New parliament building: అధునాతనం.. స్ఫూర్తిదాయకం

దేశ రాజధాని నడిబొడ్డున అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.

Updated : 28 May 2023 08:43 IST

నేడు కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం
కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు.. కఠిన ఆంక్షలు
వేడుక బహిష్కరణపై పట్టు సడలించని విపక్షాలు
ప్రజాస్వామ్య దేవాలయం ఈ నూతన భవంతి: మోదీ
దిల్లీ

దేశ రాజధాని నడిబొడ్డున అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ వేడుకను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జరిపించకపోవడానికి నిరసనగా దాదాపు 20 విపక్షాలు దీనిని బహిష్కరించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. న్యూదిల్లీ మొత్తాన్ని నియంత్రిత ప్రాంతంగా ప్రకటించి, ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌ నుంచి తీసుకువచ్చిన తివాచీలు, త్రిపుర వెదురుతో సిద్ధం చేసిన గచ్చు, రాజస్థాన్‌లో రూపుదిద్దుకున్న శిలాకృతులు.. ఇలా దేశంలో భిన్న సంస్కృతుల మేళవింపుగా భవనాన్ని తీర్చిదిద్దారు. బ్రిటిష్‌ పాలకుల నుంచి అధికారం బదలాయింపునకు చిహ్నంగా తొలి ప్రధాని నెహ్రూ స్వీకరించిన చారిత్రక ‘ఉత్సవ రాజదండం’ (సెంగోల్‌)ను నూతన లోక్‌సభలో స్పీకర్‌ స్థానానికి సమీపంలో నెలకొల్పుతారు. ప్రత్యేకంగా రూపొందించిన రూ.75 నాణేన్ని విడుదల చేస్తారు. టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ నిర్మించిన కొత్త భవనంలో భారీస్థాయి ‘కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌’, ఎంపీల కోసం ఒక లాంజ్‌, గ్రంథాలయం, కమిటీ హాళ్లు, విశాలమైన పార్కింగ్‌ ఏర్పాట్లు ఉంటాయి. త్రికోణాకారంలో నాలుగంతస్తుల్లో నిర్మించిన భవనం మొత్తం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు.

నాగ్‌పుర్‌ టేకు.. అజ్‌మేర్‌ ఎర్ర గ్రానైట్‌

నూతన భవనంలో వాడిన టేకును మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నుంచి రప్పించారు. రాజస్థాన్‌లోని సర్‌మధుర నుంచి ఎర్ర చలువరాయిని తీసుకువచ్చారు. తెల్ల చలువరాయిని రాజస్థాన్‌లోని అంబాజీ నుంచి, కేసరియా ఆకుపచ్చరాయిని ఉదయ్‌పుర్‌ నుంచి, ఎర్ర గ్రానైట్‌ను అజ్‌మేర్‌ సమీపంలోని లఖా నుంచి, ఫర్నిచర్‌ను ముంబయి నుంచి రప్పించారు. అశోకచిహ్నం కోసం సామగ్రిని ఔరంగాబాద్‌ నుంచి, ఉభయసభల్లో భారీ గోడలపై అశోక చక్రం రూపొందించడానికి ఇందౌర్‌ నుంచి సామగ్రి తీసుకువచ్చారు. ఏక్‌భారత్‌.. శ్రేష్ఠ భారత్‌ స్ఫూర్తి పరిఢవిల్లేలా యావద్దేశానికీ ఏదోఒక రూపంలో ఈ భవన నిర్మాణంలో ప్రాతినిధ్యం లభించిందని ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు.


వృద్ధి ప్రస్థానం బలోపేతం

పార్లమెంటు నూతన భవనం.. ప్రజాస్వామ్య దేవాలయం. దేశ అభివృద్ధి ప్రస్థానాన్ని బలోపేతం చేసి, కోట్ల మందికి సాధికారత కల్పించడంలో, ప్రజాకాంక్షలను మరింత బలంగా నెరవేర్చడంలో ఇది తనవంతు భూమికను ఇకపైనా పోషించాలి.

నరేంద్రమోదీ, ప్రధాని


భారాస గైర్హాజరు!

ఈనాడు, హైదరాబాద్‌: నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి గైర్హాజరు కావాలని భారత్‌ రాష్ట్ర సమితి నిర్ణయించినట్లు సమాచారం. శనివారం సీఎం కేసీఆర్‌తో భారాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావులు ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది. నిర్ణయాన్ని బహిరంగంగా వెల్లడించనప్పటికీ భారాస పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి గైర్హాజరుపైనే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఎంపీలకు, పార్టీ నేతలకు అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.


పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవంపై ఎవరేమన్నారంటే..

ఎంపీలను విశ్వాసంలో తీసుకోలేదు

కొత్త పార్లమెంటు భవనం విషయంలో ఎంపీలను విశ్వాసంలో తీసుకోలేదు. మమ్మల్ని ఎవరినీ సంప్రదించలేదు. అందువల్ల ఈ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయం సబబే.

శరద్‌ పవార్‌, ఎన్సీపీ  


 కొత్త భవనం అవసరమే లేదు

పార్లమెంటు కొత్త భవనం కట్టాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారికి చరిత్ర అంటే గౌరవం లేదు. స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేనివారు చరిత్రను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.

నీతీశ్‌ కుమార్‌, బిహార్‌ ముఖ్యమంత్రి


విభేదాలు విడనాడి ఐక్యత చాటుదాం

పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని విపక్షాలు పునరాలోచించుకోవాలి. ప్రభుత్వంతో విభేదాలుంటే ఇతర వేదికలపై, పార్లమెంటు సమావేశాల్లో వినిపించుకోవచ్చు. రాష్ట్రపతిని ఈ వేడుకకు ఆహ్వానించి, తప్పిదాన్ని ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. లేదంటే అది చరిత్రలో ఘోర తప్పిదంగా మిగిలిపోతుంది.

కమల్‌హాసన్‌, సినీనటుడు, మక్కల్‌నీది మయ్యమ్‌ అధ్యక్షుడు


బహిష్కరణ నిర్ణయం అవమానకరం

పార్లమెంటు భవన వేడుకకు దూరంగా ఉండాలని విపక్షాలు తీసుకున్న నిర్ణయం అవమానకరం. పార్లమెంటు సమావేశాలనూ ఏదో ఒక కారణంతో విపక్షాలు అడ్డుకుంటూ వస్తున్నాయి.

అనురాగ్‌ ఠాకుర్‌, కేంద్రమంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని