విద్వేష ప్రసంగాలు విషవలయాలు

మతాన్ని రాజకీయాలతో మిళితం చేయడంతోనే ప్రధాన సమస్య ఎదురవుతోంది. ఆ రెండింటినీ వేరు చేస్తే సమస్య కనుమరుగవుతుంది.

Updated : 30 Mar 2023 06:23 IST

రాజకీయాలకు మతాన్ని వాడుకోవడం మానేస్తే వాటికి అడ్డుకట్టపడుతుంది
సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

మతాన్ని రాజకీయాలతో మిళితం చేయడంతోనే ప్రధాన సమస్య ఎదురవుతోంది. ఆ రెండింటినీ వేరు చేస్తే సమస్య కనుమరుగవుతుంది. రాజకీయ నాయకులు మతాన్ని ఉపయోగించుకోవడం విరమించాలి. రాజకీయాలను మతంతో ముడిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

సుప్రీం ధర్మాసనం

దిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి ఇవి ప్రమాదకరమని హెచ్చరించింది. రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయాలని స్పష్టం చేసింది. అలాగైతేనే రెచ్చగొట్టే ఉపన్యాసాలకు తెర పడుతుందని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. విద్వేష ప్రసంగాలపై కోర్టు ధిక్కరణ చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మాజీ ప్రధాన మంత్రులు జవహర్‌ లాల్‌ నెహ్రూ, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రసంగాలను ఉదహరించిన ధర్మాసనం.. వారి మాటలు వినేందుకు మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచీ ప్రజలు వచ్చేవారని గుర్తు చేసింది. అన్ని వర్గాల ప్రజలు విద్వేష ప్రసంగాలు చేయకుండా ప్రతిజ్ఞ ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. రోజూ ఎవరో ఒకరు ఇతరులను అవమానించేలా విద్వేష వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నా రాష్ట్రాలు వారిపై కేసులు నమోదు చేయడంలో విఫలం అవుతున్నాయని అసహనం వ్యక్తం చేసింది. నాయకులు రాజకీయాలతో మతాన్ని మిళితం చేయడంతోనే అసలు సమస్య వస్తోందని పేర్కొంది. మతాన్ని అడ్డుపెట్టుకొని చేసే రాజకీయాలు దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ప్రస్తుత కేసులో కక్షిదారుగా చేరుతామంటూ హిందూ సమాజ్‌ సంస్థ చేసుకున్న అభ్యర్థనను ధర్మాసనం అనుమతించింది. ఈ సంస్థ మహారాష్ట్రలో నిర్వహించిన కార్యక్రమాలు, వాటిలో చేసిన వివాదాస్పద ప్రకటనలు విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. చట్టాలను ఉల్లంఘిస్తూపోతే అందరితో పాటు మీకూ తీవ్ర నష్టం కలిగిస్తాయని సంస్థ తరఫు వ్యక్తులను హెచ్చరించింది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, అగ్రరాజ్యంగా అవతరించాలంటే చట్టబద్ధమైన పాలన కొనసాగాలని, నివాస యోగ్యమైన దేశంగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది. విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోవాలని నిరంతరంగా కేసులు నమోదవుతూ ఉంటే న్యాయస్థానాలు ఎన్నిటిని విచారించగలవని ప్రశ్నించింది. ఈ తరహా నేరాలు ఆగిపోవాలంటే ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని, ఇందుకు పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని తెలిపింది.

సొలిసిటర్‌ జనరల్‌ అభ్యంతరాలు

విద్వేష ప్రసంగాలపై పిటిషన్‌ దాఖలు చేసిన షహీన్‌ అబ్దుల్లా ఎంపిక చేసిన కొన్ని ఉపన్యాసాలను మాత్రమే ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఆరోపించారు. కేరళలోని ఒక ఘటనను, తమిళనాడులో డీఎంకే నాయకుడు చేసిన ప్రకటనను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాటిని పిటిషనర్‌ ఎందుకు జతచేయలేదని నిలదీశారు. ఆ రెండు రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ధర్మాసనం...మెహతా మధ్య వాడివేడి సంభాషణ జరిగింది. చర్యకు ప్రతిచర్య ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. విద్వేష ప్రసంగాలు విషవలయాల వంటివని తెలిపింది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించాల్సి ఉంటుందని చెబుతూ... విద్వేష ప్రసంగాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా మౌనం వహించడం వల్లే కోర్టు ధిక్కరణ కేసును విచారణకు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. తుషార్‌ మెహతా స్పందిస్తూ పీఎఫ్‌ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి నోటీసు జారీ చేయాలని కోరారు. కొన్ని ప్రసంగాల వీడియో క్లిప్పులను ప్రదర్శించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది. ‘విచారణను ఒక డ్రామాగా మార్చొద్దు. వీడియో క్లిప్పులను చూడడానికి ఒక పద్దతి ఉంటుంది. అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. కావాలంటే ఆ వీడియోలను మీ పత్రాలతో జతచేసి సమర్పించవచ్చు’అని బదులిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 28వ తేదీకి వాయిదా వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ స్పందనను తెలియజేయాల్సిందిగా ఆదేశించింది.
విద్వేష ప్రసంగాలపై కోర్టు ధిక్కరణ చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు విద్వేషపూరిత ప్రసంగాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని