అదీ నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి

పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవానికి తాము రాబోమన్న 20 ప్రతిపక్ష పార్టీల వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా దుయ్యబట్టారు.

Updated : 26 May 2023 06:06 IST

సిడ్నీలో ప్రవాస భారతీయుల  కార్యక్రమానికి ఆస్ట్రేలియా అధికార, విపక్ష నేతల  హాజరీపై మోదీ వ్యాఖ్య
విదేశీ పర్యటన ముగించుకుని దిల్లీ చేరిన ప్రధాని

దిల్లీ: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవానికి తాము రాబోమన్న 20 ప్రతిపక్ష పార్టీల వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. సిడ్నీలో ప్రవాసభారతీయులు తనతో నిర్వహించిన కార్యక్రమానికి ఆస్ట్రేలియా ప్రధానితో పాటు వివిధ రాజకీయపక్షాల నేతలు ఎలాంటి భేషజాలు లేకుండా హాజరుకావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఆ సభలో 20 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌, మాజీ ప్రధాని, ఇతర విపక్ష ఎంపీలు, నేతలు వారి దేశానికి మొదటి ప్రాధాన్యమిస్తూ ఒక కమ్యూనిటీ కార్యక్రమానికి విచ్చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఆరు రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని గురువారం ఉదయం దిల్లీ చేరుకున్న ప్రధాని మోదీకి పాలం విమానాశ్రయంలో భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వారినుద్దేశించి ఆయన ప్రసంగించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో విదేశాలకు మన దేశం టీకాలు సరఫరా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ‘సంక్షోభ పరిస్థితుల్లో మోదీ ప్రపంచ దేశాలకు టీకాలు ఎందుకు ఇస్తున్నారని వారు ప్రశ్నించారు. ఇది బుద్ధుడు, గాంధీజీ సంచరించిన నేల. మనం మన శత్రువుల గురించి కూడా ఆలోచిస్తాం. మనం కరుణతో ప్రేరేపితమైన వ్యక్తులం’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని