జాతుల వైరం.. మణిపుర్‌ కల్లోలం

మణిపుర్‌లో ప్రస్తుతం చెలరేగిన అల్లర్లకు మూలం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం.

Published : 06 May 2023 05:07 IST

అడవుల నుంచి తరలింపులపై గిరిజనుల ఆగ్రహం
మెయిటీలకు ఎస్టీ హోదా యత్నాలతో అగ్నికి ఆజ్యం

ఇంఫాల్‌: మణిపుర్‌లో ప్రస్తుతం చెలరేగిన అల్లర్లకు మూలం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం. ఇంఫాల్‌ లోయ, దాని చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో రక్షిత అటవీ ప్రాంతాల నుంచి గిరిజనులను తరలించేందుకు భాజపా నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యలూ హింసకు ఆజ్యం పోశాయి. దీనికితోడు రాష్ట్రంలో మెజారిటీలుగా ఉన్న మెయిటీలకు గిరిజనుల(ఎస్టీ) హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజన సంస్థలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి.

మణిపుర్‌లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్వాభావికంగానే మెయిటీల ఆధిపత్యం ఉంటుంది. రాష్ట్రంలో వారి జనాభా 53 శాతం. వీరిలో ఎక్కువ మంది ఇంఫాల్‌ లోయలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలను జనాభాలో 40 శాతంగా ఉన్న నాగాలు, కుకీలు తరచూ అనుమాన దృక్పథంతో చూస్తున్నారు. వీరంతా లోయకు పైన గల కొండ ప్రాంతాల్లో జీవిస్తుంటారు.
ఇంఫాల్‌ లోయ చుట్టుపక్కల గల కొండ ప్రాంతాలు మిలిటెంట్లకు అనువుగా, దీర్ఘకాల తిరుగుబాటుకు వీలు కల్పించేవిగా ఉన్నాయి. ఇదిలా ఉండగా గత ఫిబ్రవరిలో చేపట్టిన తరలింపు ప్రక్రియ మరో గిరిజనుల వ్యతిరేక చర్యగా మారింది. ఇది ఒక్క కుకీ జాతికే కాక రక్షిత అటవీ ప్రాంతాల్లో గల గ్రామాల్లోని ఇతర గిరిజన తెగల్లోనూ ఆగ్రహావేశాలను రగిల్చింది. ఈ క్రమంలోనే గతవారం చురాచాంద్‌పుర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి ఎన్‌.బిరేన్‌సింగ్‌ పర్యటనకు ముందు న్యూలాంకా పట్టణంలో ఓ గుంపు విధ్వంసం సృష్టించి, పలు ప్రాంతాలను అగ్నికి ఆహుతి చేసింది. నిజానికి ముఖ్యమంత్రి అక్కడ జరిగే ఓ కార్యక్రమంలో ప్రసంగించాల్సి ఉంది. అలాగే శుక్రవారం సీఎం ప్రారంభించాల్సి ఉన్న నూతన ఓపెన్‌ జిమ్‌ను ఓ గుంపు పాక్షికంగా తగలబెట్టింది. పలుమార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పించినా రక్షిత అటవీ ప్రాంతాల నుంచి అక్కడ స్థిరపడిన రైతులు, గిరిజనుల తరలింపు యత్నాలను నిరసిస్తూ తామే విధ్వంసానికి పాల్పడ్డామని గిరిజన జాతుల ఫోరం ప్రకటించింది. సమస్య ఎదుర్కొంటున్న ప్రజలకు పరిష్కారం చూపడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించింది. ‘‘పర్వత జిల్లాలో అనేక ప్రాంతాలను రిజర్వుడ్‌ అడవులుగా ప్రకటించారు. సంప్రదాయ నివాస ప్రాంతాల నుంచి వందల మంది కుకీ గిరిజనులను తరలించారు. ఇందుకు వారేమీ బాధపడటంలేదు. వారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యంపైనే వారు ఆగ్రహంగా ఉన్నారు’’ అని కుకీ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రధాన కార్యదర్శి డీజే హాకిప్‌ పేర్కొంటున్నారు. ఇటువంటి చర్యలు, అసంతృప్తులు మణిపుర్‌లో హింసకు హేతువులవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని