరుగుతున్న దాడులమీద నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్వేష నేరాలకు కళ్లెం వేయడానికి ఇదివరకు తామిచ్చిన మార్గదర్శకాల అమలు గురించ్కీచీజి తెలపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ జె.బి.పార్దీవాలాల ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల నుంచి కేంద్ర హోంశాఖ వివరాలు సేకరించి క్రోడీకరించాలని తెలిపింది. ప్రతిజిల్లాకు నోడల్ అధికారులున్నా వారు కేసులను నమోదు చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన ప్రస్తావనపై ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశభక్తి లేనట్లు కాదు..
మాజీ జడ్జీలపై కేంద్ర మంత్రి రిజిజు వ్యాఖ్యలను తప్పుపట్టిన 300 మంది న్యాయవాదులు
దిల్లీ కొంత మంది రిటైర్డ్ న్యాయమూర్తులు దేశ వ్యతిరేక ముఠాలో భాగస్వాములయ్యారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ నెల 18న చేసిన వ్యాఖ్యలను 300 మందికి పైగా న్యాయవాదులు తప్పుపట్టారు. కొందరు సామాజిక ఉద్యమకారులు, కొద్ది మంది మాచ్కీజీజి న్యాయమూర్తులు కోర్టులు విపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటూ అందుకు ప్రయత్నిస్తున్నారని కూడా కిరణ్ రిజిజు ఆ సందర్భంగా విమర్శించారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారందరూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కేంద్ర మంత్రి బెదిరింపు ధోరణిలో మాట్లాడారని న్యాయవాదులు ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమన్న హెచ్చరికను కేంద్ర మంత్రి చేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశభక్తి లేనట్లు కాదని, దేశ ద్రోహులై పోరని పేర్కొంటూ ఆ న్యాయవాదులు బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. దీనిపై సంతకం చేసిన వారిలో సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయవాదులు 323 మంది ఉన్నారు.
రేసులో ముందున్నానని నిద్రపోయిన యువకుడు
ఉద్యోగ పరీక్షలో కుందేలు-తాబేలు ఘటన..
ఇంటర్నెట్ డెస్క్: కుందేలు-తాబేలు కథ వినే ఉంటారుగా..! సరిగ్గా ఇలాంటి ఘటనే నిజ జీవితంలోనూ జరిగింది. ఓ నియామక పరీక్షకు సంబంధించిన ఫిజికల్ టెస్టులో అందరికంటే ముందంజలో ఉన్న ఓ అభ్యర్థి.. గెలిచేస్తానన్న అతివిశ్వాసంతో మధ్యలో ఓ కునుకేశాడు. తీరా లేచే సరికి ఆ పరీక్షే పూర్తయిపోయింది. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. ఖాండ్వా ప్రాంతంలో 38 ఫారెస్ట్ రేంజర్ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టారు. ఫిజికల్ టెస్టులో భాగంగా మార్చి 28న అటవీ ప్రాంతంలో 4 గంటల్లో 24 కిలోమీటర్ల నడక నిర్వహించారు. దీనికి 61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో గ్వాలియర్‌కు చెందిన పహద్ సింగ్ వేగంగా వెళ్లి విజయానికి చేరువయ్యాడు. రేసు గెలిచేస్తానన్న ధీమాతో పహద్.. పక్కకు వెళ్లి నిద్రపోయాడు. చివరకు 60 మంది అభ్యర్థులే నడకను పూర్తి చేసినట్లు అధికారులు గుర్తించారు. మిగిలి పోయిన యువకుడి కోసం గాలించగా.. ట్రాక్ పక్కన నిద్రిస్తూ కనిపించాడు. కాళ్లు బొబ్బలెక్కడంతో కాసేపు విశ్రాంతి తీసుకున్నానని.. నిద్రలోకి ఎప్పుడు వెళ్లానో తెలియదని పహద్ సమాధానమిచ్చాడు. చివరకు అతి విశ్వాసంతో ఆ యువకుడు ఉద్యోగ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు.
జైపుర్ పేలుళ్ల కేసులో ముద్దాయిల విడుదల
జైపుర్: రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో 2008 వరుస పేలుళ్ల కేసులో మరణశిక్షలు పడిన నలుగురు ముద్దాయిలను రాష్ట్ర హైకోర్టు బుధవారం దోష విముక్తుల్ని చేసింది. ఈ కేసులో అయిదో ముద్దాయిని దిగువ కోర్టు నిర్దోషిగా ప్రకటించగా, హైకోర్టూ ఆ తీర్పును సమర్థించింది. 2008 మే 13న జైపుర్ నగరంలో పలు ప్రాంతాలలో వరుసగా జరిగిన బాంబు పేలుళ్లలో 71 మంది మరణించగా.. 185 మంది గాయపడ్డారు. కేసులో అరెస్టయి మరణశిక్షలు పడిన అయిదుగురు ముద్దాయిలకు పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు విస్పష్టంగా నిరూపించడంలో, తగిన సాక్ష్యాలు చూపడంలో దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని హైకోర్టు మండిపడింది. కేసును దర్యాప్తుచేసిన ఉగ్రవాద నిరోధ బృంద (ఏటీఎస్) అధికారులపై చర్య తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. ఈ కేసును పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. ఈ కేసులో మహమ్మద్ సయీఫ్, మహమ్మద్ సల్మాన్, సైఫుర్, మహమ్మద్ సర్వార్ ఆజ్మీలకు 2019 డిసెంబరులో ఒక ప్రత్యేక కోర్టు మరణశిక్షలు విధించింది. అయిదో ముద్దాయి షాబాజ్ హుసేన్ నిర్దోషి అని ప్రకటించింది. షాబాజ్ నిర్దోషి అని తేల్చడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేయగా మరణశిక్షలు పడిన నలుగురూ హైకోర్టుకు వెళ్లారు.
వాటిపై చట్టం చేయాలని పార్లమెంటును కోరలేం
లింగ, మత సంబంధిత అంశాలపై స్పష్టతనిచ్చిన సుప్రీంకోర్టు
దిల్లీ: వివాహం, విడాకులు, వారసత్వం, మనోవర్తి తదితర అంశాలకు సంబంధించి చట్టాలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శనం కోరుతూ వేసే వ్యాజ్యాలను అనుమతించరాదని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మతం.. లింగ సమానత్వ అంశాలను నిర్దేశించేలా ఉండే అంశాల విషయంలో పార్లమెంటును చట్టాలు చేయాలంటూ తాము ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ అంశాలు చట్టసభల పరిధిలోనివని.. అందువల్ల పిటిషన్లను అనుమతించవద్దని సొలిసిటర్ జనరల్ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలాతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకొని ఈ వ్యాఖ్య చేసింది.
శిక్ష, విముక్తి అంశాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక విధానాల్లేవ్
క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు శిక్ష విధించడంలోనూ, విముక్తి కల్పించడంలోనూ ప్రత్యేక విధానాలేవీ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ కేసులోనైనా కోర్టుముందుకొచ్చిన సాక్ష్యాల ఆధారంగానే ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి రావడం ఉంటుందని, శిక్ష విధించాలా.. వదిలేయాలా.. అనేది నిర్ణయమవుతుందని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అత్యంత అరుదైన సందర్భాల్లోనే శిక్షను నిలిపేయడం జరుగుతుందని, అదేమీ ఒక విధానం కాదని తేల్చి చెప్పింది. కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడిపై హత్యాయత్నం కేసులో కోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వేగంగా దస్త్రాల కదలిక
సంయుక్త కార్యదర్శుల నుంచి నేరుగా కార్యదర్శులకు నివేదికలు
దిల్లీ: విధాన నిర్ణయాల్లో సమర్థతను పెంపొందించడంతో పాటు దస్త్రాల కదలికల్లో వేగం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు చేపట్టింది. ఆయా శాఖలకు చెందిన సంయుక్త కార్యదర్శులు (జాయింట్ సెక్రటరీస్) ఇకపై నేరుగా కార్యదర్శులకు తమ నివేదికలను అందజేయవచ్చు. ఇప్పటి వరకూ దస్త్రాలు లేదా నివేదికలు సంయుక్త కార్యదర్శుల నుంచి అదనపు కార్యదర్శులకు లేదా ఉపకార్యదర్శులకు, అక్కడి నుంచి కార్యదర్శులకు చేరేవి. దస్త్రాల కదలికల్లో జాప్యాన్ని నివారించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ఏ దస్త్రమైనా సరే నలుగురు అధికారులకు మించి చేతులు మారడానికి వీల్లేదని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన పాలనా సంస్కరణలు, ప్రజాఫిర్యాదుల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని మొత్తం 74 మంత్రిత్వ శాఖలకు గాను దాదాపు 91శాతం శాఖల్లో ఈ విధానం అమలులోకి వచ్చిందని తాజా నివేదిక వెల్లడించింది.
ఇప్పుడేమో అవినీతి పార్టీలా?
విపక్షాలు భయపడుతున్నాయని, అవినీతి పార్టీలన్నీ ఒకే వేదికపైకి చేరుకున్నాయని ప్రధాని అన్నారు. కానీ మోదీ గారూ.. శివసేన, అకాలీదళ్, జేడీయూ, పీడీపీ, బీఎస్‌పీ వంటి పార్టీలన్నీ ఓ దశలో మీ మిత్రపక్షాలే. వాటితో కలిసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పుడేమో అవి అవినీతి పార్టీలయ్యాయా? మీతో కలిసి ఉన్నప్పుడు మాత్రం కాదా?
కపిల్ సిబల్
నా నేతృత్వంలో ఉందనే..
అటవీ సంరక్షణ చట్టం-1980లో పెను మార్పులు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి అప్పగించాలని నిర్ణయించడం దారుణం. దాన్ని పర్యావరణం-అడవుల స్థాయీసంఘం పరిశీలనకు పంపించాల్సింది. ఆ స్థాయీసంఘానికి నేను నాయకత్వం వహిస్తుండటం వల్లే ప్రధాని అందుకు సుముఖత చూపలేదు. సెలెక్ట్ కమిటీ నేతృత్వ బాధ్యతలనైతే తాను ఎంచుకున్న ఎంపీ చేతుల్లో పెట్టొచ్చని ఆయన భావించారు.
జైరాం రమేశ్
కావాలంటే నన్ను అనండి
రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నేను తప్పుబట్టినందుకు చాలామంది మా తాత అమర్‌నాథ్ విద్యాలంకర్ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ సర్కారులో ఆయన భాగమని విమర్శిస్తున్నారు. మా తాత లాలా లజ్‌పత్‌రాయ్ కోసం పనిచేశారు. రెండుసార్లు జైలుపాలయ్యారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఇందిరకు రెండు లేఖలు రాశారు. తర్వాత పార్లమెంటు సభ్యత్వాన్నీ వదులుకున్నారు. కావాలంటే నాపై దాడి చేయండి. అంతేకానీ.. భారత స్వాతంత్య్ర సమరయోధులను విమర్శించకండి.
రో ఖన్నా
వాస్తవాలు నిర్ధారించుకోండి
హానికర తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రతిఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి. ఆన్‌లైన్‌లో ఏవైనా వివరాలను షేర్ చేసేటప్పుడు కాస్త ఆగి.. వాస్తవాలను నిర్ధారించుకోండి.
ఐక్యరాజ్య సమితి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final 2023: అజింక్య రహానే.. ఆ బాధ్యత నీదే: రాహుల్ ద్రవిడ్
-
Movies News
Naga Chaitanya: నాగ చైతన్య రీమేక్ సినిమాపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన టీమ్
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. రంగంలోకి సీబీఐ
-
India News
Manipur: మణిపుర్లో మళ్లీ చెలరేగిన హింస.. ఇంటర్నెట్పై బ్యాన్ కొనసాగింపు
-
General News
APSRTC: స్టీరింగ్ విరగడంతో ఆర్టీసీ బస్సు బోల్తా.. 19 మందికి గాయాలు
-
India News
Brij Bhushan Singh: రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్ భూషణ్ ఇంటికి దిల్లీ పోలీసులు