సంక్షిప్త వార్తలు (5)

స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వర్దంతి సందర్భంగా శనివారం పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

Updated : 28 May 2023 06:07 IST

ఆధునిక భారత రూపశిల్పి నెహ్రూ

దేశ తొలి ప్రధానికి నేతల ఘన నివాళులు

దిల్లీ: స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వర్దంతి సందర్భంగా శనివారం పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తదితరులు దిల్లీలోని శాంతివనంలో ఉన్న నెహ్రూ సమాధిని సందర్శించి దివంగత నేతలకు పుష్పాంజలి ఘటించారు.ఆధునిక భారత రూపశిల్పి పండిట్‌ నెహ్రూ అంటూ ప్రియాంకా గాంధీ, పలువురు కాంగ్రెస్‌ నేతలు కొనియాడారు. ప్రధాని మోదీ ట్వీట్‌ ద్వారా పండిట్‌ నెహ్రూకు నివాళులర్పించారు.


బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలి: రాందేవ్‌

జైపుర్‌: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని యోగా గురువు రాందేవ్‌ బాబా డిమాండ్‌ చేశారు. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ కొంతకాలంగా దిల్లీలో నిరసన కొనసాగిస్తున్న మహిళా కుస్తీ యోధులకు శనివారం ఆయన మద్దతు తెలిపారు. ‘‘బ్రిజ్‌ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలు అవమానకరమైనవి. లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి.. జైల్లో పెట్టాలి. ఆ వ్యక్తి మహిళల గురించి చెత్తగా మాట్లాడుతున్నాడు. అతని వైఖరి ఖండించదగినది’’ అని రాందేవ్‌ బాబా పేర్కొన్నారు. యోగా శిబిరంలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని భిల్వారా వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో చేరబోనని చెప్పారు. ప్రధాని మోదీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌లను ప్రశంసించారు. తనకు ఎవరితోనూ శత్రుత్వంలేదని రాందేవ్‌ బాబా స్పష్టం చేశారు.


ఉత్తర భారతంలో భారీ వర్షాలు

2 రోజుల్లో 26 మంది మృతి

దిల్లీ: ఉత్తర, ఈశాన్య భారతాల్లో భారీ వర్షాలు పడటంతోపాటు తీవ్ర గాలులు వీస్తున్నాయి. గాలి వానకుతోడు పిడుగులు పడటం, చెట్టు విరిగిపడటంతో పలువురు చనిపోయారు. గత రెండు రోజుల్లో రాజస్థాన్‌లో గాలి వాన బీభత్సంతో 13 మంది చనిపోయారు. ఝార్ఖండ్‌లో పిడుగులు పడి 12 మంది మరణించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఒకరు మృతి చెందారు. దిల్లీలోనూ భారీగా వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. అయితే నగరంలో రోడ్లు జలమయమై ట్రాఫిక్‌కు కొన్నిచోట్ల అంతరాయం కలిగింది. తీవ్ర గాలులకు చెట్లూ విరిగిపడ్డాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపడటంతో కొన్నిచోట్ల విద్యుత్తుకు అంతరాయం కలిగింది. ఆదివారమూ మరిన్ని వర్షాలు పడతాయని, గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.


జీఎస్‌టీ పరిహారంపై శాశ్వత యంత్రాంగం ఉండాలి

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి బఘేల్‌ డిమాండ్‌

దిల్లీ: జీఎస్‌టీ వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లింపుపై శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ డిమాండు చేశారు. దీంతోపాటు కొత్త పింఛను పథకంలో డిపాజిట్‌ చేసిన రూ.19వేల కోట్లను వెనక్కి ఇవ్వాలని కోరారు. శనివారం దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ 8వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లో ఖనిజాలపై కేంద్రం అదనంగా వసూలు చేసిన రూ.4,170 కోట్లను ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని తెలిపారు. బొగ్గుతోపాటు ఇతర ఖనిజాలపై రాయల్టీ రేటును సవరించాలని కోరారు.


మోదీ నాయకత్వానికి ప్రపంచస్థాయి గుర్తింపు

ప్రధాని మోదీ తన తొమ్మిదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు. రైతులూ సంతోషంగా ఉన్నారు. ఈ చర్యలన్నీ మోదీ నాయకత్వానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాయి.

రవిశంకర్‌ ప్రసాద్‌


దేశంలో మంచిరోజులు కనుమరుగు

మోదీ పాలనలో రాజకీయాలు విభజనకు గురయ్యాయి. మంచి రోజులు కనుమరుగయ్యాయి. ప్రతిపక్షాలను అణగదొక్కారు. కీలక నేతలను వేటాడారు. వ్యవస్థలను కబ్జా చేశారు. సమాజం ఛిద్రమైంది. ఇప్పుడు మనం 2024లో మార్పు కోసం ప్రార్థిద్దాం.

కపిల్‌ సిబల్‌


విద్యతో.. నిరుపేదల కలలు నెరవేరాలి

సమాజంలో మనం ఎక్కడున్నాం.. మన స్థానం ఏమిటో తెలియజేసేది విద్య ఒక్కటే. ప్రతి   ఒక్కరికీ న్యాణమైన   విద్య అందించాలి. నిరుపేదల కలలు నెరవేరేలా ఆయా ప్రభుత్వాలు వారికి అండగా నిలవాలి. ఇందుకు ప్రపంచ దేశాలు తమ వంతుగా  తోడ్పాటునందించాలి.

 ఆంటోనియో గుటెరస్‌


పొగాకు ఉత్పత్తులతో ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం లేదు

పొగాకు పండించడం ద్వారా మానవాళి ఆరోగ్యం దెబ్బతింటోంది. పైగా ఈ ఉత్పత్తులను పెంచడం మూలంగా ఆర్థిక వ్యవస్థకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. దీని దృష్ట్యా ఆకలితో అలమటిస్తున్న లక్షల మందికి ఆహారం అందించడం కోసమే నేలను వినియోగించాలి తప్ప పొగాకు కోసం కాదు.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు