అయిదు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం

దేశంలోని అయిదు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో ఇద్దరు తెలుగువారున్నారు.

Updated : 27 May 2023 06:06 IST

వీరిలో ఇద్దరు తెలుగువారు
హిమాచల్‌ప్రదేశ్‌కు జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు
కేరళకు జస్టిస్‌ ఎస్‌.వెంకటనారాయణ భట్‌
4 రోజులే పదవిలో ఉండనున్న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఈనాడు, దిల్లీ: దేశంలోని అయిదు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో ఇద్దరు తెలుగువారున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టుకు జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, కేరళ హైకోర్టులకు జస్టిస్‌ సరసా వెంకటనారాయణ భట్‌, మద్రాస్‌ హైకోర్టుకు జస్టిస్‌ సంజయ్‌ విజయ్‌కుమార్‌ గంగాపుర్‌వాలా, బాంబే హైకోర్టుకు జస్టిస్‌ రమేశ్‌ దేవకీనందన్‌ ధనూకా, రాజస్థాన్‌ హైకోర్టుకు జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మషిహ్‌లను ప్రధాన న్యాయమూర్తులుగా నియమిస్తూ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసింది. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ మామిడన్న సత్యరత్న శ్రీరామచంద్రరావు తెలంగాణకు చెందినవారు. 1966 ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన  1989లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1991లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. 2012 జూన్‌ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబరు 4న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 11 వరకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆ తర్వాత పంజాబ్‌-హరియాణా న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు. ఇప్పటివరకూ ఆయన అక్కడే సేవలందిస్తూ వచ్చారు. 

* కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎస్‌.వెంకట నారాయణ భట్‌ ఇదివరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన స్వస్థలం అన్నమయ్య జిల్లా మదనపల్లి. 1962 మే 6న జన్మించిన జస్టిస్‌ భట్‌ బెంగళూరులోని జగద్గురు రేణుకాచార్య కాలేజ్‌ నుంచి లా డిగ్రీ పూర్తిచేశారు. 1987లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2013 ఏప్రిల్‌ 12న ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 జూన్‌ 1న ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు విభజన సమయంలో 2019 జనవరి 1న అమరావతిలోని ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2019 మార్చి 19న కేరళ హైకోర్టుకు వెళ్లారు. 2023 ఏప్రిల్‌ 24న అక్కడే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

* బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ రమేశ్‌ దేవకీనందన్‌ ధనూకా ఈనెల 30న పదవీ విరమణ చేస్తారు. ఈ స్థానంలో ఆయన కేవలం నాలుగురోజులు మాత్రమే ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని