సుప్రీం న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, సీనియర్‌ న్యాయవాది కేవీవిశ్వనాథన్‌లు శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు.

Updated : 20 May 2023 05:42 IST

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, కేవీ విశ్వనాథన్‌లతో ప్రమాణం
చేయించిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, సీనియర్‌ న్యాయవాది కేవీవిశ్వనాథన్‌లు శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు. కోర్టు పనివేళల ప్రారంభానికి ముందు సుప్రీంకోర్టు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వారిద్దరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పూర్తిస్థాయిలో 34కి చేరింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 16న ఈ ఇద్దరి పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్ర న్యాయశాఖ వేగంగా స్పందించి రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ ఇద్దరు న్యాయమూర్తుల నియామకాలను 18వ తేదీన నోటిఫై చేసింది. సీనియారిటీ పరంగా జస్టిస్‌ మిశ్ర తొలుత, తర్వాత కేవీ విశ్వనాథన్‌ ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర 2021 అక్టోబరు 13 నుంచి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తూ వచ్చారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, న్యాయమూర్తిగా సేవలందించారు. సీనియర్‌ అడ్వొకేట్‌ కేవీ విశ్వనాథన్‌ బార్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

వేణుగోపాల్‌ వద్ద జూనియర్‌గా..

బార్‌ నుంచి నేరుగా న్యాయమూర్తిగా నియమితులైన వారిలో ఇప్పటివరకు జస్టిస్‌ ఎస్‌ఎం సిక్రి, జస్టిస్‌ యూయూ లలిత్‌ ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. 2027లో జస్టిస్‌ పీఎస్‌ నరసింహ సీజేఐగా బాధ్యతలు చేపడతారు. 2030 ఆగస్టులో జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ఆ స్థానానికి చేరుకుంటారు. ఈయన ఇదివరకు మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వద్ద జూనియర్‌గా పనిచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు