న్యాయసమ్మతి లేని సుదీర్ఘ ఖైదు తగదు

నేరాలను నిరోధించి, శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నప్పటికీ వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా, న్యాయసమ్మతం కాని రీతిలో దీర్ఘకాలం ఖైదీలుగా ఉంచి వేధించడం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 02 Apr 2023 05:57 IST

నిర్ణీత సమయంలో అభియోగాలు నమోదు కాకపోతే డిఫాల్ట్‌ బెయిలుకు అర్హులే: సుప్రీంకోర్టు

దిల్లీ: నేరాలను నిరోధించి, శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నప్పటికీ వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా, న్యాయసమ్మతం కాని రీతిలో దీర్ఘకాలం ఖైదీలుగా ఉంచి వేధించడం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరశిక్షాస్మృతిలోని సెక్షన్‌ 167(2) ప్రకారం..రిమాండ్‌కు పంపిన 60 లేదా 90 రోజుల్లోగా దర్యాప్తు సంస్థ అభియోగాలను నమోదు చేయలేక పోతే ఆ నిందితుడు డిఫాల్ట్‌ బెయిల్‌కు అర్హులు. అయితే, రిమాండ్‌ విధించిన తేదీ నుంచి ఆ గడువును లెక్కించాలా లేక ఆ రోజును మినహాయించాలా అనే న్యాయ వివాదంపై స్పష్టతనిస్తూ జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి రిమాండు విధించిన తేదీ నుంచే ఆ గడువును లెక్కించాల్సి ఉంటుందని జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న సభ్యులుగా ఉన్న ధర్మాసనం తెలిపింది. రిమాండులో ఉన్న నిందితుల విషయంలో నిర్ణీత గడువులోగా అభియోగాల నమోదు లేదా అనుబంధ విజ్ఞప్తులను చేయకుండా దర్యాప్తు సంస్థలు కాలయాపనకు ప్రయత్నిస్తుంటే ...ఆయా వ్యక్తుల హక్కులను న్యాయస్థానాలు పరిరక్షించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో నిందితుల హక్కులకున్న పరిమితులనూ పరిశీలనలోకి తీసుకుంటుందని స్పష్టం చేసింది. యెస్‌ బ్యాంక్‌ మనీలాండరింగ్‌ కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రొమోటర్లు కపిల్‌ వాధ్వాన్‌, ధీరజ్‌ వాధ్వాన్‌లకు బాంబే హైకోర్టు డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన వాజ్యంపై వాదనల సందర్భంగా ధర్మాసనం ముందు ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు