జల్లికట్టు.. శతాబ్దాల సంప్రదాయం

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత చట్టానికి చేసిన సవరణ రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.

Updated : 19 May 2023 05:53 IST

తమిళనాడు సంస్కృతిలో భాగం కాదన్న వాదనను  అంగీకరించం
ఈ క్రీడ చట్ట సమ్మతమే: సుప్రీం

దిల్లీ: తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత చట్టానికి చేసిన సవరణ రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది. దీంతో పాటు.. దున్నలతో కర్ణాటక నిర్వహించే కంబళ పోటీకి, మహారాష్ట్ర సంప్రదాయ ఎడ్ల పందేలకు కూడా పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు చేసిన చట్ట సవరణలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంటూ గురువారం జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లు ధర్మాసనంలోని ఇతర సభ్యులు. 2017లో జంతు క్రూరత్వ నిరోధక చట్టాలకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర చేసిన సవరణలకు రాష్ట్రపతి అనుమతి కూడా లభించిందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. తమిళనాడులో పొంగల్‌ సమయంలో జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారు. కంబళ దున్నల పందేలను నవంబరు, మార్చి మధ్య కర్ణాటకలో జరుపుతారు.

‘‘మా ముందు ప్రవేశపెట్టిన ఆధారాలతో సంతృప్తి పొందాం. జల్లికట్టు తమిళనాడులో శతాబ్దాల  సంప్రదాయం. మా పరిశీలనలో మూడు రాష్ట్రాలు చేసిన సవరణలు కూడా చెల్లుబాటయ్యే శాసనాలే’’ అని 56 పేజీల తీర్పులో న్యాయమూర్తులు పేర్కొన్నారు. జల్లికట్టు సంప్రదాయ క్రీడ కాదని పశువులను హింసకు గురిచేసే జల్లికట్టు, కంబళ తదితర క్రీడలనూ నిషేధించాలని 2014లో సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పిచ్చింది. దీంతో తమ రాష్ట్ర జంతు క్రూరత్వ చట్టాలకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక సవరణలు చేశాయి. వీటిని జంతు సంక్షేమ సంస్థలు సవాల్‌ చేశాయి. దీంతో పాటు 2014 సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయాలని పిటిషన్లు వేశాయి. దీనిపై రాజ్యాగం ధర్మాసనం ప్రస్తుత తీర్పు వెలువరించింది. జల్లికట్టు సంప్రదాయక్రీడ కాదనడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.‘‘తమిళనాడు చేసిన సవరణలోని నిబంధనల ప్రకారం.. పశువుల నొప్పిని గణనీయంగా తగ్గించి ఈ సంప్రదాయ క్రీడ కొనసాగేలా ఆ ప్రభుత్వం ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తుంది. సవరణకు రాష్ట్రపతి అనుమతి కూడా లభించింది. కాబట్టి రాష్ట్ర చర్యల్లో లోపం ఉందని మేం అనుకోవడం లేదు’’ అని ధర్మాసనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని