Train: నీళ్ల కోసం రైలు దిగి.. 22 ఏళ్లకు ఇంటికొచ్చాడు!

ఉపాధి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి.. ఏమయ్యాడో తెలియని పరిస్థితుల్లో  ఏళ్లతరబడి కుటుంబానికి దూరమయ్యాడు.

Updated : 22 Apr 2023 10:05 IST

ఉపాధి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి.. ఏమయ్యాడో తెలియని పరిస్థితుల్లో  ఏళ్లతరబడి కుటుంబానికి దూరమయ్యాడు. చివరకు 22 ఏళ్ల తర్వాత విధి అతణ్ని తన కుటుంబం వద్దకు చేర్చింది. బిహార్‌ రాష్ట్రంలోని దర్భంగా జిల్లా బిచ్చౌలి గ్రామానికి చెందిన రమాకాంత్‌ ఝా ఉన్నచోట పని దొరక్క.. భార్య, మూడేళ్ల కుమారుడిని ఇంట్లో వదిలేసి రైలులో హరియాణాకు పయనమయ్యాడు. అంబాలా స్టేషనులో రైలు ఆగింది. నీళ్లబాటిలు కొనడానికి దిగిన రమాకాంత్‌ మళ్లీ రైలు ఎక్కేలోపే అది వెళ్లిపోయింది. దీంతో ఇంటికి ఎలా వెళ్లాలో రమాకాంత్‌కు తోచలేదు. అలా తిరుగాడుతూ ఆకలిదప్పులతో క్రమంగా అతడి మానసిక పరిస్థితి మరింత దిగజారింది. రోడ్డు పక్కన దొరికింది తింటూ కాలం గడిపాడు. రమాకాంత్‌ ఏమయ్యాడో తెలియని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి, పలుచోట్ల వెదికారు. వీధుల్లో తిరుగుతున్న రమాకాంత్‌ కర్నాల్‌లో ఉండే ‘ఆషియానా’ స్వచ్ఛంద సంస్థ డైరెక్టరు రాజ్‌కుమార్‌ అరోరా కంటపడ్డాడు. ఆయన తన ఇంటికి తీసుకెళ్లి.. మంచి ఆహారం, వైద్యం అందించారు. రెండు నెలల తర్వాత రమాకాంత్‌కు గతం గుర్తొచ్చింది. దర్భంగా జిల్లా ఎస్పీకి రాజ్‌కుమార్‌ ఫోను ద్వారా ఈ విషయం చేరవేశారు. 22 ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు తర్వాత బుధవారం తన కుటుంబాన్ని రమాకాంత్‌ కలుసుకొన్నాడు. మూడేళ్ల బాలుడిగా తాను చూసిన కుమారుణ్ని ఇప్పుడు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకుడిగా చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని