ఎన్‌కౌంటర్‌ చేయొద్దని.. ప్లకార్డుతో ప్రత్యక్షమైన దొంగ

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని సుహాన్‌పుర్‌ జిల్లా ఫతేపుర్‌ పోలీస్‌స్టేషనులో ఎన్‌కౌంటర్‌ భయంతో ఓ దొంగ తానే పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయాడు.

Published : 02 Apr 2023 05:18 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని సుహాన్‌పుర్‌ జిల్లా ఫతేపుర్‌ పోలీస్‌స్టేషనులో ఎన్‌కౌంటర్‌ భయంతో ఓ దొంగ తానే పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయాడు. ముజఫర్‌పుర్‌ జిల్లా బుధానా వద్ద నివసిస్తున్న అభినవ్‌ కొన్నిరోజుల క్రితం మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఫతేపుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధి నుంచి రూ.2.75 లక్షలు అపహరించాడు. ఈ కేసులో రాహుల్‌, సచిన్‌ అనే ఇద్దరు నిందితులను పోలీసులు మార్చి 16న అరెస్టు చేసి జైలుకు పంపారు. ప్రధాన సూత్రధారి అభినవ్‌ కోసం గాలించి, అతడి ఆచూకీ చెబితే రూ.25 వేల రివార్డు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న అభినవ్‌.. పోలీసుల కంటబడితే ఎన్‌కౌంటర్‌ చేస్తారేమో అని భయపడిపోయాడు. వెంటనే ఫతేపుర్‌ ఠాణాకు వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోయాడు. ‘‘సర్‌.. నన్ను అరెస్టు చేసి జైలుకు పంపండి. ఎన్‌కౌంటర్‌ అంటే నాకు చాలా భయం. ఇలాంటి నేరాలు భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడూ చేయను’’ అని రాసి ఉన్న ప్లకార్డును కూడా వెంట తెచ్చుకున్న అభినవ్‌ను చూసి పోలీసులు విస్తుపోయారు. తాను అపహరించిన డబ్బులో రూ.40 వేలు అభినవ్‌ వెనక్కు ఇచ్చాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు