విశ్వాసం నింపే చర్యలు తీసుకోండి

రాష్ట్రంలో ప్రజల మధ్య విశ్వాసం నెలకొల్పే చర్యలను వేగంగా తీసుకోవాలని మణిపుర్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.

Published : 18 May 2023 05:08 IST

శాంతిభద్రతలు నెలకొల్పండి
మణిపుర్‌ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం

దిల్లీ: రాష్ట్రంలో ప్రజల మధ్య విశ్వాసం నెలకొల్పే చర్యలను వేగంగా తీసుకోవాలని మణిపుర్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. జాతుల మధ్య చెలరేగిన హింసతో అతలాకుతలమైన రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పాలని సూచించింది. ఈ పరిస్థితిపై రాజకీయ కార్యవర్గం శీతకన్ను వేయకుండా తాము పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఎన్‌.బిరేన్‌ సింగ్‌ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారన్న ఆరోపణలపై అందిన ఫిర్యాదులనూ పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో ప్రకటనలు చేసే ముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందిగా ముఖ్యమంత్రికి సలహా ఇవ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దివాలాలతో కూడిన ధర్మాసనం సూచించింది. మణిపుర్‌లోని మెజారిటీ వర్గీయులైన మైతీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేయాలన్న ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల్లోని చట్టపరమైన అంశాల జోలికి తాము వెళ్లడంలేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు విస్తృత ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అవకాశం లభించినప్పటికీ కోటా అంశంపై తన తీర్పును మణిపుర్‌ హైకోర్టు న్యాయమూర్తి ఎం.వి.మురళీధరన్‌ సవరించుకోలేదంటూ ధర్మాసనం ఆక్షేపించింది. రాష్ట్రంలో చెలరేగిన హింసతో బాధితులైన ప్రజలకు అందించిన సహాయం, పునరావాసం, చేపట్టిన భద్రతా చర్యలపై తాజా వాస్తవ నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు