సంక్షిప్త వార్తలు (10)

శ్రీరామనవమి పర్వదిన నేపథ్యంలో బాబాను దర్శించుకునేందుకు మహారాష్ట్రలోని శిర్డీకి భక్తులు పోటెత్తారు.

Updated : 02 Apr 2023 06:10 IST

శ్రీరామనవమి వేళ శిర్డీ ఆదాయం రూ.4 కోట్లు

(ఈటీవీ భారత్‌)

శ్రీరామనవమి పర్వదిన నేపథ్యంలో బాబాను దర్శించుకునేందుకు మహారాష్ట్రలోని శిర్డీకి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయానికి మూడు రోజుల వ్యవధిలో రూ.4 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. దాదాపు రెండు లక్షల మంది భక్తులు శ్రీ శిర్డీసాయి సమాధిని దర్శించుకొని, బాబాకు కానుకలు సమర్పించారు. సాయి సంస్థాన్‌ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో) రాహుల్‌ జాదవ్‌ మాట్లాడుతూ.. వివిధ మార్గాల్లో భక్తులు తమ కానుకలను సాయిబాబాకు సమర్పించుకున్నారని చెప్పారు. హుండీ బాక్స్‌, కౌంటర్‌, ఆన్‌లైన్‌ విరాళాలన్నింటినీ లెక్కించి ఆ మేరకు వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. టోల్‌ ఛార్జీలు, ఆన్‌లైన్‌ పాసుల ద్వారా కూడా అధిక ఆదాయం వచ్చిందన్నారు.


తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర

దిల్లీ: వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,028కి దిగివచ్చింది. తగ్గించిన ధర శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం మార్పు లేదు.


అట్టహాసంగా ప్రారంభమైన నీతా ముకేశ్‌ అంబానీ సాంస్కృతిక కేంద్రం

ముంబయి: రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్‌ నీతా ముకేశ్‌ అంబానీ సాంస్కృతిక కేంద్రం (ఎన్‌ఎంఏసీసీ) ప్రారంభోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ సెంటర్‌లో దీనిని ఏర్పాటుచేశారు. ఈ సాంస్కృతిక కేంద్రంలో 2,000 మంది పట్టే థియేటర్‌, 250 సీట్ల సామర్థ్యమున్న అత్యాధునిక స్టూడియో, 125 సీట్ల సామర్థ్యమున్న క్యూబ్‌లు ఉన్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకల్లో ముకేశ్‌ అంబానీ కుటుంబసభ్యులతోపాటు పలువురు సినీ తారలు సందడి చేశారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఆయన కుమార్తె సౌందర్య, బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కుటుంబం, సల్మాన్‌ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, షాహిద్‌ కపూర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర-కియారా ఆడ్వాణీ, దీపికా పదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంకా చోప్రా-నిక్‌ జొనాస్‌, క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ కుటుంబం, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ దంపతులు తదితరులు పాల్గొన్నారు.


కేసుల సత్వర విచారణ జరిగేలా న్యాయస్థానాలు చూడాలి: సుప్రీంకోర్టు

దిల్లీ: దేశంలోని జైళ్లు సామర్థ్యానికి మించిన ఖైదీలతో కిక్కిరిసి ఉన్నాయని, వాటిలో  పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రత్యేక చట్టాల కఠిన నిబంధనలు వర్తించే కేసులను సత్వరమే విచారించి, వాటికి ముగింపునివ్వాలని న్యాయస్థానాలకు సూచించింది. సకాలంలో విచారణ పూర్తికాకపోతే నిరుపేద వర్గాలకు చెందిన నిందితులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా సభ్యులుగా ఉన్న ధర్మాసనం తెలిపింది. ఏడు సంవత్సరాల నాలుగు నెలలుగా కస్టడీలో ఉన్న నిందితుడి విడుదలకు ఆదేశాలిచ్చింది. ఈ వ్యవధిలో 30 మంది సాక్షులను మాత్రమే ప్రశ్నించారు. మరో 34 మంది సాక్షులను ప్రశ్నించే ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.


ఆ నిర్ణయాధికారం మాకు లేదు

సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం

దిల్లీ: పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హత వేటుపడిన చట్టసభల సభ్యులు ఆయా స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇటువంటి విషయాల్లో నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో ఈసీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజ్యాంగ అధికరణం 32 ప్రకారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు మాత్రమే తమకు ఉంటాయని తెలిపింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హులైన సభ్యులు...మళ్లీ అదే సభా కాలంలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేలా మార్గదర్శకాలు జారీ చేయాలన్న కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకుర్‌  పిటిషన్‌కు ఈసీ ఈ సమాధానమిచ్చింది.


స్వలింగ వివాహాలు కుటుంబవ్యవస్థపై దాడే

సుప్రీంకోర్టులో జమియత్‌ ఉలమా ఏ హింద్‌ వాదన

దిల్లీ: స్వలింగ వివాహాల చెల్లుబాటును కోరుతూ దాఖలైన పిటిషన్లను వ్యతిరేకిస్తూ ప్రముఖ మైనార్టీ సంస్థ జమియత్‌ ఉలమా ఏ హింద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మన కుటుంబ వ్యవస్థపై ఇవి దాడి చేస్తాయని, అన్ని వ్యక్తిగత చట్టాలకు ఇది విరుద్ధమని వాదన వినిపించింది. ఈ విషయమై అత్యున్నత న్యాయస్థానం ఎదుట పెండింగులో ఉన్న పిటిషన్లపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కొన్ని హిందూ సంప్రదాయాలను సైతం ఈ సంస్థ ఉటంకించింది. హిందూ సమాజంలో స్త్రీ, పురుషుల వివాహమనేది కేవలం భౌతికపరమైన ఆనందం, సంతానం కోసమే కాదని.. పెళ్లి ఓ ఆధ్యాత్మిక పురోగతిగా అభివర్ణించింది. హిందువులు పేర్కొనే పదహారు సంస్కారాల్లో వివాహం కూడా ఒకటిగా తెలిపింది. స్వలింగ వివాహాల చట్టపరమైన చెల్లుబాటును ప్రత్యేక అంశంగా పరిగణించిన సుప్రీంకోర్టు దీనిపై వచ్చిన అన్ని పిటిషన్లను అయిదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు మార్చి 13న ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని ఈ ధర్మాసనం.. పై అంశంపై విన వచ్చే రెండు వర్గాల వాదనలు ఇటు రాజ్యాంగ పరమైన హక్కులు, అటు ప్రత్యేక వివాహ చట్టంతో కూడిన శాసనాలకు సంబంధించినవిగా తెలిపింది.


నెలసరి ఆరోగ్యం సంబంధిత పథకాల అమలు బాధ్యత రాష్ట్రాలదే

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: యువతులు, కిశోరప్రాయ బాలికల నెలసరి(రుతుక్రమ) సంబంధిత ఆరోగ్య పరిరక్షణ పథకాల అమలు బాధ్యత రాష్ట్రాలదేనని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్య రంగం రాష్ట్రాల పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. అయితే, దేశంలోని బాలికల ఆరోగ్య రక్షణకు అవసరమైన వనరులను అందజేయడంతో పాటు వివిధ అంశాల్లో శిక్షణ, చైతన్యపరిచే కార్యక్రమాలను తాము చేపడుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకుర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందనగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12 తరగతులు వరకు చదివే బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందజేసేలా ఆదేశాలివ్వాలని ఆమె పిటిషన్‌లో కోరారు.


రేపటి నుంచి భూటాన్‌ రాజు భారత పర్యటన

దిల్లీ: భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యల్‌ వాంగ్‌చుక్‌ సోమవారం నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఆర్థిక, అభివృద్ధి సహకారం తదితర అంశాలపై ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా దృష్టి సారిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో వాంగ్‌చుక్‌ సమావేశం అవుతారు.


కొత్తగా 2,994 మందికి కొవిడ్‌-19

దిల్లీ: దేశంలో కొత్తగా 2,994 మంది కొవిడ్‌-19 బారినపడ్డారు. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 16,354కు చేరింది. వైరస్‌తో పోరాడుతూ తాజాగా ఏడుగురు మరణించారు. దేశంలో ఇప్పటి వరకు 4,47,18,781 మంది కరోనా బారిన పడగా, 5,30,876 మరణాలు సంభవించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం ప్రకటించింది.


రక్షణ రంగ ఎగుమతుల్లో రికార్డు

దేశ రక్షణ రంగ ఎగుమతులు నూతన గరిష్ఠానికి చేరుకున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాటి విలువ రూ.15,920 కోట్లుగా నమోదైంది. ఇది దేశానికి దక్కిన అపురూపమైన విజయం. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో రక్షణ రంగ ఎగుమతుల్లో వృద్ధి పెరుగుతూనే ఉంటుంది.  

రాజ్‌నాథ్‌ సింగ్‌


‘ప్రాజెక్టు టైగర్‌’కు 50 ఏళ్లు

జాతీయ జంతువైన పులుల సంరక్షణ కోసం ప్రారంభించిన ‘ప్రాజెక్టు టైగర్‌’ 50 వసంతాలు పూర్తి చేసుకుంది. వన్యప్రాణుల సంరక్షణ పట్ల భారత దేశ దృఢ నిబద్ధతకు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తిదాయక వారసత్వానికి ఇది సూచిక. దేశ పర్యావరణ సమతుల్యత పునరుద్ధరణకు, ప్రకృతితో సామరస్యంగా జీవించేందుకు ప్రజల సమష్టి సంకల్పానికి ఈ ప్రాజెక్టు విజయమే నిదర్శనం.

రాహుల్‌ గాంధీ


ఉక్రెయిన్‌లో 248 సాంస్కృతిక  కేంద్రాలు ధ్వంసం

రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో చారిత్రక కట్టడాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఏడాది క్రితం 50 సాంస్కృతిక కేంద్రాలు ధ్వంసం కాగా, ప్రస్తుతం వాటి సంఖ్య 248కి చేరింది. వాటిలో పలు స్మారక కట్టడాలు, మ్యూజియంలు, గ్రంథాలయాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు గట్టి చర్యలు చేపట్టాలి.

యునెస్కో


సాంకేతిక పురోగతిని ఆపలేం

క్యాలిక్యులేటర్‌ వినియోగానికి వ్యతిరేకంగా 1988లో నిరసనలు జరిగాయి. ఇప్పుడు చాట్‌జీపీటీని వ్యతిరేకిస్తున్నారు. సాంకేతిక పురోగతిని అడ్డుకోవడం సాధ్యం కాదు. దానికి బదులు కొత్త సాంకేతికతను మానవ ప్రగతి కోసం ఎలా వినియోగించుకోవచ్చన్నదానిపై దృష్టిపెట్టాలి.

హర్ష్‌ గోయెంకా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని