మురుగునీరు నదుల్లో కలవడంపై సుప్రీంకోర్టు ఆందోళన

గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిత్యం ఉత్పత్తయ్యే మురుగు నీటిని శుద్ధి చేయకుండా నదులు, వాగుల్లోకి నేరుగా వదిలేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Updated : 31 Mar 2023 05:37 IST

సరైన నీటి శుద్ధి చర్యలకు ఆదేశం

దిల్లీ: గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిత్యం ఉత్పత్తయ్యే మురుగు నీటిని శుద్ధి చేయకుండా నదులు, వాగుల్లోకి నేరుగా వదిలేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల విలువైన జలవనరులు కలుషితమై ప్రజల మనుగడపైనే కాకుండా వివిధ జీవరాశుల ఉనికిపైనా తీవ్ర దుష్ప్రభావం చూపుతోందని హెచ్చరించింది. తమ రాష్ట్రంలో 100 శాతం మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీ) ఏర్పాటుకు మరింత గడువు కావాలన్న ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ రాష్ట్రంలో మురుగు నీటి శుద్ధికి సరైన యంత్రాంగం ఏర్పాటయ్యేలా చూసే బాధ్యతను జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)కు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వాలు నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా అవి సక్రమంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవడం, శుద్ధి తర్వాత పొగుపడే వ్యర్థాల తరలింపు తదితర వ్యవహారాలను కూడా చిత్తశుద్ధితో నిర్వర్తించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అవసరమైనంత గడువును పొడిగించే వెసులుబాటును ఎన్‌జీటీకి కల్పించింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి వెలువడే మురుగు నీటిని 100శాతం శుద్ధి చేసేలా ఎస్టీపీలను మూడేళ్ల వ్యవధిలో అన్ని రాష్ట్రాలూ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2017 ఫిబ్రవరి 22న ఆదేశించింది. అయితే, తమది దేశంలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమని, ఈ వ్యవధిలో ఎస్టీపీలను పూర్తిస్థాయిలో నెలకొల్పడం సాధ్యం కాదని, 2025 జూన్‌ వరకు గడువునివ్వాలని కోరుతూ యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా విచారణలో ఆ గడువు పెంపుపై నిర్ణయాధికారాన్ని ఎన్జీటీకి ధర్మాసనం అప్పగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని