Arvind Kejriwal: మోదీ విద్యార్హతపై అనుమానం పెరిగింది: కేజ్రీవాల్‌

గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రధాని మోదీ విద్యార్హత విషయంలో అనుమానం మరింత పెరిగిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం పేర్కొన్నారు.

Updated : 02 Apr 2023 08:05 IST

దిల్లీ: గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రధాని మోదీ విద్యార్హత విషయంలో అనుమానం మరింత పెరిగిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం పేర్కొన్నారు. మోదీ విద్యావంతుడైతే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుని ఉండకపోయేవారన్నారు. మోదీ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని కేజ్రీవాల్‌కు అందించాలంటూ గుజరాత్‌ యూనివర్సిటీని ఆదేశిస్తూ ఏడేళ్ల క్రితం కేంద్ర సమాచార కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం కొట్టేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ‘‘ఈ రోజు నాదొక సందేహం. ప్రస్తుత 21వ శతాబ్దంలో భారత ప్రధానమంత్రి విద్యావంతుడై ఉండాలా? వద్దా? మోదీకి డిగ్రీ ఉంటే దానిని గుజరాత్‌  వర్సిటీ ఎందుకు చూపించడంలేదు. ప్రధాని దర్పం చూసి లేదా ఆయన నకిలీ డిగ్రీ నేపథ్యంలో మోదీ విద్యా విషయంలో జోక్యానికి గుజరాత్‌ యూనివర్సిటీ ముందుకు రావడంలేదు. ప్రజాస్వామ్యంలో సమాచారం తెలుసుకోవడానికి, ప్రశ్నలు అడగడానికి స్వేచ్ఛ ఉండాలి. హైకోర్టు ఆదేశాలతో యావద్దేశం ఆశ్చర్యానికి గురైంది’’ అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు తన ప్రభుత్వ అవినీతిని దర్యాప్తు సంస్థలు క్రమంగా రుజువులతో వెలికితీస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నట్లు ఉందని భాజపా ఆక్షేపించింది. లేదంటే తన భవిష్యత్తు కోసం వేదికను సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయని విమర్శించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని