ఏళ్లతరబడి పాలించినా వారసత్వ రాజకీయాలను వదల్లేదు

దేశాన్ని ఏళ్లతరబడి పాలించిన పార్టీలు హైస్పీడ్‌ రైళ్ల కోసం ఎన్నో గొప్పలు చెప్పినా.. సమయం గడిచిపోవడమే తప్పిస్తే చివరకు ఏమీ సాధించలేకపోయాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు.

Published : 26 May 2023 05:13 IST

అందుకే ఆధునిక రైళ్లు ఆలస్యమయ్యాయి  
కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు

దేహ్రాదూన్‌: దేశాన్ని ఏళ్లతరబడి పాలించిన పార్టీలు హైస్పీడ్‌ రైళ్ల కోసం ఎన్నో గొప్పలు చెప్పినా.. సమయం గడిచిపోవడమే తప్పిస్తే చివరకు ఏమీ సాధించలేకపోయాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. దిల్లీలోని ఆనంద్‌విహార్‌ టెర్మినల్‌ స్టేషన్‌ నుంచి దేహ్రాదూన్‌కు నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇది ఉత్తరాఖండ్‌కు తొలి వందేభారత్‌ రైలు. ‘‘దీర్ఘకాలం దేశాన్ని పాలించిన పార్టీలు వంశపారంపర్య రాజకీయాల నుంచి బయటపడలేకపోయాయి. అవినీతి, కుంభకోణాలకు పాల్పడడంపైనే వాటి దృష్టి ఉండేది. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆ పార్టీలు దృష్టి సారించినట్లయితే 21వ శతాబ్దంలో దేశం మరెంతో వేగంగా ముందుకు దూసుకువెళ్లి ఉండేది’’ అని చెప్పారు. అభివృద్ధి చేయాలనే నియత్‌ (ఉద్దేశం), నీతి (విధానం), నిష్ఠ (అంకితభావం) ఉన్న ప్రభుత్వం తొలిసారిగా ఏర్పడిందని తెలిపారు. ‘ప్రపంచమంతా మనదేశం వైపు ఎంతో ఆశాభావంతో చూస్తోంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్న తీరు, పేదరికంపై పోరాటం, కరోనా సవాల్‌ను ఎదుర్కొన్న విధానాన్ని చూశాక ప్రపంచానికి నమ్మకం పెరిగింది. ఇతర దేశాలవారు ఇక్కడకు వచ్చి దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు’ అని మోదీ చెప్పారు. రైలు, రోడ్డు, తీగ మార్గాల అభివృద్ధి పనులతో ఉత్తరాఖండ్‌కు మహర్దశ పట్టనుందని, చార్‌ధామ్‌ యాత్రికుల కోసం సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని వివరించారు.


ఫిబ్రవరి-మార్చి నాటికి మూడు రకాల వందేభారత్‌లు: వైష్ణవ్‌

వందేభారత్‌ రైళ్లలో మూడు రకాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 100 కి.మీ. లోపు దూరాలకు వందే మెట్రో, 100-550 కి.మీ. ప్రయాణానికి వందే ఛైర్‌కార్‌, అంతకుమించిన ప్రయాణానికి వందే స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెడతామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. రాబోయే 3-4 ఏళ్లలో వందేభారత్‌ రైళ్లు గంటకు 160 కి.మీ. గరిష్ఠ వేగంతో ప్రయాణించేలా రైలు పట్టాలను ఉన్నతీకరిస్తామని చెప్పారు. ఈ జూన్‌ మధ్య నాటికి ప్రతి రాష్ట్రానికీ వందేభారత్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. దీనికి తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచామనీ, ప్రతి 8-9 రోజులకు ఒకటి చొప్పున ఈ రైళ్లు తయారవుతున్నాయని వైష్ణవ్‌ తెలిపారు. మరో రెండు కర్మాగారాల్లోనూ వీటి ఉత్పత్తి ప్రారంభం కానుందని చెప్పారు. రైళ్లలో ప్రయాణించేవారికి 4జి, 5జి సేవలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు