అట్టహాసం.. సంప్రదాయబద్ధం

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త పుట చేరింది. 75 ఏళ్లు నిండిన స్వతంత్ర భారతదేశం అమృతోత్సవాలు నిర్వహించుకున్న తరుణంలో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు.

Published : 29 May 2023 05:35 IST

వేడుకగా నూతన పార్లమెంటు భవనం ప్రారంభం
మొత్తం ప్రధాని చేతుల మీదుగానే

ఈనాడు, దిల్లీ: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త పుట చేరింది. 75 ఏళ్లు నిండిన స్వతంత్ర భారతదేశం అమృతోత్సవాలు నిర్వహించుకున్న తరుణంలో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. దేశ, విదేశీ అతిథులు, అతిరథ మహారథుల సమక్షంలో రెండు భాగాలుగా ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. వృత్తాకారంలో ఉన్న పాత పార్లమెంటు భవనం పక్కనే త్రిభుజాకారంలో నూతన పార్లమెంటు భవనం ద్వారాలు తెరచుకుంది. ఉదయం 7.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు రెండు భాగాలుగా మొత్తం కార్యక్రమం ప్రధాని చేతులమీదుగా సాగింది. 

గణపతి హోమం.. 

ఉదయం 7.15 గంటలకు పార్లమెంటు ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ప్రధానమంత్రి తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజామండపంలోకి ఆహ్వానించారు. అక్కడ హోమగుండం వద్ద లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతో కలిసి గణపతి హోమం నిర్వహించారు. అదే మండపంలో ఏర్పాటుచేసిన సెంగోల్‌ దగ్గరకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశారు. 1947 ఆగస్టు 14వ తేదీ రాత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ అందుకున్న సెంగోల్‌ను తమిళనాడులోని ఆరు ఆధీనాలకు చెందిన మఠాధిపతుల చేతుల మీదుగా ప్రధాని స్వీకరించారు. దాన్ని పట్టుకొని ముకుళిత హస్తాలతో మఠాధిపతులు, వేదపండితుల దగ్గరకు వెళ్లి నమస్కరించి ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తిగతంగా ఆశీర్వచనాలు స్వీకరించారు. సెంగోల్‌ను చేతపట్టుకొని ఆత్మ ప్రదక్షిణలు చేశారు. వేదపండితులు వెంటరాగా రాజువెడలె రవితేజములలరుగా అన్నట్లు మేళతాళాల మధ్య ‘గజమార్గం’ ద్వారా కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించారు. అక్కడ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్పీకర్‌ స్థానం పక్కన ప్రత్యేక పీఠంపై సెంగోల్‌ను ప్రతిష్ఠించి పుష్పాంజలి ఘటించారు.  పంచముఖ దీపాన్ని వెలిగించి పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా పూర్తిచేశారు.

లోక్‌సభ వేదికగా ద్వితీయ ఘట్టం

నూతన భవనంలోని విశాల లోక్‌సభ వేదికగా ద్వితీయ ఘట్టం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైంది. తొలుత దేశ, విదేశాలకు చెందిన అతిథితులంతా ఆశీనులైన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్‌ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ల స్వాగతం, మోదీ... మోదీ అన్న భాజపా ఎంపీల నినాదాల మధ్య ప్రధాని లోక్‌సభలోకి ప్రవేశించి నేరుగా వేదికపైకి వెళ్లారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ స్వాగతోపన్యాసం చేసి కొత్త పార్లమెంటు భవనం ఉద్దేశాన్ని వివరించారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణం ఆవశ్యకత, సెంగోల్‌ చారిత్రక ప్రాధాన్యాలను వివరిస్తూ రెండు లఘుచిత్రాలు ప్రదర్శించారు. స్పీకర్‌ ప్రారంభోపన్యాసం, మోదీ సుదీర్ఘ ప్రసంగంతో కార్యక్రమం ముగిసింది. దీనిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పాలుపంచుకున్నారు.


కార్మికులకు సత్కారం

పార్లమెంటు భవన నిర్మాణంలో కీలకభూమిక పోషించిన కార్మికులకు ప్రధాని శాలువాకప్పి, జ్ఞాపికలు అందించి గౌరవించారు. కార్మికులకు నీరు, ఆహారం అందించిన పశ్చిమ సుందర్‌బన్‌కి చెందిన సత్యరంజన్‌దాస్‌, స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించిన ఝార్ఖండ్‌కు చెందిన భాయిరామ్‌ ముర్ము తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.


మోదీ కొత్త అధ్యాయం లిఖించారు

కేంద్ర మంత్రుల ప్రశంసలు

దిల్లీ: కొత్త పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేసి దేశ చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని ప్రధాని మోదీ లిఖించారంటూ కేంద్రమంత్రులు పొగడ్తల వర్షం కురిపించారు. అమృతకాలంలో ప్రతిరంగంలోనూ భారత ప్రగతి ప్రయాణం.. ఈ భవనంతోనే ప్రారంభం కానుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.సెంగోల్‌ను లోక్‌సభలో ఉంచడం ద్వారా.. భారత సంప్రదాయాలకు ప్రధాని సముచిత ప్రాధాన్యం ఇచ్చారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కేంద్రమంత్రులు జైశంకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, స్మృతి ఇరానీలు ఇది చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు.

91 ఏళ్ల వయసులో ఈ అద్భుతాన్ని ఊహించలేదు: దేవేెగౌడ

దిల్లీ: నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం... భారతదేశ చరిత్రలోనే ఓ మహోన్నత ఘట్టమని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. ‘‘32 సంవత్సరాల క్రితం ఈ గొప్ప పార్లమెంటులోకి అడుగుపెట్టినప్పుడు నేను ప్రధాని అవుతానని అనుకోలేదు. ఇంతకాలం ప్రజాజీవితంలో ఉంటాననీ భావించలేదు. వీటన్నింటి కంటే పెద్ద ఆశ్చర్యమేంటంటే నా జీవితకాలంలో కొత్త పార్లమెంటు భవనంలో కూర్చుంటానని ఊహించలేదు. 91 సంవత్సరాల వయసులో అది చేయగలిగాను’’ అని పేర్కొన్నారు.

షారుక్‌ ట్వీట్‌.. మోదీ రీట్వీట్‌

దిల్లీ: కొత్త భారతానికి నూతన పార్లమెంటు భవనం ప్రతీక అని బాలీవుడ్‌ నటులు షారుక్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ విడుదల చేసిన పార్లమెంటు భవన వీడియోకు తన వాయిస్‌ ఓవర్‌తో షారుక్‌ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో కొత్త భవనం..రాజ్యాంగ విలువలను, భారత దేశ వైవిధ్యాన్ని పరిరక్షిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోను ప్రధాని రీట్వీట్‌ చేశారు. అక్షయ్‌ కుమార్‌ కూడా తాను చిన్నతనంలో బ్రిటిష్‌ కట్టడాలనే ఎక్కువగా దిల్లీలో చూశానని, ఇప్పుడు కొత్త, భారీ పార్లమెంటు భవనాన్ని చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు. దీన్ని సుసాధ్యంచేసిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని