కోర్టు ఆదేశాలను కేంద్రం ధిక్కరిస్తోంది

కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిని తప్పుపడుతూ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Updated : 13 May 2023 06:09 IST

కేజ్రీవాల్‌ మరో పిటిషన్‌
అధికారి బదిలీ విషయంలో వివాదం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిని తప్పుపడుతూ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దిల్లీ సర్కారులోని సేవల విభాగం కార్యదర్శి ఆశీష్‌ మోరెను ఆ పదవి నుంచి తప్పించడం ప్రస్తుత వివాదానికి కారణమైంది. ఆశీష్‌ బదిలీని కేంద్రం అమలు చేయడం లేదంటూ తన పిటిషన్‌లో కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఐఏఎస్‌లు సహా ఇతర అధికారుల బదిలీలు, నియామకాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని గురువారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆప్‌ సర్కార్‌ ఆశీష్‌ మోరెను బదిలీ చేసి, ఆయన స్థానంలో దిల్లీ జల మండలి మాజీ సీఈవో ఎ.కె.సింగ్‌ను నియమించింది. దిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.ఎం.సింఘ్వి శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహాలతో కూడిన ధర్మాసనం ముందు ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. ‘దిల్లీ ప్రభుత్వం ఏ అధికారినీ బదిలీ చేయకూడదని కేంద్రం చెబుతోంది. గురువారం నాటి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం ధిక్కరణ పిటిషన్‌ వేయొచ్చు. కానీ, దానికి సమయం పడుతుంది. అందుకే ధర్మాసనం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’ అని సింఘ్వి పేర్కొన్నారు. ఈ కేసులో వాదనలు వినేందుకు వచ్చేవారం ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సీజేఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని