శ్రీరామనవమి వేడుకల్లో ఘర్షణలు

శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా గురువారం కొన్నిచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

Published : 31 Mar 2023 04:29 IST

దిల్లీ, ఇందౌర్‌, హావ్‌డా: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా గురువారం కొన్నిచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌లోని వడోదరలో రెండు చోట్ల రాళ్ల దాడులు చోటుచేసుకున్నాయి. ఫతేపురలో ఎవరికీ గాయాలు కాలేదని, కుంభర్‌వాడలో ఒక మహిళసహా కొంతమంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాలో ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. పలు వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. దుకాణాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగాల్‌లో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు దాదాపు 1000 ఊరేగింపులను నిర్వహించాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రామ మందిరం వద్ద జరిగిన ఘర్షణలో 10 మంది పోలీసులతోసహా 12 మంది గాయపడ్డారు. రెండు వర్గాలు ఘర్షణ పడటంతో 500 మంది ఓ వర్గానికి చెందినవారు రాళ్లు, పెట్రోలు సీసాలను విసిరారు. బుధవారం రాత్రి రామ మందిరం ప్రాంతంలో 13 వాహనాలను అగ్నికి ఆహుతి చేయడం గురువారం ఘర్షణలకు దారితీసింది. పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గత ఏడాది హనుమాన్‌ జయంతి సందర్భంగా తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న దిల్లీలోని జహంగీర్‌పురిలో పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా భారీ సంఖ్యలో భక్తులు ర్యాలీ నిర్వహించారు. అయోధ్యలోని సరయూ నదిలో దాదాపు 25 లక్షల మంది స్నానాలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని