EPFO - Higher Pension: అధిక పింఛనుపై ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం
ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే వేతనజీవులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు అధిక పింఛను అమలులో భాగంగా ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది.
అదనపు వేతనంపై 1.16 శాతం వాటా యజమాని చందా నుంచే సమీకరణ
అర్హత కలిగిన ఉద్యోగుల ఈపీఎస్ చందా 8.33 నుంచి 9.49 శాతానికి పెంపు
2014 సెప్టెంబరు 1 నుంచి అమలులోకి నిబంధన
కేంద్ర కార్మికశాఖ నోటిఫికేషన్ జారీ
ఈనాడు, హైదరాబాద్: ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే వేతనజీవులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు అధిక పింఛను అమలులో భాగంగా ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులు, ఉద్యోగులు, పింఛనుదారులకు యాజమాన్యాలు చెల్లించిన 12 శాతం చందాలో నుంచే 1.16 శాతం మొత్తాన్ని ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)కు జమ చేసేలా ఈపీఎఫ్‌వో చట్టాన్ని సవరిస్తూ కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నిబంధన 2014 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. బేసిక్, డీఏ, ఇతర భత్యాలు సహా వేతనం రూ.15,000 మించిన వారికి మాత్రమే ఈ నిబంధన వర్తించనుంది. అధిక పింఛనుకు అర్హత పొందని ఉద్యోగులకు, రూ.15 వేలు, అంతకన్నా తక్కువ వేతనం కలిగిన ఉద్యోగులకు మాత్రం యథావిధిగా ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారమే యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను నిధిలో, మిగతా 3.67 శాతం ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో జమ అవుతుంది. పింఛను నిధి పథకానికి ఈపీఎఫ్‌వో 2014 సెప్టెంబరు 1న సవరణలు చేసింది. దీని ప్రకారం గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచింది.
అధిక పింఛను కోసం యజమానితో కలిసి ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించి పొందుతున్న అదనపు వేతనంపై తమ చందా నుంచి 1.16 శాతం చొప్పున వాటా ఇవ్వాలని ఈపీఎఫ్‌వో షరతు పెట్టింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఉద్యోగుల వేతనం నుంచి అదనంగా తీసుకోవడం సామాజిక భద్రత నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. పింఛను నిధికి అదనపు చెల్లింపుల నిర్ణయాన్ని ఆరు నెలలపాటు నిలిపివేస్తున్నట్లు నిరుడు నవంబరులో ఉత్తర్వులిచ్చింది. నిధులను సమీకరించే ఇతర మార్గాలను పరిశీలించాలని సూచించింది. ఈ క్రమంలోనే ఉద్యోగి తన వంతుగా 1.16 శాతం చెల్లించాల్సిన అవసరం లేకుండా.. యజమాని జమ చేసే మొత్తం నుంచి దాన్ని ఈపీఎస్‌కు మళ్లించాలని ఈపీఎఫ్‌వో తాజాగా నిర్ణయం తీసుకుంది.
యజమాని చందా నుంచి సమీకరణ ఇలా..
* సాధారణంగా ఉద్యోగుల భవిష్య నిధికి యజమానుల వాటా కింద జమ అయ్యే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌లోకి వెళ్తుంది. 3.67 శాతం ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది.
* ఈపీఎఫ్‌వో తాజా నిర్ణయంతో.. అధిక పింఛను దరఖాస్తు ఆమోదం పొందిన చందాదారులకు యజమాని చెల్లించే 12 శాతంలో నుంచే 1.16 శాతం మొత్తాన్ని సమీకరిస్తారు. దీంతో యజమాని నుంచి ఈపీఎస్ కింద వసూలు చేసే వాటా 9.49 శాతానికి పెరగనుంది. ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలోని వాటా 2.51 శాతానికి తగ్గుతుంది.
* ఉదాహరణకు అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగి వేతనం (మూల వేతనం, కరవు భత్యం కలిపి) రూ.50 వేలు ఉందనుకుందాం. గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలకు మించిన వేతనం రూ.35 వేలు. ఈపీఎస్ నిబంధనల ప్రకారం రూ.15 వేల వరకు 1.16%ం ఈపీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. మిగతా రూ.35 వేలపై 1.16% కింద ఉద్యోగి తన వంతు వాటా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఉద్యోగి తన చందా నుంచి ఈపీఎస్‌కు రూ.406 జమ చేయాలి.
* ప్రస్తుతం ఉద్యోగి వేతనంపై యజమాని వాటా 12% లెక్కన రూ.6 వేలు జమ చేస్తున్నారు. ఇందులో 8.33% (రూ.4,165) ఈపీఎస్‌కు, మిగతా 3.67% (రూ.1,835) ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు వెళ్తోంది.
* తాజా నిర్ణయం ప్రకారం యజమాని వాటాలోని కింద 9.49% కింద రూ.4,745 ఈపీఎస్‌కు వెళ్తుంది. మిగతా 2.51% కింద రూ.1,255 ఉద్యోగి భవిష్య నిధి ఖాతాలో జమ అవుతుంది. ఉద్యోగి తన వంతు వాటా 1.16% లెక్కన రూ.406 జమ చేయాల్సిన అవసరం ఉండదు.
అందుబాటులోకి డిలీట్ ఆప్షన్
అధిక పింఛను దరఖాస్తులు ఇప్పటికే యాజమాన్యాల లాగిన్‌లోకి వచ్చాయి. తాజాగా 1.16 శాతం మొత్తం జమపై ఈపీఎఫ్‌వో స్పష్టత ఇవ్వడంతో దరఖాస్తుల పరిష్కారం వేగమయ్యేందుకు అవకాశాలున్నాయి. ఉమ్మడి ఆప్షన్లు ఇచ్చినపుడు దొర్లిన పొరపాట్లను సరిచేసుకునేందుకు ‘డిలీట్ అప్లికేషన్’ ఆప్షన్‌ను అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం.. పొరపాట్లు దొర్లిన దరఖాస్తును డిలీట్ చేసి, సరైన వివరాలతో కొత్తగా ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుకు యజమాని ఆమోదం తెలిపితే మాత్రం డిలీట్ చేసేందుకు అవకాశం ఉండదు. అయితే దరఖాస్తులను ఈపీఎఫ్‌వో అధికారులు పరిశీలించే సమయంలో తప్పులు సరిచేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వనున్నట్లు ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్(పెన్షన్స్) అప్రజిత జగ్గీ ఆదేశాలు జారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bus Accident: లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ