జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రెండో తరం నావిక్‌ ఉపగ్రహ శ్రేణిలో మొదటిది అయిన ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

Updated : 30 May 2023 07:00 IST

కక్ష్యలోకి చేరుకున్న ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహం

శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రెండో తరం నావిక్‌ ఉపగ్రహ శ్రేణిలో మొదటిది అయిన ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి సోమవారం ఉదయం 10.42 గంటలకు ఉపగ్రహంతో కూడిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 19 నిమిషాల వ్యవధిలో 2,232 కిలోల బరువు గల ఎస్‌వీఎస్‌-01(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-జే)ను 251 కి.మీ.ల ఎత్తులో నిర్దేశిత కక్ష్యలో ఉంచింది. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌ ప్రకటించారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగంలో క్రయోజనిక్‌ దశలో సమస్య తలెత్తడంతో దిద్దుబాట్లు, మార్పులు చేసి, జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగాన్ని విజయవంతం చేశామని తెలిపారు.

ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహం ఎల్‌1, ఎల్‌5, ఎస్‌ బ్యాండ్‌లలో పనిచేసే నావిగేషన్‌ పేలోడ్‌లను కలిగి ఉంది. ఉపగ్రహం రెండు సౌర పలకల శ్రేణుల ద్వారా శక్తిని పొందుతుంది. తద్వారా 12 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఇది పని చేయనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన రుబిడియం అటామిక్‌ క్లాక్‌ను ఉపగ్రహంలో అమర్చారు. వైమానిక సేవలు, నావిగేషన్‌, వ్యవసాయం, సర్వేయింగ్‌, అత్యవసర సేవలు, సముద్ర చేపల పెంపకం మొదలైన రంగాలకు ఈ ఉపగ్రహం నిర్దిష్టమైన సమాచారాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


విడిభాగాలు అందించిన అనంత్‌ టెక్నాలజీస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇస్రో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్‌ 12 రాకెట్‌కు, ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహ తయారీకి తాము కీలక విడిభాగాలు అందించినట్లు అనంత్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ.. జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్‌ 12కు అవసరమైన ఐఎన్‌ఎస్‌ సిస్టమ్స్‌, టెలిమెట్రీ ప్యాకేజీలైన డీఏయూ-1, డీఏయూ-2, సీ-ట్యాక్స్‌, పవర్‌ స్విచింగ్‌ మాడ్యూల్స్‌, సేఫ్‌ ఆర్మ్‌ రిలే యూనిట్లు, స్ట్రెయిన్‌ గేజ్‌ బ్యాలెన్సింగ్‌ యూనిట్లు సరఫరా చేసినట్లు వివరించింది. ఈ సంస్థకు చెందిన బెెంగళూరు యూనిట్‌ నుంచి    ఎన్‌వీఎస్‌-01కు సంబంధించి టెలిమెట్రీ, పవర్‌, సెన్సార్స్‌.. తదితర శాటిలైట్‌ సిస్టంలు అందించినట్లు పేర్కొంది. అనంత్‌ టెక్నాలజీస్‌ సీఎండీ డాక్టర్‌ సుబ్బారావు పావులూరి స్పందిస్తూ.. తాము సరఫరా చేసిన సిస్టమ్‌, ప్యాకేజ్‌లు సమర్థంగా పనిచేశాయని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని