సంక్షిప్త వార్తలు(8)

ఈ ఏడాది వేసవి పంటల సాగు విస్తీర్ణం ఇప్పటివరకూ 1.69 లక్షల హెక్టార్లు తగ్గింది.

Updated : 27 May 2023 05:50 IST

తగ్గిన వేసవి పంటల సాగు విస్తీర్ణం

ఈనాడు, దిల్లీ ఈ ఏడాది వేసవి పంటల సాగు విస్తీర్ణం ఇప్పటివరకూ 1.69 లక్షల హెక్టార్లు తగ్గింది. గత ఏడాది ఇదే సమయానికి మొత్తం 71.99 లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా, ఈసారి అది 70.30 లక్షల హెక్టార్లకు తగ్గినట్లు శుక్రవారం కేంద్ర వ్యవసాయశాఖ చేసిన ప్రకటన ద్వారా వెల్లడైంది. ఇది క్రితం ఏడాదికంటే 2.34% తక్కువ. గత ఏడాదితో పోలిస్తే వరి, నూనెగింజల సాగు తగ్గగా, పప్పుదినుసులు, తృణధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగింది.


విపక్షాల బహిష్కరణను ఖండించిన మాజీ అధికారులు

దిల్లీ: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించడంపై మాజీ అధికారులు, రాయబారులు, పలు రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులతో కూడిన 270 మంది ప్రముఖులు ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. భారతీయులందరూ గర్వించాల్సిన క్షణాల్లో.. అపరిపక్వ, హేతుబద్ధత లేని కారణాలతో ఓ గొప్ప కార్యక్రమానికి దూరంగా ఉండాలన్న విపక్షాల నిర్ణయాన్ని తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వం భారత్‌ ప్రథమం అని ముందుకు వెళుతుంటే.. ప్రతిపక్షాలు కుటుంబమే ముందన్న విధానంతో నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రకటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మాజీ డైరెక్టర్‌ వైసీ మోదీ, మాజీ ఐఏఎస్‌ అధికారులు ఆర్‌.డి.కపూర్‌, గోపాలకృష్ణ, సమరీంధ్ర ఛటర్జీ, లింగాయ యూనివర్సిటీ ఉపకులపతి అనిల్‌ రాయ్‌ దూబే తదితరులు సంతకం చేశారు.


నైరుతిలో సాధారణ వర్షపాతమే: ఐఎండీ

దిల్లీ: సాధారణం కంటే జూన్‌ మాసంలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దక్షిణ కర్ణాటక, ఉత్తర తమిళనాడు, రాజస్థాన్‌, లద్దాఖ్‌లు మినహా మిగిలిన చాలా ప్రాంతాల్లో జూన్‌ మాసంలో సాధరణం కంటే తక్కువగానే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పర్యావరణ పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం అధిపతి డి.శివానంద పాయి తెలిపారు. అయితే నైరుతి రుతుపవనాల కారణంగా ఈ సీజన్‌ మొత్తం మీద సాధారణ స్థాయిలోనే వర్షపాతం నమోదవుతుందని ఆయన వెల్లడించారు. సహజంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1న కేరళలోకి ప్రవేశించే విషయం తెలిసిందే. ఈసారి నాలుగు రోజులు ఆలస్యంగా రానున్నాయి.


అభిషేక్‌ బెనర్జీకి జరిమానా విధింపుపై సుప్రీం స్టే

దిల్లీ: పాఠశాలల్లో ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి రూ.25 లక్షల జరిమానా విధిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఎంపీ లేవనెత్తిన అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నప్పటికీ రూ.25 లక్షల విధింపు పూచీగా భావించలేమోనన్న అభిప్రాయాన్ని జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.


శ్రీకృష్ణ జన్మభూమి-షాహి ఈద్గా కేసులన్నీ అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ

ప్రయాగ్‌రాజ్‌: మథుర కోర్టులో పెండింగ్‌లో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి-షాహి ఈద్గా వివాదానికి సంబంధించిన కేసులన్నీ తనకు బదిలీ చేయాలని అలహాబాద్‌ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. రంజనా అగ్నిహోత్రి, మరో ఏడుగురు దాఖలుచేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ మిశ్ర ఈ ఉత్తర్వులిచ్చారు. ఈ వివాదంతో ముడిపడిన కేసుల జాబితాను రూపొందించడంతో పాటు సంబంధిత రికార్డులను రెండు వారాల్లోగా హైకోర్టుకు పంపించాలని మథుర జిల్లా జడ్జికి సూచించారు. విచారణ కోసం ఈ వ్యాజ్యాలను ఏదైనా ధర్మాసనానికి కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ శర్మ విజ్ఞప్తి చేశారు.


సాంకేతిక సమస్యతో దిల్లీకితిరిగొచ్చిన విమానం

దిల్లీ: కెనడాలోని వాంకోవర్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్యతో శుక్రవారం దిల్లీకి తిరిగొచ్చింది. బోయింగ్‌ 777 విమానం దిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక సమస్యను పైలెట్లు గుర్తించారు. దానిని సురక్షితంగా దిల్లీ విమానాశ్రయానికి వెనక్కి తెచ్చారని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అందులోని 298 మంది ప్రయాణికుల్ని మరో విమానంలో వాంకోవర్‌కు పంపారు.


రూ.1500 కోట్ల విలువైన మత్తు పదార్థాల ధ్వంసం

ముంబయి: కస్టమ్స్‌ విభాగం దాడుల్లో దొరికిన 350 కిలోల మత్తు పదార్థాలను అధికారులు శుక్రవారం ముంబయిలో ధ్వంసం చేశారు. ఈ మాదక ద్రవ్యాల విలువ నల్లబజారులో రూ.1500 కోట్ల వరకూ ఉంటుందని వెల్లడించారు. నవీ ముంబయిలోని చెత్త నిర్వహణ కేంద్రంలో డ్రగ్స్‌ నిర్మూలన కమిటీ సమక్షంలో వీటిని సురక్షితమైన పద్ధతుల్లో తగులబెట్టారు. 2022 అక్టోబరులో ఫ్రూట్‌ కన్‌సైన్‌మెంట్‌లో అక్రమంగా రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్న 9 కిలోల కొకైన్‌, 198 కిలోల మెథాంఫెటామైన్‌ కూడా వీటిలో ఉన్నాయి. 33 కిలోల గంజాయి, 82 కిలోల మాడ్రాక్స్‌తో పాటు 298 ఎండీఎంఏ ట్యాబ్లెట్లనూ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు.


సరికొత్త ఆండ్రాయిడ్‌ వైరస్‌.. జాతీయ సైబర్‌ భద్రతా సంస్థ హెచ్చరిక 

దిల్లీ: ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్లలో ప్రవేశించి ఫోన్‌ నంబర్లను, కాల్‌ రికార్డులను, కెమెరాలను హ్యాక్‌ చేస్తున్న ‘దామ్‌’ అనే మాల్‌వేర్‌ దేశంలో వేగంగా వ్యాపిస్తోందని జాతీయ సైబర్‌ భద్రతా సంస్థ ‘సెర్టిన్‌’ హెచ్చరించింది. దామ్‌ను ఆండ్రాయిడ్‌ బాట్‌ నెట్‌గా వర్ణించింది. మొబైల్‌ ఫోన్లలోని యాంటీ వైరస్‌ ప్రోగ్రామ్‌లను తప్పించుకుని ర్యాన్సమ్‌వేర్‌ను చొప్పించే సత్తా దీనికి ఉంది. థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్లు, నమ్మదగని, అజ్ఞాత సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అప్లికేషన్ల ద్వారా ఈ మాల్‌వేర్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి వైరస్‌లు, మాల్‌వేర్‌ల నుంచి రక్షణకు సెర్టిన్‌ కొన్ని సూచనలు చేసింది. నమ్మదగ్గని వెబ్‌సైట్లను బ్రౌజ్‌ చేయవద్దనీ, అలాంటి లింకులపై క్లిక్‌ చేయవద్దనీ కోరింది. అడగకుండా వచ్చే ఈమెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లను తెరవద్దనీ, ఎప్పటికప్పుడు యాంటీ వైరస్‌, యాంటీ స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సలహా ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని