సుస్థిర సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమైంది: మోదీ

ప్రజలు సుస్థిరమైన సర్కారును ఎన్నుకోవడం వల్లనే అభివృద్ధి సాధ్యమైందనీ, ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలను ఈ అసమాన మద్దతుతోనే నెరవేర్చగలిగామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

Updated : 28 May 2023 06:06 IST

దిల్లీ: ప్రజలు సుస్థిరమైన సర్కారును ఎన్నుకోవడం వల్లనే అభివృద్ధి సాధ్యమైందనీ, ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలను ఈ అసమాన మద్దతుతోనే నెరవేర్చగలిగామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కేంద్రంలో తొమ్మిదేళ్ల పాలనను శుక్రవారంతో పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న సందేశాలపై శనివారం ఆయన స్పందించారు. ‘‘2014 నుంచి ప్రభుత్వం సాధిస్తూ వస్తున్న విజయాలపై అనేక ట్వీట్లు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు. అలాంటి అభిమానపూర్వక సందేశాలను సవినయంగా స్వీకరిస్తున్నాను. 140 కోట్లమంది ప్రజలకోసం మరింతగా కష్టపడి పనిచేసేందుకు కావాల్సిన అదనపు బలాన్ని ఇవి అందిస్తాయి. గత తొమ్మిదేళ్లలో ఎంతో చేశాం. అమృతకాలంలో మరింత బలమైన, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించడానికి- రాబోయే కాలంలో మరింత చేయాలనుకుంటున్నాం. ప్రజా జీవితాల్లో మార్పులకు ఎన్డీయే సర్కారు విశేషంగా కృషి చేసింది. క్షేత్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో జీవితాలు మెరుగుపడ్డాయి’’ అని మోదీ చెప్పారు.

మోదీపై కేంద్రమంత్రుల ప్రశంసల జల్లు

నిర్ణయాత్మక నేతగా నరేంద్రమోదీకి అనుకూలంగా ప్రజలు ఓటు వేయడంతో గత తొమ్మిదేళ్లలో సామాన్యుల జీవితాల్లో అనూహ్య మార్పులు వచ్చాయని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు. కేంద్రంలో భాజపా-ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం దిల్లీలో ‘దూరదర్శన్‌’ నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. అవినీతిలో కూరుకుపోయి దీనస్థితిలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలో తొలి ఐదుస్థానాల్లో ఒకటిగా నిలిచేలా ఎదిగిందంటే దానికి కారణం మోదీ నాయకత్వమేనన్నారు. పలువురు ఇతర మంత్రులూ మోదీపై ప్రశంసలు కురిపించారు. 3.5 కోట్ల మందికి పక్కా ఇళ్లు, 12 కోట్ల ఇళ్లకు కుళాయి నీరు, 9.6 కోట్ల ఇళ్లకు వంటగ్యాస్‌ కనెక్షన్లు లభించడంతో పేదల జీవితాల్లో ఎంతోమార్పు వచ్చిందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తన ప్రసంగంలో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని