ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత

లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై వేసిన అనర్హత వేటును లోక్‌సభ అనూహ్యంగా ఎత్తివేసింది.

Updated : 30 Mar 2023 06:25 IST

సుప్రీంకోర్టులో విచారణకు ముందు లోక్‌సభ కీలక నిర్ణయం

ఈనాడు, దిల్లీ: లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై వేసిన అనర్హత వేటును లోక్‌సభ అనూహ్యంగా ఎత్తివేసింది. ఓ కేసులో ఆయనకు శిక్ష పడటంతో 10వారాల కిందట అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత ట్రయల్‌ కోర్టు తీర్పును కేరళ హైకోర్టు నిలిపేయడంతో తనపై వేసిన అనర్హత వేటును తొలగించాల్సిందిగా లోక్‌సభను ఫైజల్‌ కోరారు. అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఆ కేసు విచారణకు రానున్న కొద్ది గంటల ముందు అనర్హతను ఎత్తివేస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. కేరళ హైకోర్టు తీర్పును గౌరవిస్తూ అనర్హతను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే ఫైజల్‌ లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. మరోవైపు ఫైజల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటును తొలగించడంతో ఆయన వేసిన కేసును సుప్రీంకోర్టు బుధవారం ముగించింది.

మహ్మద్‌  ఫైజల్‌ లక్షద్వీప్‌ నుంచి ఎన్సీపీ తరఫున 2019లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్‌ అల్లుడు మొహమ్మద్‌ సలీహ్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫైజల్‌పై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన కవరత్తి సెషన్స్‌ కోర్టు  ఫైజల్‌కు జనవరి 11న 10ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానాను విధించింది. దీంతో వెంటనే స్పందించిన లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయనపై జనవరి 13వ తేదీన అనర్హత వేటు వేసింది. జనవరి 18వ తేదీన ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈలోగా ఫైజల్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. జనవరి 25వ తేదీన శిక్షను హైకోర్టు నిలిపేసింది.  పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడిన రాహుల్‌ గాంధీపై ఇటీవల అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని