కేజ్రీవాల్‌ ఇంటి ఖర్చు రూ.52.71 కోట్లు

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇంటి ఆధునికీకరణకు రూ.52.71 కోట్లు ఖర్చు చేసినట్లు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు దిల్లీ విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ నివేదిక సమర్పించింది.

Published : 26 May 2023 05:13 IST

లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు నివేదిక

దిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇంటి ఆధునికీకరణకు రూ.52.71 కోట్లు ఖర్చు చేసినట్లు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు దిల్లీ విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ నివేదిక సమర్పించింది. ఇందులో రూ.33.49 కోట్లను ఇంటి నిర్మాణానికి, రూ.19.22 కోట్లను క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ఖర్చు చేసినట్లు పేర్కొంది. కేజ్రీవాల్‌ ఇంటి ఆధునికీకరణలో నిబంధనలకు విరుద్ధంగా అధిక వ్యయం చేశారని భాజపా ఆరోపించడంతోపాటు మీడియాలో కథనాలు రావడంతో విచారణ జరిపి వాస్తవ నివేదికను సమర్పించాలని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్‌ కుమార్‌ను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశించారు. దీంతో ప్రజాపనుల విభాగం ఫైళ్లను తనిఖీ చేసిన విజిలెన్స్‌ విభాగం ఈ నెల 12వ తేదీన నివేదికను సమర్పించింది. దానిపై విజిలెన్స్‌ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌ సంతకం చేశారు. ఆ నివేదిక ప్రకారం.. తొలుత రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లతో పనులను పూర్తి చేయాలని ప్రజాపనుల విభాగం అంచనా వేసి రూ.8.61 కోట్లకు టెండర్లను పిలిచింది. 2020లో పనులను అప్పగించింది. ఆ తర్వాత పలు కొత్త ప్రతిపాదనలు, అదనపు హంగులు తోడవడంతో అంచనా పెరుగుతూపోయింది. మొదట్లో ఉన్న ఇంటినే ఆధునికీకరించాలని అనుకున్నా అది 1942-43లో కట్టినది కావడంతో పూర్తిగా తొలగించి నిర్మించాల్సి వచ్చిందని ప్రజాపనుల విభాగం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని