దాచినవన్నీ బయటికొస్తున్నాయ్‌!

రూ.2వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించగానే ఇప్పటిదాకా కనిపించని ఆ నోట్లు ఇప్పుడు మార్కెట్లో రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతున్నాయి.

Updated : 24 May 2023 11:28 IST

ఏది కొనాలన్నా రూ.2 వేల నోటే
మామిడిపండ్లు, వాచీలకూ అదే కరెన్సీ

ముంబయి, దిల్లీ: రూ.2వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించగానే ఇప్పటిదాకా కనిపించని ఆ నోట్లు ఇప్పుడు మార్కెట్లో రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతున్నాయి. వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ చెప్పినా ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. మార్కెట్లో కొనుగోళ్లకే జనం అధికంగా వినియోగిస్తున్నారు. మామిడి కాయల నుంచి ఖరీదైన వాచ్‌లదాకా కొనేస్తున్నారు. దీంతో నగదు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. అమ్మకాలు పెరుగుతున్నాయనే సంతోషంతో దుకాణదారులూ రూ.2వేల నోట్లను విరివిగా తీసుకుంటున్నారు. ముంబయిలోని క్రాఫర్డ్‌ మార్కెట్లో మామిడి కాయలను కొన్న వినియోగదారులు ఎక్కువగా రూ.2వేల నోట్లనే ఇస్తున్నారని ఓ వ్యాపారి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 8 నుంచి 10 నోట్లు తనకు వస్తున్నాయని, వాటిని బ్యాంకులో తర్వాత మార్చుకుంటానని చెప్పారు. ముంబయిలోని ఓ మాల్‌లో ఉన్న రాడో వాచ్‌ స్టోర్‌లో రూ.2వేల నోట్ల తాకిడి 60శాతం నుంచి 70శాతం పెరిగిందని మేనేజరు వెల్లడించారు. గతంలో ఒకటి రెండు అమ్మేవాళ్లమని, ప్రస్తుతం మూడు నాలుగు అమ్ముతున్నామని తెలిపారు. క్యాష్‌ ఆన్‌ డెలివరీలో తమకు 72శాతం రూ.2వేల నోట్లే వస్తున్నాయని జొమోటో ఫుడ్‌ డెలివరీ యాప్‌ యాజమాన్యం పేర్కొంది. అయితే కొంత మంది వ్యాపారులు రూ.2వేల నోట్లను అంగీకరించడం లేదు. తరువాత ఇబ్బందుల్లో పడలేమని వారంటున్నారు.

పెట్రోలును వెనక్కి తీసుకున్న బంకు సిబ్బంది

లఖ్‌నవూ: పెట్రోలు పోయించుకుని రూ.2వేల నోటు ఇచ్చిన వినియోగదారుడికి షాకిచ్చింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ బంకు. పోసిన పెట్రోలును సిబ్బంది వెనక్కి తీసుకున్నారు. జలౌన్‌లోని ఓ పెట్రోలు బంకుకు వినియోగదారుడు వచ్చి పెట్రోలు పోయించుకున్నారు. ఆ తర్వాత 2వేల నోటును ఇవ్వబోతే సిబ్బంది తిరస్కరించి చిన్న నోట్లు ఇవ్వాలని కోరారు. తనవద్ద లేవని చెప్పడంతో వాహనంలో పోసిన పెట్రోలును పైపుద్వారా వెనక్కి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. మేనేజరు మాత్రం తమ చర్యను సమర్థించుకున్నారు. ‘రూ.50 పెట్రోలుకూ వినియోగదారులు రూ.2వేల నోటు ఇస్తున్నారు. గతంలో మూడు నుంచి నాలుగు నోట్లే వచ్చేవి. ఇప్పుడు 70దాకా వస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

పెద్ద నోట్ల రద్దు కాదు: ఆర్‌బీఐ

రూ.2వేల నోట్ల ఉపసంహరణను పెద్ద నోట్ల రద్దుగా పరిగణించకూడదని, అవి చట్టబద్ధ కరెన్సీగానే చలామణి అవుతాయని, బ్యాంకుల దైనందిన కార్యకలాపాలకు ఇబ్బంది కలగని రీతిలో తక్కువ విలువ గల కరెన్సీ నోట్లలోకి మార్చుకునే సౌలభ్యం కల్పించామని దిల్లీ హైకోర్టుకు ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ సమాధానమిచ్చింది. వాదనలను విన్న హైకోర్టు తరువాత సముచిత నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది.


బ్యాంకుల వద్ద రద్దీ లేదు

రూ.2వేల నోట్ల మార్పిడి తొలిరోజైన మంగళవారం బ్యాంకులవద్ద హడావుడేమీ కనిపించలేదు. ఎలాంటి డాక్యుమెంట్లను అడగబోమని ప్రకటించిన ఎస్‌బీఐవద్దే కొంత రద్దీ కనిపించింది. అదే 2016 నోట్ల రద్దు సమయంలో భారీ క్యూలు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల ఆందోళనలూ జరిగాయి. కొన్ని బ్యాంకులవద్ద ధ్రువపత్రాలేమైనా సమర్పించాలా అన్న అంశంపై క్లారిటీ లేకపోవడంతో అయెమయం నెలకొంది. ఐడీలు సమర్పించక్కర్లేదని ఆర్‌బీఐ చెప్పినా కొంత మంది బ్యాంకర్లు అడిగినట్లు సమాచారం. కొంత మంది ఎలక్ట్రానిక్‌ ఎంట్రీ ద్వారా రూ.2వేల నోట్లను మార్చారు. మరికొంత మంది పేరు, ఫోన్‌ నంబరు అడిగి తీసుకున్నారు. కొంత మంది బ్యాంకర్లు ఖాతాల్లో జమచేయాలని సూచించారు. రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల వద్దా పెద్దగా రద్దీ కనిపించలేదు. వేసవి కావడంతో ఆ కార్యాలయాలవద్ద మంచినీటి వంటి ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని