సంక్షిప్త వార్తలు(6)

మాదక ద్రవ్యాల నిరోధక మండలి (ఎన్‌సీబీ) జోనల్‌ మాజీ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేకు శుక్రవారం బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

Updated : 20 May 2023 05:36 IST

ఆర్యన్‌ను జైల్లో పెట్టొద్దని షారుక్‌ వేడుకున్నారు: వాంఖడే

ముంబయి: మాదక ద్రవ్యాల నిరోధక మండలి (ఎన్‌సీబీ) జోనల్‌ మాజీ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేకు శుక్రవారం బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సినీ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను 2021లో డ్రగ్స్‌ కేసులో ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లను డిమాండ్‌ చేశారంటూ వాంఖడేపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంతో దీనిని కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 22 (సోమవారం) వరకూ వాంఖడేను అరెస్టు చేయవద్దని దర్యాప్తు సంస్థను న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సమీర్‌ కొన్ని ఆరోపణలు చేశారు. ఆర్యన్‌ను జైల్లో పెట్టొద్దని షారుక్‌ తనను వేడుకున్నారని పేర్కొన్నారు. షారుక్‌ ఖాన్‌ పంపిన సందేశాలంటూ వాట్సప్‌ చాట్‌ స్క్రీన్‌ షాట్లను హైకోర్టుకు సమర్పించారు. ‘‘ఈ కేసులో కాస్త నిదానంగా వ్యవహరించండి. విచారణకు అన్ని వేళలా సహకరిస్తానని మాటిస్తున్నా. నేనేంటో మీకూ తెలుసు కదా. దయచేసి మా కుటుంబంపై కనికరం చూపండి. ఓ కరుడుగట్టిన నేరస్థుడిలా నా కుమారుడిని జైల్లో పెట్టకండి ప్లీజ్‌. అది అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మీరు ఏం చెప్పినా చేస్తా. ఓ తండ్రిగా మిమ్మల్ని వేడుకుంటున్నా’’ అని షారుక్‌ తనకు వాట్సప్‌లో సందేశం పంపించారని సమీర్‌ వాంఖడే వెల్లడించారు. ఈ సంభాషణలో తానెక్కడా లంచం అడిగినట్లు లేదని పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ను అరెస్టు చేసినందుకు ప్రతీకారంగానే తనపై సీబీఐ కేసు నమోదు చేసిందని ఆరోపించారు.


ఎన్‌ఐఏ విచారణపై స్టేకు సుప్రీం నిరాకరణ
-  పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి దక్కని ఊరట

దిల్లీ: శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో జరిగిన హింసపై విచారణను జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘‘మేం స్టే ఉత్తర్వులు ఇవ్వలేం. ఈ అంశాన్ని వేసవి సెలవుల అనంతరం తీసుకుంటాం’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.


పౌరులను వేధించడమే: ఎన్‌సీపీ

ముంబయి: రూ.2000 నోటు ఉపసంహరణపై ఎన్‌సీపీ విమర్శలు గుప్పించింది. ‘‘రూ.2000 నోట్లను ప్రవేశ పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాధించిందేమిటి? ప్రస్తుతం ఏ లక్ష్యంతో వాటిని ఉపసంహరించుకుంటున్నారు? పెద్ద నోట్ల రద్దును గొప్ప విజయంగా అభివర్ణించారు. అదే నిజమైతే తాజాగా రూ.2000 నోట్లను చలామణి నుంచి తొలగిస్తుండటానికి కారణమేంటి?’’అని ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి క్లయిడ్‌ క్రాస్టో ప్రశ్నించారు. కేంద్రం తీరు దేశ పౌరులను వేధించడమేనని పేర్కొన్నారు.


డీఈఆర్‌సీ ఛైర్మన్‌ను 2వారాల్లోగా నియమించాలి
సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (డీఈఆర్‌సీ) ఛైర్‌పర్సన్‌ను రెండు వారాల్లోగా నియమించాలని శుక్రవారం సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృతంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌.. మంత్రి మండలి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలంటూ సూచించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌, దిల్లీ ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పు వెలువరించడం గమనార్హం.


విద్యకు పరివర్తనాత్మక శక్తి ఉంది
జైలు నుంచి ఆప్‌ నేత సిసోదియా లేఖ

దిల్లీ: విద్యకు పరివర్తనాత్మక శక్తి ఉందని దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా తిహాడ్‌ జైలు నుంచి రాసిన లేఖలో పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాలను పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి చిన్నారికి విద్య, సమానావకాశాలు దక్కాలని పేర్కొన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ పుస్తకం చేతపడితే విద్వేషాలను వ్యాప్తి చేసేవారెవరుంటారు? ప్రతి ఒక్కరికీ చేతినిండా పని ఉంటే.. వీధుల్లో కత్తులు పట్టుకొని తిరిగేవారెవరుంటారు’’ అని పేర్కొన్నారు.


దిగువ కోర్టు జడ్జీలకు వేతన బకాయిలు చెల్లించండి
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశం

దిల్లీ: న్యాయవ్యవస్థకు జిల్లాల జ్యుడీషియరీ వెన్నెముకలాంటిదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందులోని న్యాయాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చూసేందుకు వారి ఆర్థిక భద్రత, ఆర్థిక స్వతంత్రతను కాపాడటం ముఖ్యమని పేర్కొంది. కాబట్టి రెండో జాతీయ జ్యుడీషియల్‌ పే కమిషన్‌ (ఎస్‌ఎన్‌జేపీసీ) సిఫార్సులకు అనుగుణంగా.. దిగువ కోర్టుల జడ్జీలకు అందాల్సిన వేతన బకాయిలను ఈ ఏడాది జూన్‌ 30లోగా చెల్లించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ దిశగా తాము 2022 జులై 27న, ఈ ఏడాది జనవరి 18న కూడా ఆదేశాలు జారీ చేసిన సంగతిని గుర్తుచేసింది. వేతన బకాయిన్నింటినీ చెల్లించినట్లు ఈ ఏడాది జులై 30కల్లా తమకు ప్రమాణపత్రాలు సమర్పించాలని సూచించింది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు