ఉపసంహరణ ప్రయోజనకరమే

ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించడం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమేనని ఆర్థికశాఖ మాజీ ప్రధాన సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 21 May 2023 07:04 IST

మాజీ సీఈఏ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించడం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమేనని ఆర్థికశాఖ మాజీ ప్రధాన సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ అభిప్రాయపడ్డారు. కొన్ని అంశాలతో ఆయన దీనిపై ట్విటర్‌లో వివరణ ఇచ్చారు. ‘‘రూ.2వేల నోటు ఉపసంహరణతో నగదు నిల్వ ఉంచుకోవడం తగ్గుతుంది. రూ.3.6 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇందులో చాలావరకు ఎక్కడున్నాయో తెలియదు. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఈ మధ్య తరచూ దర్యాప్తు సంస్థల దాడుల్లో నోట్ల గుట్టలు బయటపడుతున్నాయి. అందులో రూ.2వేల నోట్లే అధికం. దేశంలో 80శాతం మంది ప్రజలు తమవద్ద ఉన్న రూ.2వేల నోట్లను చట్టబద్ధంగా భద్రపరుచుకున్నారు. కానీ ఆ నోట్ల విలువ మొత్తం చలామణీలో ఉన్న రూ.2వేల నోట్ల విలువలో కేవలం 20శాతమే. మిగతా 20శాతం మందివద్ద ఉన్న రూ.2వేల నోట్ల గుట్టల విలువ 80శాతంగా ఉంది. ఇప్పుడు అదంతా వెలికి తీసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. 2026 నాటికి డిజిటల్‌ లావాదేవీలు మూడు రెట్లు పెరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల రాబోయే సంవత్సరాల్లో రూ.2వేల నోటు అవసరం ఉండకపోవచ్చు. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. రూ.2వేల నోటు చెల్లుబాటు (లీగల్‌ టెండర్‌) కొనసాగుతుందని ఆర్‌బీఐ చెప్పింది. సెప్టెంబరు 30 తర్వాతా ఇది చెల్లుబాటు అవుతుందా లేదా అనే దానిపై ఆర్‌బీఐ మళ్లీ స్పష్టతనిస్తుంది. అప్పటివరకు చట్టపరంగా భద్రపరుచుకున్నవారు తమ రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు ఏ సమస్యా ఉండదు. ఎలా చూసినా ఈ నిర్ణయం సరైందే’’ అని కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని