పాఠశాలల ఉద్యోగాల కుంభకోణంలో.. మమత మేనల్లుణ్ని విచారించిన సీబీఐ

పశ్చిమబెంగాల్‌లో వెలుగుచూసిన పాఠశాలల ఉద్యాగాల కుంభకోణానికి సంబంధించిన కేసులో సీబీఐ అధికారులు టీఎంసీ అగ్రనేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్‌ బెనర్జీని శనివారం తొమ్మిది గంటలకు పైగా విచారించారు.

Published : 21 May 2023 05:02 IST

అభిషేక్‌ బెనర్జీని 9 గంటలు ప్రశ్నించిన అధికారులు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో వెలుగుచూసిన పాఠశాలల ఉద్యాగాల కుంభకోణానికి సంబంధించిన కేసులో సీబీఐ అధికారులు టీఎంసీ అగ్రనేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్‌ బెనర్జీని శనివారం తొమ్మిది గంటలకు పైగా విచారించారు. స్థానిక సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరయ్యే ముందు కేంద్ర ఏజెన్సీ అధికారులకు అభిషేక్‌ బెనర్జీ ఓ లేఖ రాశారు. ఈ కేసులో తనను విచారించేందుకు సీబీఐ, ఈడీలకు అనుమతి ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులను తాను సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో నిందితుడైన కుంతల్‌ ఘోష్‌.. అభిషేక్‌ పేరు చెప్పాల్సిందిగా కేంద్ర ఏజెన్సీల నుంచి తన మీద ఒత్తిళ్లు వస్తున్నాయని ఎందుకు ఫిర్యాదు చేశారని సీబీఐ అభిషేక్‌ బెనర్జీని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆ విషయం తనకు తెలియదని ఆయన బదులు ఇచ్చినట్లు సమాచారం. ఈ విచారణకు ముందు టీఎంసీ అగ్రనేతలకు సన్నిహితుడైన సుజయ్‌కృష్ణ భాద్రా ఇంటిపైన, మరికొన్ని చోట్ల ఈడీ అధికారులు దాడి జరిపి తనిఖీలు నిర్వహించారు. రెండు నెలలపాటు రాష్ట్ర యాత్ర నిర్వహిస్తున్న అభిషేక్‌ బెనర్జీ సీబీఐ సమన్ల కారణంగా యాత్రను అర్ధంతరంగా ఆపి, శుక్రవారం రాత్రి కోల్‌కతాకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన అధికారులు వేధింపుల కోసం వృథా ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

కేంద్ర ఏజెన్సీ రాజ్‌పై మండిపడిన మమత

మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని సీబీఐ విచారణకు పిలిచిన నేపథ్యంలో కేంద్ర ‘ఏజెన్సీ రాజ్‌’ తీరుపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ ఆరాలతో రాష్ట్రంలో పరిపాలన సవాలుగా మారుతోందని, అయినా దేశంలోని లక్షలాది ప్రజలు తమకు అండగా ఉన్నారంటూ ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం మొదటిసారిగా (2011లో) ప్రమాణస్వీకారం చేసిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ట్విటర్‌ వేదికగా ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇదే రోజున రాష్ట్రంలో 34 ఏళ్ల రాక్షస పాలనను అంతమొందించి.. ‘మా, మాటీ, మనుష్‌’ (అమ్మ, భూమి, ప్రజలు) ప్రభుత్వాన్ని తీసుకొస్తామని ప్రమాణం చేసినట్లు మమత గుర్తు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు