ప్రజాకాంక్షల ప్రతిబింబం

ప్రతి దేశ అభివృద్ధి యాత్రలో కొన్ని అజరామర క్షణాలుంటాయి. కొన్ని తేదీలు కాలపు లలాట ఫలకంపై చెరగని సంతకాలుగా మారుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి.. 2023 మే 28.

Updated : 29 May 2023 06:39 IST

పార్లమెంటు భవనం.. దృఢ సంకల్ప సందేశ మందిరం  
స్వాతంత్య్ర సమరయోధుల కలల సాకార మాధ్యమం
భవ్యమైన భవంతిని నిబద్ధతతో దివ్యంగా మార్చాలి
ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పిలుపు
బహిష్కరించిన విపక్షాలు
ఈనాడు - దిల్లీ

ప్రతి దేశ అభివృద్ధి యాత్రలో కొన్ని అజరామర క్షణాలుంటాయి. కొన్ని తేదీలు కాలపు లలాట ఫలకంపై చెరగని సంతకాలుగా మారుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి.. 2023 మే 28. స్వాతంత్య్ర అమృతోత్సవ తరుణాన ప్రజాస్వామ్యానికి ఈ కొత్త భవనాన్ని బహుమతిగా ప్రజలు ఇచ్చారు. ఇది భవనం మాత్రమే కాదు. ప్రజల ఆకాంక్షలు, కలల ప్రతిబింబం.

నరేంద్ర మోదీ


దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలు, కలల ప్రతిరూపమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. కార్మికులు చెమట ధారపోసి పార్లమెంటును భవ్యంగా తీర్చిదిద్దారని, ఇప్పుడు పార్లమెంటు సభ్యులు నిబద్ధతతో పనిచేసి దీన్ని దివ్యంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఇక్కడ చేసే ప్రతి చట్టం దేశాభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం కొత్త లోక్‌సభలో జరిగిన కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. అంతకుముందు శాస్త్రోక్తంగా, వేదమంత్రోచ్చారణలతో జరిగిన వేడుకలో ప్రధాని పాల్గొన్నారు. అధికార బదలాయింపునకు చిహ్నంగా నిలిచే సెంగోల్‌ను వినమ్రంగా స్వీకరించి, లోక్‌సభలో నెలకొల్పారు. పీఠాధిపతుల, పండితుల ఆశీస్సులు అందుకున్నారు. రాళ్లెత్తిన కొందరు కూలీలను సన్మానించి ప్రత్యేకత చాటుకున్నారు. రెండు విడతల్లో జరిగిన కార్యక్రమాన్ని అంతా తానై నడిపించారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముందు ప్రకటించినట్లుగానే ఈ కార్యక్రమాన్ని 21 విపక్షాలు బహిష్కరించాయి. దాదాపు 25 పార్టీలు హాజరయ్యాయి.
 

ప్రజాస్వామ్య మందిరం.. ఆత్మనిర్భర్‌కు సాక్షి 

‘‘ఇది దృఢసంకల్ప సందేశాన్నిచ్చే ప్రజాస్వామ్య మందిరం. ప్రణాళికను ఆచరణతో, విధానాలను అమలుతో, సంకల్పశక్తిని సిద్ధితో జోడించే వేదికగా ఇది నిలుస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసే మాధ్యమంగా మారుతుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌కు సాక్షిగా నిలుస్తుంది. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందడాన్ని ఈ భవనం చూస్తుంది. ప్రపంచం మొత్తం భారత్‌ను ఆశాభావంతో చూస్తోంది. భారత్‌ ఎప్పుడు ముందడుగు వేస్తుందో అప్పుడు ప్రపంచం ముందడుగు వేస్తుంది’’ అని మోదీ చెప్పారు.

సెంగోల్‌ నిరంతర ప్రేరణ

‘‘కొత్త భవనంలో పవిత్ర సెంగోల్‌ను కూడా ప్రతిష్ఠించాం. ఇది ఒకప్పుడు అధికార మార్పిడికి సాక్షిగా నిలిచింది. సెంగోల్‌ గౌరవాన్ని పునఃప్రతిష్ఠించినందుకు గర్వపడుతున్నాం. ఈ పార్లమెంటులో సమావేశాలు జరిగినప్పుడల్లా ఈ సెంగోల్‌ మనకు ప్రేరణ ఇస్తూనే ఉంటుంది. భారత్‌ కేవలం ప్రజాస్వామ్య దేశమే కాకుండా దానికి తల్లికూడా. ప్రజాస్వామ్యమే మనకు ప్రేరణ. రాజ్యాంగమే మన సంకల్పం. ఆ రెండింటి ప్రతిరూపమే పార్లమెంటు. ఇప్పుడు దేశం వలసపాలన ఆలోచనలను విడిచిపెడుతోంది. ఈ కొత్త భవనం అందుకు సజీవ సాక్ష్యం. అందుకే దీన్నిచూసి ప్రతి భారతీయుడూ గౌరవంతో తలెత్తుకుంటున్నాడు. ఈ భవనంలో వారసత్వ వైభవం, వాస్తు, కళ, కౌశలం, సంస్కృతి, సంవిధాన స్వరం ఉన్నాయి. జాతీయపక్షి నెమలి ఆధారంగా లోక్‌సభ, జాతీయ పుష్పం కమలం ఆధారంగా రాజ్యసభ నిర్మితమైంది. 

కార్మికుల శ్రమకు గుర్తుగా డిజిటల్‌ గ్యాలరీ

ఈ భవన నిర్మాణం 60వేలమంది కార్మికులకు ఉపాధి కల్పించింది. ఈ సౌధం కోసం వారంతా చెమటను ధారపోశారు. అందుకే వారి శ్రమను గుర్తిస్తూ ఒక డిజిటల్‌ గ్యాలరీ ఏర్పాటుచేశాం. బహుశా ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది ఉండదు. 9 ఏళ్లలో పేదలకోసం నిర్మించిన నాలుగు కోట్ల ఇళ్లు, 11 కోట్ల మరుగుదొడ్లు కూడా నాకు గర్వకారణం. ప్రజాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. స్వాతంత్య్రానికి 50 ఏళ్ల పూర్వం కూడా ఇలాంటి సమయం వచ్చింది. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా దేశంలో విశ్వాసాన్ని నింపారు. ప్రతి భారతీయుడిని స్వరాజ్య సంకల్పంతో అనుసంధానం చేశారు. ఆ ఫలితాన్ని మనం 1947లో స్వాతంత్య్రం రూపంలో చూశాం. ఈ అమృతకాలం కూడా భారత్‌ చరిత్రలో అలాంటి అధ్యాయమే. మన దగ్గర ఇప్పుడూ 25 ఏళ్ల అమృతకాలం ఉంది. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేసే లక్ష్యం పెద్దది. కఠినమైంది. దేశవాసులంతా ఈ లక్ష్యసాధనకు త్రికరణశుద్ధిగా కంకణబద్ధులు కావాలి. భారత్‌లాంటి సమస్యలు, సవాళ్లతో నిండిన పెద్ద దేశం ఒక విశ్వాసంతో ముందడుగు వేస్తే ప్రపంచానికి ప్రేరణ లభిస్తుంది.

విశ్వాసంలోనే విజయం

విశ్వాసంతో ముందడుగు వేయడంలోనే విజయం దాగి ఉంది. దేశమే ముందు అనే భావనతో మనం ముందుకెళ్లాలి. సరికొత్త దారులను తయారు చేసుకోవాలి. ప్రజా సంక్షేమాన్ని జీవన మంత్రంగా మార్చుకోవాలి. పార్లమెంటు కొత్త భవనంలో మన బాధ్యతలను జవాబుదారీతనంతో నిర్వహిస్తే ప్రజలకూ ప్రేరణ లభిస్తుంది. ఈ భవనంలోని ప్రతి ఇటుక, ప్రతి గోడ, ప్రతి కణం పేదల సంక్షేమం కోసం సమర్పితం. ఈ కొత్త భవనం నవభారత సృజనాత్మకతకు ఆధారంగా మారనుందని నాకు విశ్వాసం ఉంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.

దేశానికి గర్వకారణమిది: రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ వెలువరించిన సందేశాలను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ చదివి వినిపించారు. నూతన పార్లమెంటు భవనం మన దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి అన్నారు. ‘ఈ ప్రారంభ వేడుక మనదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది. దేశానికి దిశానిర్దేశం చేసే వెలుగురేఖ మన పార్లమెంటు. మన ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయి’ అని పేర్కొన్నారు. బానిస మనస్తత్వం నుంచి స్వేచ్ఛను ప్రసాదించి స్వాతంత్య్రానికి చిహ్నంగా కొత్త భవనం నిలుస్తుందని, ప్రజాకాంక్షలకు తగ్గ పరిష్కారాలను ఇస్తుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తంచేశారు. 

మోదీ దృఢ సంకల్పం వల్లే సాకారం: ఓంబిర్లా

ప్రధాని మోదీ దృఢ సంకల్పంతో నూతన పార్లమెంట్‌ భవనం సాకారమైందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. రెండున్నరేళ్లలోనే భవనం పూర్తయిందని తెలిపారు. క్రమశిక్షణతో హుందాగా, గౌరవప్రదంగా వ్యవహరించడం ద్వారా పార్లమెంటులో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాలని సహచర ఎంపీలకు సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 75 రూపాయల ప్రత్యేక నాణెం, తపాలా బిళ్లను విడుదల చేశారు.


తొలి వరుసలో జగన్‌.. సీఎంతో మాట్లాడిన జస్టిస్‌ పి.కె.మిశ్ర

నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొనడానికి దిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలోనూ పాలుపంచుకున్నారు. తొలివరుసలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ చెంతన ఆశీనులయ్యారు. కొద్దిసేపు హోంమంత్రి అమిత్‌షా పక్కన కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేశారు. అమిత్‌షా దగ్గరకు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతుండడంతో ఆయనతో మాట్లాడే అవకాశం జగన్‌కి పెద్దగా రాలేదు. దాంతో మళ్లీ తన సీట్లోకి వచ్చి కూర్చున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ పి.కె.మిశ్ర దూరాన ఉన్న తన సీట్లోంచి లేచి జగన్‌ వద్దకు వచ్చి కొద్దిసేపు మాట్లాడారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూర్చున్న చోటుకు జగన్‌ వెళ్లి నమస్కరించి వచ్చారు. భాజపా సీనియర్‌ నేతల్లో మురళీమనోహర్‌ జోషి ఒక్కరే పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో కనిపించారు. కొత్త లోక్‌సభలో ఆరు గ్యాలరీలు ఉండగా అన్నీ దేశ, విదేశీ అతిథులతో నిండిపోయాయి. 
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు