విపక్షాల నిరసనల మధ్య కాంపిటీషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

అదానీపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు, రాహుల్‌ గాంధీ అనర్హత వేటు అంశాలు బుధవారం కూడా పార్లమెంటును కుదిపేశాయి.

Published : 30 Mar 2023 05:53 IST

దిల్లీ: అదానీపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు, రాహుల్‌ గాంధీ అనర్హత వేటు అంశాలు బుధవారం కూడా పార్లమెంటును కుదిపేశాయి. ఉభయసభలూ సజావుగా సాగలేదు. అదానీ సంస్థలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలన్న తమ డిమాండును విపక్షాలు పునరుద్ఘాటించాయి. ప్లకార్డులు చేతపట్టి మోదీ-అదానీ భాయి-భాయి అంటూ సభ్యులు నినాదాలు చేశారు. ఈ నిరసనల మధ్యే లోక్‌సభలో కాంపిటీషన్‌ (సవరణ) బిల్లు-2022 ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై ప్రస్తుతం అనుసరిస్తున్న మార్కెట్‌ టర్నోవర్‌ పద్ధతిలో కాకుండా అంతర్జాతీయ టర్నోవర్‌ ఆధారంగా జరిమానా విధించే అధికారం ఈ బిల్లు ద్వారా కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)కు లభించనుంది. ఆ తర్వాత అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు-2023ను కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ప్రవేశపెట్టారు. తాజా సవరణలతో జాతీయ ప్రాధాన్యత కలిగిన భద్రతా, వ్యూహాత్మక ప్రాజెక్టులను ఈ చట్టం పరిధి నుంచి తప్పించనున్నారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో సభాపతి స్థానంలో ఉన్న రమాదేవి సోమవారానికి లోక్‌సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. విపక్షాల నినాదాల మధ్య కాంపిటీషన్‌ (సవరణ) బిల్లు-2022 ఆమోదం పొందినట్లు ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కఢ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు