పేదల సత్తా మీకు అర్థం కాదు

తమను తాము పెద్ద ఆర్థికవేత్తలుగా చెప్పుకొనేవారు, బడా వ్యాపారవేత్తలకు రుణాల కోసం ఫోన్లు ద్వారా ఒత్తిళ్లు చేసినవారు ఇప్పుడు ‘ముద్రా’ పథకాన్ని అవహేళన చేస్తున్నారని, పేదల సత్తా ఏమిటో వారికి అర్థం కాదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.

Published : 14 Apr 2023 04:07 IST

అందుకే ముద్రా పథకాన్ని అవహేళన చేస్తున్నారు
కాంగ్రెస్‌ విమర్శల్ని తిప్పికొట్టిన మోదీ

దిల్లీ: తమను తాము పెద్ద ఆర్థికవేత్తలుగా చెప్పుకొనేవారు, బడా వ్యాపారవేత్తలకు రుణాల కోసం ఫోన్లు ద్వారా ఒత్తిళ్లు చేసినవారు ఇప్పుడు ‘ముద్రా’ పథకాన్ని అవహేళన చేస్తున్నారని, పేదల సత్తా ఏమిటో వారికి అర్థం కాదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రూ.50,000 రుణంతో ఏ వ్యాపారాలు చేయగలరని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఇటీవల ప్రశ్నించిన నేపథ్యంలో నేరుగా ఆయన పేరు ప్రస్తావించకుండా ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు. వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 71,506 మందికి నియామకపత్రాలు ఇచ్చేందుకు గురువారం నిర్వహించిన ‘రోజ్‌గార్‌ మేళా’ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన ప్రసంగించారు. ‘ముద్రా పథకం ద్వారా ఎనిమిది కోట్ల మందికి ఉపాధి లభించింది. రూ.23 లక్షల కోట్ల రుణాలు ఇంతవరకు ఇచ్చాం. లబ్ధిదారుల్లో 70% మంది మహిళలే. దిగువస్థాయి నుంచి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సూక్ష్మస్థాయి రుణాలు ఎంతో దోహదపడతాయి’ అని చెప్పారు. 

30 వేల ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల తయారీ

అధునాతన ఉపగ్రహాల నుంచి సెమీ హైస్పీడ్‌ రైళ్ల వరకు అన్నింటినీ దేశీయంగానే తయారు చేసుకుని కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. గత ఎనిమిదేళ్లలో 30,000 పైగా ఎల్‌హెచ్‌బీ రైలుపెట్టెల్ని దేశంలో తయారు చేసుకున్నామని చెప్పారు. 300 పైగా పరికరాలు, ఆయుధాలను దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటూ, దిగుమతుల్ని తగ్గించుకోవడమే కాకుండా రూ.15,000 కోట్ల విలువైన ఎగుమతుల్ని చేయగలిగామని వివరించారు. 

పాలించడం అంటే తమాషాగా మారింది: కాంగ్రెస్‌

రోజ్‌గార్‌ మేళాపై కాంగ్రెస్‌ స్పందిస్తూ.. పాలించడమంటే ప్రధానికి చాలా తమాషాగా మారిందని వ్యాఖ్యానించింది. ఎంతో ఆలస్యంగా అతి కొద్దిమందికి ఉద్యోగావకాశాలు కల్పించారని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో 36 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఒక్క రైల్వేలోనే మూడు లక్షలకు పైగా భర్తీ కావాలని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని