Digital Water Meters: అపార్ట్‌మెంట్లలో డిజిటల్‌ వాటర్‌ మీటర్లు

తాగునీటి, గృహ అవసరాల కోసం రోజూ 20 ఘనపు మీటర్లకు మించి భూగర్భజలాలు ఉపయోగించే అపార్ట్‌మెంట్లు, గ్రూప్‌ హౌసింగ్‌ సొసైటీలు అన్ని నిర్మాణాల వద్ద తప్పనిసరిగా డిజిటల్‌ వాటర్‌ ఫ్లో మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Updated : 01 Apr 2023 10:05 IST

భూగర్భజలాల వాడకంపై కేంద్రం తాజా నోటిఫికేషన్‌

ఈనాడు, దిల్లీ: తాగునీటి, గృహ అవసరాల కోసం రోజూ 20 ఘనపు మీటర్లకు మించి భూగర్భజలాలు ఉపయోగించే అపార్ట్‌మెంట్లు, గ్రూప్‌ హౌసింగ్‌ సొసైటీలు అన్ని నిర్మాణాల వద్ద తప్పనిసరిగా డిజిటల్‌ వాటర్‌ ఫ్లో మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ భూగర్భజలాలపై ఆధారపడి ఈత కొలనులు ఏర్పాటు చేసుకొని ఉంటే వాటికి తప్పనిసరిగా నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) తీసుకోవాలని స్పష్టం చేసింది. భూగర్భజలాల వినియోగ నియంత్రణకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ 2020 సెప్టెంబర్‌ 24న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవరించి తాజాగా కొత్త నోటిఫికేషను జారీ చేశారు. దీని ప్రకారం.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన మోడల్‌ బిల్డింగ్‌ బైలాస్‌ మేర వాననీటి సంరక్షణ ప్రణాళికను సమర్పించాలి. పరిశ్రమలన్నీ వచ్చే మూడేళ్లలో భూగర్భజలాల వినియోగాన్ని కనీసం 20% మేర తగ్గించుకోవాలి. అందుకు తగ్గట్టు కార్యాచరణ రూపొందించుకోవాలి. ట్యాంకర్ల ద్వారా భూగర్భజలాలను సరఫరా చేసేవారు తప్పనిసరిగా నిరభ్యంతర పత్రం తీసుకోవాలి.

ఉప్పునీరు తోడుకొంటున్నవారు ఆ బోరుబావిలోని నీటి నాణ్యతను నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ క్యాలిబరేషన్‌ లేబొరేటరీస్‌ (ఎన్‌ఏబీఎల్‌) ద్వారా లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రయోగశాలలో పరీక్ష చేయించాలి.

వాణిజ్య సంస్థలు భూగర్భజలాలను తోడుకొంటుంటే వాటర్‌ ఆడిట్‌ను ఆన్‌లైనులో సమర్పించాలి. ఆ నీటిని ఏయే అవసరాలకు ఉపయోగించుకొంటున్నదీ అందులో తెలపాలి. ఈ నివేదికలను సెంట్రల్‌, స్టేట్‌ గ్రౌండ్‌వాటర్‌ అథారిటీస్‌ బహిర్గతం చేయాలి.

రోజుకు వంద క్యూబిక్‌ మీటర్లకు మించి భూగర్భజలాలను వాడుకొనే అన్ని పరిశ్రమలూ ప్రతి రెండేళ్లకోసారి కేంద్ర భూగర్భజల అథారిటీ (సీజీడబ్ల్యూఏ) ధ్రువీకరించిన సంస్థల ద్వారా వాటర్‌ ఆడిట్‌ చేయించాలి. మూడు నెలల్లోపు ఆ నివేదికలను సీజీడబ్ల్యూఏకు సమర్పించాలి.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పారిశ్రామిక ప్రాంతాల్లో భూగర్భజలాల స్థితిగతులను కనిపెట్టి ఉంచడానికి కేంద్ర భూగర్భజలాల మండలి ఆ ప్రాంతాల్లో ఫీజోమీటర్లు నెలకొల్పుతుంది. మిగిలిన పారిశ్రామిక ప్రాంతాల్లో భూగర్భజలాల పర్యవేక్షణ కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. కఠిన శిలల నుంచి భూగర్భజలాలను వాడుకొనే పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణానికి 15 మీటర్లలోపు ఫీజోమీటర్‌ ఏర్పాటు చేయాలి.  

ఇప్పటికే భూగర్భజలాలను అధికంగా తోడేసినట్లు గుర్తించిన ప్రాంతాల్లో రోజుకు వంద ఘనపు మీటర్లకు మించి.. పూర్తి సంక్లిష్టమైన, ఓ మోస్తరు సంక్లిష్ట ప్రాంతాల్లో రోజుకు 500 ఘనపు మీటర్లకు మించి నీరు తోడుకొంటున్నా.. ఒండ్రుమట్టి ప్రాంతాల్లో రోజుకు 2 వేల ఘనపు మీటర్లకు మించి భూగర్భజలాలు వాడుకొంటున్నా ఆ చుట్టుపక్కల అయిదు  కిలోమీటర్ల పరిధిలో భూగర్భజలాలపై పడుతున్న ప్రభావంపైన నిర్దేశిత ప్రొఫార్మా ప్రకారం నివేదిక సమర్పించాలి.

తాగు, గృహ అవసరాల కోసం రోజుకు 0-25 ఘనపు మీటర్ల వరకు భూగర్భజలాలను వాడుకొంటుంటే ఎలాంటి ఛార్జీల వసూలు ఉండదు. 25 నుంచి 200 ఘనపు మీటర్లలోపు నీటి వినియోగానికి ఒక్కో ఘనపు మీటరుకు రూపాయి చొప్పున వసూలు చేయాలి. 200 ఘనపు మీటర్లకు పైన వాడితే రూ.2 చొప్పున వసూలు చేయాలి.

ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు నీటివాడక పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి ఘనపు మీటరుకు 50 పైసలు చెల్లించాలి.

చిత్తడి నేలలకు 500 మీటర్ల దూరంలో ఉండే ప్రాజెక్టులు భూగర్భజలాలు వాడుకొంటే  దానివల్ల ఆ నేలలకు ఎలాంటి ప్రమాదం లేదని నిరూపించే ప్రణాళికను సమర్పించాలి. దీనికి కేంద్ర భూగర్భజల అథారిటీ కంటే ముందుగా వెట్‌ల్యాండ్‌ అథారిటీ ఆమోదం పొందాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని