భయోత్పాత వాతావరణం సృష్టించకండి

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న దురుద్దేశంతో పాటు రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా మనీలాండరింగ్‌ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారంటూ ఛత్తీస్‌గఢ్‌ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది.

Updated : 17 May 2023 05:31 IST

ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణం కేసులో ఈడీకి సుప్రీంకోర్టు సూచన

దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న దురుద్దేశంతో పాటు రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా మనీలాండరింగ్‌ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారంటూ ఛత్తీస్‌గఢ్‌ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ‘భయోత్పాత వాతావరణాన్ని సృష్టించకండి. మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే నిజాయితీగా జరిగిన లావాదేవీలపై కూడా అనుమానాలు తలెత్తుతాయి’ అంటూ జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.అమానుల్లా ధర్మాసనం మంగళవారం ఈడీ అధికారులకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ...‘ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మద్యం కుంభకోణం కేసులో ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర అధికారులపై ఈడీ తీవ్ర ఒత్తిడి తెస్తోంది. వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరించి తాము చెప్పిన విధంగా వాంగ్మూలం ఇవ్వాలంటోంది. దీంతో అధికారులు ఛత్తీస్‌గఢ్‌ ఎక్సైజ్‌ శాఖలో పనిచేయబోమని ప్రభుత్వానికి చెబుతున్నార’ని ధర్మాసనానికి విన్నవించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈడీ దూకుడు పెంచిందని ఆరోపించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. 2019-2022 మధ్య కాలంలో మద్యం వ్యాపారంలో రూ.2వేల కోట్ల మేర అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోందని ధర్మాసనానికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలపై కేసులు నమోదు చేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తోందని గత నెలలో సుప్రీంకోర్టును ఛత్తీస్‌గఢ్‌ ఆశ్రయించింది. మనీలాండరింగ్‌ చట్టంలోని పలు నిబంధనల చెల్లుబాటును సవాల్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని