ఎన్నికైన ప్రభుత్వానికే పాలనాధికారం

దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్‌ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Updated : 12 May 2023 06:22 IST

దిల్లీ పాలనపై నియంత్రణ ఆప్‌ సర్కారుదే
అధికారులను బదిలీ చేసుకోవచ్చు
కొత్త నియామకాలూ చేపట్టొచ్చు
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు
కేంద్రం-దిల్లీ మధ్య వివాదానికి ముగింపు
దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హర్షం
ఇక అవినీతి అధికారుల భరతం పడతానంటూ హెచ్చరిక
తీర్పును గౌరవిస్తున్నామన్న భాజపా

ఎన్నికైన ప్రభుత్వానికి పాలనపై నియంత్రణ ఉండాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ప్రభుత్వ విధానాల అమల్లో అధికారులతో కూడిన శాశ్వత కార్యనిర్వాహక వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తే.. అది ఓటర్ల అభీష్టాన్ని విస్మరించొచ్చు. జవాబుదారీతనం లేని అధికారులతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం. కాబట్టి రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ ఉండాల్సిందే.                

సుప్రీంకోర్టు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్‌ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. జాబితా-2లోని మూడు అంశాల (భూములు, పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతలు)కే దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) అధికారాలు పరిమితమని పేర్కొంది. ఈ మూడు మినహాయించి జాబితా-2, జాబితా-3లోని శాసన, కార్యనిర్వాహక అధికారాలన్నీ ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయని ప్రకటించింది. ఈ తీర్పుతో కేంద్రం-దిల్లీ సర్కారుకు మధ్య ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహల రాజ్యాంగ ధర్మాసనం ముగింపు పలికింది. 105 పేజీల ఏకగ్రీవ తీర్పులో ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాజ్యాంగం కల్పించిన సరిహద్దుల్లో మాత్రమే కేంద్రం తన అధికారాలను వినియోగించాలని పేర్కొంది. ‘‘ఎన్నికైన ప్రభుత్వానికి చెందిన మంత్రులకే అధికారులు జవాబుదారీగా ఉండాలి. ప్రతిగా శాసనసభలకు మంత్రులు, ప్రజలకు ప్రజాప్రతినిధులు జవాబుదారీగా వ్యవహరించాలి. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరే సార్వభౌమాధికారం ఉంటుంది. కాబట్టి జవాబుదారీతనం లేని పౌర సేవలు ప్రజాస్వామ్యంలో పాలనకు తీవ్ర హాని కలిగిస్తాయి. ప్రభుత్వ విధానాల అమల్లో ఎన్నికవ్వని పౌర సేవల అధికారులతో కూడిన శాశ్వత కార్యనిర్వాహక వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తే.. అది ఓటర్ల అభీష్టాన్ని విస్మరించే విధంగా కూడా వ్యవహరించొచ్చు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మంత్రి మండలి సలహాలకు ఎల్జీ కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

వివాదం మొదలైందిలా..

దిల్లీలోని పాలనా సేవలపై కేంద్రానికే నియంత్రణ ఉంటుందంటూ 2015లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుతో ఈ వివాదం మొదలైంది. దీన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ ప్రభుత్వం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడా సానుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది.  సర్వోన్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం 2019 ఫిబ్రవరి 14న భిన్నాభిప్రాయ తీర్పును వెలువరించింది. పాలనా సేవలపై దిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ చెప్పగా.. జస్టిస్‌ ఏకే సిక్రీ దాన్ని వ్యతిరేకించారు. దిల్లీలోని పాలనాధికారుల నియంత్రణకు సంబంధించిన శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా, స్థానిక ప్రభుత్వానిదా అనే వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేస్తున్నట్లు గతేడాది మే 6న సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై గురువారం తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది.


ఇక అవినీతి అధికారుల భరతం పడతా

కేజ్రీవాల్‌

సుప్రీంకోర్టు తీర్పును.. ‘ప్రజాస్వామ్య విజయం’గా దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అభివర్ణించారు. ప్రజలకు న్యాయం లభించిందని అన్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే అవినీతి అధికారుల భరతం పడతానని హెచ్చరించారు. ‘‘పరిపాలనాపరంగా రానున్న రోజుల్లో భారీగా మార్పులుంటాయి. ఇప్పటివరకు చేసిన పనులు ఆధారంగా చాలా మంది అధికారులను బదిలీ చేస్తాం. కొంత మంది ఏడాదిన్నరగా ప్రజాపనులకు ఆటంకం కలిగిస్తున్నారు. అలాంటి అధికారులు మూల్యం చెల్లించక తప్పదు. లంచం తీసుకుంటూ పట్టుబడినా ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నాది. ఇప్పుడిక చర్యలు తప్పవు’’ అని కేజ్రీవాల్‌ తెలిపారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామని భాజపా తెలిపింది. ‘‘కేజ్రీవాల్‌ ఎప్పటి నుంచో తాను కోరుకుంటున్నది సాధించారు. భారీగా బదిలీలు ఉంటాయని చెబుతున్నారు. అంటే ఇక దేశ రాజధానికి పదవుల బదిలీ పరిశ్రమ కూడా రాబోతుంది’’ అని దిల్లీ భాజపా అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


తీర్పు ఇలా.. బదిలీ అలా..

సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఆప్‌ సర్కార్‌ కీలక అధికారిని బదిలీ చేసింది. దిల్లీ ప్రభుత్వంలోని సర్వీసెస్‌ విభాగం కార్యదర్శి ఆశిష్‌ మోరెను ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో దిల్లీ జల్‌ బోర్డు మాజీ సీఈవో ఎ.కె.సింగ్‌ను నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని