మిగ్‌-21 యుద్ధ విమానాల తాత్కాలిక నిలిపివేత: ఐఏఎఫ్‌

భారత వాయుసేన (ఐఏఎఫ్‌) తన అమ్ములపొదిలోని యాభై మిగ్‌-21 యుద్ధ విమానాల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.

Published : 21 May 2023 05:31 IST

రాజస్థాన్‌ ప్రమాదమే కారణం

దిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్‌) తన అమ్ములపొదిలోని యాభై మిగ్‌-21 యుద్ధ విమానాల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. రెండు వారాల కిందట రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ వద్ద ఈ విమానం ఓ ఇంట్లోకి దూసుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే. మే 8న సూరత్‌గఢ్‌లోని వాయుసేన స్థావరం నుంచి సాధారణ శిక్షణ నిమిత్తం విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీంతో మిగ్‌-21 విమానాలు అన్నింటినీ నిలిపివేసి, అధికారులు సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిపుణుల బృందం నుంచి ఆమోదం లభించిన తర్వాతే ఈ విమానాలు మళ్లీ ఎగురుతాయని సంబంధిత అధికారులు శనివారం వెల్లడించారు. సోవియట్‌ రూపొందించిన ఈ యుద్ధ విమానాలను 1960ల ప్రారంభంలో ప్రవేశపెట్టగా, ఇప్పటివరకు దాదాపు 400 ప్రమాదాలు జరిగాయి. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సుదీర్ఘకాలం భారత వాయుసేనకు ప్రధాన ఆధారంగా నిలిచాయి. ఐఏఎఫ్‌ తన పోరాట పటిమను పెంచుకోడానికి ఇప్పటిదాకా 870 మిగ్‌-21 ఫైటర్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద ఈ యుద్ధ విమానాలు 50 వరకు ఉండగా.. వీటిని దశలవారీగా మూడేళ్లలో తొలగించాలని గతేడాదే ఓ నిర్ణయానికి వచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని