సంక్షిప్త వార్తలు(6)

చిన్నారుల పెంపకంలో జాగ్రత్త వహించాలని, చిన్న వయసులో వారిని కఠినంగా పెంచితే... దీర్ఘకాలంలో మానసిక సమస్యలు ఎదుర్కొంటారని తాజా అధ్యయనం పేర్కొంది.

Updated : 01 Apr 2023 05:57 IST

కఠినంగా పెంచితే చిన్నారుల్లో మానసిక సమస్యలు

దిల్లీ: చిన్నారుల పెంపకంలో జాగ్రత్త వహించాలని, చిన్న వయసులో వారిని కఠినంగా పెంచితే... దీర్ఘకాలంలో మానసిక సమస్యలు ఎదుర్కొంటారని తాజా అధ్యయనం పేర్కొంది. మూడు, ఐదు, తొమ్మిదేళ్ల వయసు ఉన్న వేల మంది చిన్నారులను పరీక్షించిన అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌, యూనివర్సిటీ అఫ్‌ డబ్లిన్‌ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ‘‘మూడేళ్ల వయసులో ప్రతికూల వాతావరణంలో ఎదిగే చిన్నారులు.. తమ తోటివారితో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువగా మానసిక ఆరోగ్య సమస్యలకు ప్రభావితమవుతారు.  కుంగుబాటు, సామాజిక వెనుకబాటుతనం, అతిగా ఉద్వేగానికి గురికావడం తదితర లక్షణాలు వీరిలో కనిపిస్తాయి’’ అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కఠినమైన క్రమశిక్షణ, నిత్యం వారిపై అరవడం, భౌతికంగా శిక్షించడం..తప్పు చేసినపుడు వారిని మిగతా చిన్నారుల నుంచి వేరు చేయడం తదితర పనులు తల్లిదండ్రులు చేయకూడదని సూచించారు.


అనారోగ్య నిద్రతో ముప్పు.. వ్యాయామమే పరిష్కారం

దిల్లీ: ఎక్కువ సమయం నిద్రించినా, తక్కువ సేపు శయనించినా ప్రమాదమే. దీని వలన రకరకాల అనారోగ్యకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరణముప్పు ప్రమాదమూ ఉంది. అయితే ఇలా తక్కువ, ఎక్కువ నిద్రపోయేవారు.. తగిన శారీరక వ్యాయామం చేస్తే మరణముప్పును తగ్గించొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. తక్కువ నిద్రపోయినా, ఎక్కువ నిద్రించినా వ్యాయామం చేసే స్థాయులు కీలకమని పేర్కొంది. ‘‘తక్కువ శారీరక శ్రమ చేసి తక్కువ నిద్రపోతే హృద్రోగ సంబంధిత ముప్పులు వచ్చే అవకాశం 69 శాతం..  ఎక్కువ నిద్ర పోయి, తక్కువ వ్యాయామం చేస్తే క్యాన్సర్‌ వంటి రోగాల బారిన పడే అవకాశం 17 శాతం ఉంది. అయితే వ్యాయామాన్ని పెంచితే ఈ 69%, 17% ముప్పు తగ్గుతుంది’’ అని పరిశోధన పత్రం రచయిత జాంగ్‌ తెలిపారు. 40 నుంచి 73 ఏళ్ల మధ్య ఉన్న 92,221 మంది వయోజనులను పరీక్షించి ఈ నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు.  


26వ విడత ఎన్నికల బాండ్లకు అనుమతి

దిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో 26వ విడత ఎన్నికల బాండ్ల జారీకి కేంద్రం శుక్రవారం అనుమతి జారీ చేసింది. ఏప్రిల్‌ 3(సోమవారం) నుంచి ప్రారంభమయ్యే విక్రయాలు అదే నెల 12వ తేదీతో ముగుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం  తెలిపింది. రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారదర్శకత తీసుకురావడం కోసం  ఎన్నికల బాండ్లను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ద్వారా జారీ చేస్తున్నారు. ఈ బ్యాంక్‌ దేశంలోని తన 29 అధీకృత శాఖల ద్వారా ఈ బాండ్లను విక్రయిస్తుంది. ఆ శాఖల ద్వారానే ఆయా బాండ్లను  పార్టీలు నగదుగా మార్చుకుంటాయి. ఎన్నికల బాండ్లు జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే చెల్లుబాటు అవుతాయి.


కందిపప్పు ధర నియంత్రణకు కేంద్రం చర్యలు

దిల్లీ: పప్పుదినుసుల ధరలు పెరుగుతున్న దృష్ట్యా అహేతుక లాభాల కోసం ధరలు పెంచొద్దని, ముఖ్యంగా కందిపప్పు ధర పెరగకుండా చూడాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్‌ చిల్లర వ్యాపారులను కోరారు. శుక్రవారం భారత రీటెయిలర్ల సంఘం, ప్రధాన వ్యవస్థీకృత రీటెయిలర్లతో జరిగిన సమావేశంలో రోహిత్‌కుమార్‌ మాట్లాడుతూ.. అధిక ధరలతో గృహ వినియోగదారులు ఇబ్బంది పడకుండా లాభాల మార్జిన్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని, పప్పుదినుసుల ధరలు నియంత్రణలో ఉండేలా చూస్తామని సమావేశంలో పాల్గొన్న వ్యాపారులు హామీ ఇచ్చారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాచారం మేరకు.. దేశంలో గత ఏడాదికాలంలో కిలో కందిపప్పు సగటు రీటెయిల్‌ ధర 11.12 శాతం మేర పెరిగి రూ.115కు చేరింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 2022-23 సంవత్సరంలో కందిపప్పు ఉత్పత్తి తగ్గింది. ఇది 36.66 మిలియన్‌ టన్నుల మేర ఉండవచ్చని అంచనా. అంతకుముందు ఏడాది ఈ ఉత్పత్తి 42.20 మిలియన్‌ టన్నులు. ఉత్పత్తి తగ్గిన కారణంగా ధరలు పెరగకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం కొంతమేర దిగుమతులపైనా ఆధారపడుతోంది.


నేడు సిద్ధూ విడుదలయ్యే అవకాశం!

చండీగఢ్‌: కాంగ్రెస్‌ నేత నవజోత్‌సింగ్‌ సిద్ధూ పటియాలా జైలు నుంచి శనివారం విడుదలయ్యే అవకాశముంది. 1988లో జరిగిన ఘర్షణ కేసులో పడ్డ ఏడాది శిక్ష పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన విడుదల కావొచ్చని న్యాయవాది హెచ్‌పీఎస్‌ వర్మ శుక్రవారమిక్కడ తెలిపారు. సుప్రీంకోర్టు ఆయన శిక్షను ఖరారు చేసిన నేపథ్యంలో గత ఏడాది మే 20వ తేదీన లొంగిపోయారు. వెంటనే ఆయనను జైలుకు తరలించారు. అయితే సత్ప్రవర్తన కారణంగా 59 ఏళ్ల సిద్ధూ ముందుగానే విడుదల కానున్నారని ఆయన న్యాయవాది వెల్లడించారు.


పోప్‌ త్వరగా కోలుకోవాలి

- నరేంద్ర మోదీ

నారోగ్యం బారిన పడ్డ పోప్‌ ఫ్రాన్సిస్‌ త్వరగా కోలుకోవాలి. ఆయన ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలి. ఇందుకోసం దేవుణ్ని ప్రార్థిస్తున్నా.


జీ-20 అధ్యక్ష స్థానంతో ఎన్నికల ప్రచారం

- జైరాం రమేశ్‌

‘జీ-20’లో 19 దేశాలు, ఐరోపా సంఘం సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ కూటమి వార్షిక సదస్సులు ఇప్పటివరకు 17 దేశాల్లో జరిగాయి. మన దేశం 18వ సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. అయితే ఈ అధ్యక్ష స్థానాన్ని ఎన్నికల ప్రచారం కోసం భారత్‌లో ఉపయోగించుకున్నంతగా మరే దేశంలోనూ వాడుకోలేదు. మోదీ ఒక ‘అద్భుత ఈవెంట్‌ మేనేజర్‌’ అంటూ ఆడ్వాణీ గతంలో చేసిన వ్యాఖ్య నిజమేనని దీనిద్వారా అర్థమవుతోంది.


పాక్‌ సుప్రీంకోర్టే శాశ్వతంగా రద్దవ్వాలి!

- మార్కండేయ కట్జూ

పంజాబ్‌ ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ పాకిస్థాన్‌ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ధర్మాసనం మళ్లీ రద్దయింది. అది కోర్టా? సర్కసా? నాకైతే అసలు పాక్‌ సుప్రీంకోర్టే శాశ్వతంగా రద్దవ్వాలనిపిస్తోంది!


అడ్డుగోడల్లేవ్‌.. మనందరిదీ ఒకే కుటుంబం

- దలైలామా

ఈ భూమిపై మనుషుల మధ్య సహజసిద్ధ అడ్డుగోడలేమీ లేవు. మనందరిదీ ఒకే కుటుంబం. ప్రస్తుతం ప్రకృతి విపత్తులు, పర్యావరణంలో ప్రతికూల మార్పులు, భూతాపం పెరుగుతూ మానవాళికి ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. ఈ తరుణంలో మనమంతా కలసిమెలసి జీవించడం, ఉమ్మడిగా పనిచేయడం, మన వద్ద ఉన్నవాటిని ఇతరులతో పంచుకోవడం నేర్చుకోవాలి.


చిత్ర వార్తలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు